కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపుతున్న సునీల్ కనుగోలు రిపోర్ట్

by Disha Web Desk |
కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపుతున్న సునీల్ కనుగోలు రిపోర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది. సామాజిక అంశాల వారిగా బేరీజు వేసుకుని ఎవరికి టికెట్ ఇవ్వాలనేదానిపై చర్చలు జరుపుతోంది. బుధవారం మునుగోడు కాంగ్రెస్ ఆశావాహులతో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, ఇతర పార్టీ ప్రముఖులు భేటీ కాగా గురువారం కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయింది. గత రాత్రే ఓ హోటల్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కీలక సమాచారంతో కూడిన రిపోర్ట్ ను మాణిక్కం ఠాగూర్‌కు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేడు జరగబోతున్న సమావేశానికి తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చెరుకు సుధాకర్‌ను పార్టీ పెద్దలు చర్చలకు పిలిచారు. చెరుకు సుధాకర్‌ను తన క్యాంప్ కార్యాలయానికి రావాల్సిందిగా మాణిక్కం ఠాగూర్ ఆహ్వానించడం ఆసక్తిని రేపుతోంది. పార్టీలో టికెట్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న క్రమంలో ఇవాళ చెరుకు సుధాకర్‌ను ఒక్కరినే పిలవడం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త చర్చలకు కారణం అవుతోంది. చెరుకు సుధాకర్ వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నారా అనే టాక్ మొదలైంది.

మునుగోడు నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా బరిలో దింపితే ఎలా ఉంటుందనేది కూడా పార్టీ పెద్దలు చర్చిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందని ఈ దిశగా ఆలోచన చేయాలని సునీల్ కనుగోలు తన రిపోర్ట్ లో పేర్కొన్నాడని తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా బీసీ వ్యక్తినే పోటీకి దించుతారా లేక రెడ్డి సామాజిక వర్గానికే టికెట్ కట్టబెడతారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్‌తో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చెరుకు సుధాకర్ విషయంలో పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోనుందనేది ఆసక్తిని రేపుతోంది. ఇంతకు ఆయనకు టికెట్ లభిస్తుందా లేక మరేదైనా హామీ ఇచ్చి మునుగోడులో బీసీ వ్యక్తిని బరిలోకి దించుతారా అనేది తేలాల్సి ఉంది.

చెరుకు సుధాకర్ రాకను ఇప్పటికే పార్టీలోని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సహా కొంత మంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో బీసీల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నాయనే సునీల్ కనుగోలు నివేదిక నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం రాబోతోందనేది కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ పెట్టిస్తోంది. బీజేపీ నుండి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు బరిలోకి దిగితే కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోయేది బీసీనా? లేక రెడ్డినా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇవాళ్టి చర్చలతో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది ఓ కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయే టాక్ గాంధీ భవన్ వర్గాల నుండి వ్యక్తం అవుతోంది. మరి చెరుకు సుధాకర్ పోటీలో ఉంటారా లేక సామాజిక సమీకరణాల కారణాలతో బౌన్స్ అవుతారా అనేది తేలాల్సి ఉంది.

టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు.. 5 నిమిషాల్లోనే రాజీనామా ఎలా ఆమోదిస్తారు? : రేవంత్ రెడ్డి



Next Story