వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం.. మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

by Dishafeatures2 |
వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం.. మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2024లో ఎన్నికలు వచ్చినా అంతకంటే ముందు వచ్చినా టీడీపీ సిద్దమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నిరంతరం సంపద సృష్టించి...ఆ సంపదను పేదలకు పంచి....పేదలను ధనికుడిని చేద్దాం అని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్‌కు ఆయన ఒక్కడే ధనికుడిగా ఉండాలి.. నా సంకల్పం ప్రజలు ధనికులుగా ఉండాలి. దీనికి సారథులు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేమగిరిలో మహానాడు వేడుకలో తొలిరోజు చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా మార్చే సత్తా తెలుగు దేశం పార్టీకే ఉంది. టెక్నాలజీ ద్వారా క్యాడర్‌కు....అధిష్టానానికి గ్యాప్ పోయింది. యువగళం అద్భుతంగా జరుగుతోంది. బాదుడే బాదుడు....బాగా చేశారు. వచ్చేది కురుక్షేత్రం.....ఆ యుద్దంలో వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం. శాసన సభను గౌరవ సభ చేసి అసెంబ్లీకి వెళదాం’అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

ఇక దూసుకుపోవడమే

‘ఈ మహానాడు ప్రత్యేకమైనది. క్యాడర్‌లో ఉత్సాహం పెరిగింది....ఎనర్జీ వచ్చింది. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకు పోదాం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఆయనను తెలుగు జాతి స్మరించుకుంది.తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన నాయకుడు...తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్. అలాంటి మహానాయకుడికి మనం వారసులం. రాజమహేంద్రవరం...ఎన్టీఆర్ మెచ్చిన నగరం. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు రాజమహేంద్రవరం వేదిక. నన్నయ..ఇక్కడే నడయాడాడు...కందుకూరి వీరేశిలింగం ఇక్కడే పుట్టాడు. ఇక్కడే కాటన్ నివసించాడు...ఈ ప్రాంతానికి సాగునీరు ఇచ్చాడు.

కాటన్ చేసిన సేవలకు గాను....ప్రతి ఊళ్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘ఇది చారిత్రిక మహానాడు....ఒకవైపు ఎన్టీఆర్ శతజయంతి....మరో వైపు 42 ఏళ్ల ప్రయాణం. తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడదాం అని సంకల్పం తీసుకుందాం. తెలుగు దేశం పార్టీ జెండా చూస్తే ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తుంది. పుసుపు రంగు అనేది శుభసూచకం. మన పార్టీ ఎంబ్లమ్ లో నాగలి, చక్రం, ఇల్లు పెట్టారు. రైతులను శాశ్వితంగా గుర్తుపెట్టుకోవాలని నాడు నాగలి పెట్టారు. శ్రమ జీవుల కోసం చక్రం పెట్టారు. పేదల కోసం ఇళ్లు పెట్టాడు. తెలుగు దేశం జెండా...తెలుగు జాతికి అండ. తెలుగు దేశం సింబల్ సైకిల్..ముందు చక్రం అంటే సంక్షేమం....రెండో చక్రం....అభివృద్ది. ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చింది. దాంతో ఇక దూసుకుపోవడమే’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

పేదలకు పెన్షన్ ఇచ్చిన మెుదటి పార్టీ టీడీపీ

‘తెలుగుదేశం పార్టీకి నాలుగేళ్లలో కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు. అరెస్టులు, కేసులు, దాడులకు ఏ ఒక్క నాయకుడు భయపడలేదు.మాచర్లలో చంద్రయ్యను చంపే సమయంలో అతన్ని జై జగన్ అంటే వదిలేస్తా అన్నారు...కానీ ప్రాణాలు వదులుకున్నాడు కానీ.....జై జగన్ అనలేదు. జై తెలుగుదేశం అని ప్రాణాలు ఇచ్చాడు. అందుకే చంద్రయ్య పాడె మోశాను. కుటుంబ పెద్దగా కార్యకర్తలకు అండగా ఉంటాను..తోడుగా ఉంటాను’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొని తెలుగు దేశం కార్యకర్తలు నిలబడ్డారు....మీ అందరి త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నా.....శిరసు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నా అని చంద్రబాబు సభలో ప్రకటించారు. ‘భవిష్యత్ లో మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది అని చెపుతున్నా.

ఎన్టీఆర్ శతజయంతి సాక్షిగా...ఈ మహానాడులో చెపుతున్నా....మీకు అండగా నేను ఉంటా. సంపద సృష్టించడమే కాదు ...పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగు దేశం పార్టీ’అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏపీలో సంక్షేమ పథకాలు మొదలు పెట్టిందే తెలుగు దేశం. రెండు రూపాయలకు కిలో బియ్యం, రైతులకు రూ.50 హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చాం. దేశంలో మొదటి సారి పేదలకు పెన్షన్ ఇచ్చిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. 2014లో రూ.200 పెన్షన్ ఉంటే....రూ.2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. 2014 తరువాత వందల సంఖ్యలో పథకాలు అమలు చేశాం. హైదరాబాద్ నగరాన్ని మనమే అభివృద్ది చేశాం. విభజన తరువాత ఏపీని అభివృద్ది చేయాలని పని చేశాను. 2029 నాటికి ఏపీని దేశంలో నెంబర్ 1 స్టేట్ చేయాలని పనులు చేశాం. వ్యవసాయంలో 11 శాతం వృద్ది రేటు సాధించాం. ఇరిగేషన్ పై 64 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

రాష్ట్రంలో సీఐడీ ప్రభుత్వం

రాష్ట్రంలో సీఐడీ ప్రభుత్వం ఉంది. సీఐడీ అంటే కరప్షన్, ఇన్ ఎఫిషియంట్, డిస్ట్రక్షన్ ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రివర్స్ టెండర్లు అన్నాడు...పరిపాలనను రివర్స్ చేశారు. ప్రజా వేదిక కూల్చి వేతతో పాలన మొదలు పెట్టాడు. అమరావతికి మనం రూపం ఇస్తే.....దాన్ని విధ్వంసం చేశాడు. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం లేదు. అమరావతి ని నాశనం చేసి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. పోలవరం పూర్తి అయ్యి నదుల అను సంధానం జరిగితే మంచి ఫలితాలు వచ్చేవి. ఒక్క రోడ్డు వేయలేదు...ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.....ప్రభుత్వ ఉగ్రవాదంతో ఒక్క పెట్టుబడి రాలేదు. జగన్ చెప్పిన జాబ్ క్యాలెండర్ లేదు....జాబ్స్ లేవు అని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఉద్యోగం రావాలి అంటే ప్రత్యేక హోదా కావాలి అని నాడు జగన్ అన్నాడు. 25 మందిని గెలిపిస్తే....ప్రత్యేక హోదా సాధిస్తాను అని...ఇప్పుడు మెడలు దించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. అమ్మఒడి ఒక నాటకం...నాన్న బుడ్డి వాస్తవం. ఎన్నికల సమయంలో మద్య పాన నిషేదం అని చెప్పిన పెద్ద మనిషి...మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు అని చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. జగన్ నాలుగేళ్ల తప్పిదాలపై చెప్పాలంటే మన ఒక్క మహానాడు సమయం సరిపోదు అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.

దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి

దేశంలో అందరి సీఎంల ఆస్తి రూ.508 కోట్లు అయితే వైఎస్ జగన్ ఒక్కడి ఆస్తి రూ.510 కోట్లు. ఇతను పేదల ముఖ్యమంత్రి అంటాడు అని చంద్రబాబు నాయుడు విమర్శించారు. దక్షిణ భారత దేశంలో తలసరి ఆదాయంలో చివరి స్థానంలో ఏపీ. అంటే ధనిక ముఖ్యమంత్రి.....పేద ప్రజలు అని ఎద్దేవా చేశారు. జగన్ ఇసుక, మద్యం, భూములు, గనులు..ఇలా ఏది దొరికితే అది దోచుకున్నాడు. నాలుగేళ్లలో రూ. 2.27లక్షల కోట్లు దోచుకున్నాడు అని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో ఎక్కువ ధరలు ఉండే రాష్ట్రం ఏపీ. ఎక్కడో ఉండే అమూల్‌ను ఏపీకి తెచ్చాడు ఈ అమూల్ బేబీ అని మండిపడ్డారు. ఏ స్కీం తీసుకున్నా.....అందులో స్కాం ఉంటుంది. ఈ సైకో పొట్ట పెద్ద అబద్దాల పుట్ట అని చంద్రబాబు ధ్వజమెత్తారు. లేచింది మొదలు అన్నీ అబద్దాలే. కోడికత్తి డ్రామా చూశారుకదా. ఇప్పుడు వివేకా హత్య పై మొత్తం తేలాలి. రావణాసుడు సీతను అపహరించినప్పుడు.....సాధువు వేషంలో వచ్చాడు. అప్పుడు నమ్మి సీత లక్ష్మణ రేఖ దాటుతుంది. అలాగే ఒక్క చాన్స్ అని వచ్చిన జగన్ దొంగ మాటలు చెప్పి వచ్చాడు.

మనం జగన్ ను ఇంటికి పంపాలి అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జగన్ రూ. 2000 నోట్లు దాచి పెట్టాడు. టీడీపీ పెద్ద నోట్ల రద్దు డిమాండ్ చేసింది. డిజిటల్ కరెన్సీ రావాలి అనేది మన డిమాండ్, విధానం అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ‘సంపద సృష్టించేది మనమే....సంపదను పంచేది మనమే. పి4 అనే విధానంతో పేదలను సంపన్నులను చేద్దాం. మీ అందరితో చర్చించిన తరువాత రేపు మ్యానిఫెస్టో లో ఫేజ్ 1 ప్రకటిద్దాం. ప్రజలు మెచ్చేలా...అదిరిపోయే సంక్షేమం చేద్దాం. రాజమహేంద్రవరం అదిరిపోయింది....రేపు దద్దరిల్లి పోతుంది. రాష్ట్రంలో ఉండే అందరి చూపూ రాజమండ్రి పైనే. అన్ని రోడ్లూ రాజమండ్రి వైపే వస్తాయి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Next Story