మునుగోడులో కేసీఆర్‌కు వరుస షాక్‌లు!

by Disha Web Desk |
మునుగోడులో కేసీఆర్‌కు వరుస షాక్‌లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని రాజకీయ పార్టీలు మునుగోడు జపం చేస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో తప్పక గెలిచి తీరాలని కృషి చేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ జెండా పాతడం ద్వారా రాబోయే ఎన్నికల్లో గెలుపుకు మార్గం మరింత సుగమనం చేసుకోవాలని టీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. గెలుపు విషయంలో టీఆర్ఎస్‌లో పైకి కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని టెన్షన్ పెట్టిస్తోందట. మునుగోడు అభ్యర్థి ఖరారు విషయంలో టీఆర్ఎస్ ఇప్పటికీ తర్జన భర్జన పడుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి వర్గం పట్టుపడుతుండగా ఈ నిర్ణయాన్ని మరి కొంత మంది లోకల్ లీడర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ కు తెర దించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం ప్రగతి భవన్‌లో నియోజకవర్గ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.

కేసీఆర్‌కు షాక్ తప్పదా?

అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రచారంపై దృష్టి సారించాయి. అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉంది. కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పార్టీలో ముసలం ముదరకుండా కావాలనే ఈ తరహా ఆలస్యం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే కూసుకుంట్లకు టికెట్ ఇస్తే తాము పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స్థానిక నేతలు తీర్మానాలు సైతం చేశారు. తాజాగా ప్రగతి భవన్ లో మీటింగ్ జరుగుతుండగా బుధవారం చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీటీసీలు అవ్వారు గీత, చెరిపల్లి భాస్కర్ టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేశారు. వారంతా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీకి గూటికి చేరిపోయారు. తాజాగా పార్టీ మారిన వారు మంత్రి జగదీశ్ రెడ్డికి సన్నిహితులే అనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఓ వైపు పార్టీ అధినేత మునుగోడు నేతలతో కీలక భేటీలు నిర్వహిస్తుంటే లోకల్ లీడర్లంతా పార్టీని వీడుతుండటం చూస్తుంటే కేసీఆర్ ఆలోచన పట్ల స్థానిక నేతలు సానుకూలంగా లేరని, ఇదే ధోరణితో పార్టీ ముందుకు వెళ్తే మరి కొంత మంది లీడర్లు కారు దిగి కమలం లేదా కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అభ్యర్థి లేకుండానే ప్రచారం

టీఆర్ఎస్ ప్రస్తుతం అభ్యర్థి పేరు లేకుండా కేసీఆర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్ నిర్ణయాలను చూసి ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థిస్తోంది. ఇందుకోసం ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు వంటి కార్యక్రమాలను ఉపయోగించుకుంటున్నది. కానీ గ్రామ స్థాయిల్లో అభ్యర్థి లేకుండా ఎవరికి ఓటు వేయమని చెప్పాలో అర్థం కావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థి విషయంలో తాము ఎంత చెప్పినా మంత్రి జగదీశ్ రెడ్డి ఒంటెద్దు పోకడ వెళ్తున్నారని స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ అంశంలో అధిష్ఠానం పునరాలోచన చేసుకుంటే సరే.. లేకుంటే పార్టీ మారడమే తరువాయి భాగం అనేలా కొంత మంది టీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు తెస్తోంది. పార్టీలో ఉన్న వారినైనా కాపాడుకునేందుకు అనేక తాయిలాలు ప్రకటిస్తున్నారని అయినా కూసుకుంట్ల అభ్యర్థిత్వంపై ఆలోచన చేయాల్సిందే అనే డిమాండ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ వైపు బీజేపీని ఎదుర్కోవాలని ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్‌కు సొంత పార్టీ నేతల నుండి వస్తున్న వ్యతిరేకత పెద్ద మైనస్‌గా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఈ సిట్యుయేషన్‌ను గులాబీ బాస్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి మరి.

Also Read : పేదల మనిషి కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారు


Next Story

Most Viewed