సోమారం గ్రామ సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు..

by Disha Web Desk 11 |
సోమారం గ్రామ సర్పంచ్ పై సస్పెన్షన్ వేటు..
X

దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ మండల పరిధిలోని సోమారం గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. సోమారం గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై డివిజన్ పంచాయతీ అధికారి ఎంపీవోకు విచారణకు ఆదేశించారు. నిబంధనలకు విరుద్దంగా రూ.11,79,407 అభ్యంతర ఖర్చు చేసినట్టు, తిరిగి రాబట్టవలసిన ఖర్చులు రూ.8,08,423 దుర్వినియోగం చేసినట్టు వచ్చిన ఆరోపణలపై నివేదిక సమర్పించాలని డీఎల్పీవో కోరారు. అలాగే సర్పంచ్ కరుణాకర్ రెడ్డిపై పంచాయతీ సమావేశాలు నిర్వహించడం లేదని, పంచాయతీ పరిధిలోని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పలువురు వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు.

ఈ ఆరోపణలు విచారణ జరిపిన ఎంపీవో నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా సర్పంచ్ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా నివేదిక సమర్పించని కారణంగా ఎంపీవో నివేదికతో ఏకభవిస్తూ కరుణాకర్ రెడ్డిని సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి రాబట్టాల్సిన మొత్తం రూ.8,08,423లో సర్పంచ్, ఉప సర్పంచులు రూ.4,03,211.50 చొప్పున పంచాయతీ నిధులకు ఏడు రోజుల్లో జమ చేయాలని ఆదేశించారు. లేనిచో రెవెన్యూ ఆర్ఆర్ చట్టం కింద రాబట్టాల్సి ఉంటుందని కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Next Story