జాతీయవాదం కాదు.. వారిది పిరికితనమే.. రాహుల్ గాంధీ

by Dishafeatures2 |
జాతీయవాదం కాదు.. వారిది పిరికితనమే.. రాహుల్ గాంధీ
X

రాయ్‌పూర్: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పార్లీ ప్లీనరీ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వారిది పిరికితనమని.. బలవంతులకు లొంగిపోయే సవార్కర్ సిద్ధాంతమని.. దీన్ని జాతీయవాదమని పిలుస్తారా అని ప్రశ్నించారు. ఆదివారం 85వ ప్లీనరీ ముగింపు సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ చేశారు. ‘ఓ మంత్రి ఇంటర్వ్యూలో చైనా కన్నా భారత్ చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు. ఇలా అయితే ఎలా పోటీ చేస్తాం? మనం బ్రిటిష్ వారితో పోరాటం చేసినపుడు మన ఆర్థిక వ్యవస్థ వారి కన్నా పెద్దదా? ఇది పిరికితనమే’ అని దుయ్యబట్టారు. సవార్కర్ సిద్ధాంతం ఇలాగే ఉంటుందని.. బలవంతుల ముందు లొంగిపోతారని విమర్శించారు.

మరోవైపు లాల్ చౌక్ లో త్రివర్ణ పతకాన్ని ప్రధాని ఎగురవేసానని చెప్పడంపై రాహుల్ మాటల దాడికి దిగారు. ఆయన 1991లో ఏక్తా యాత్ర సమయంలో జమ్ము పర్యటనలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారని, పీఎం హోదాలో కాదని ఎద్దేవా చేశారు. బీజేపీ కశ్మీర్లో తీసేసిన ప్రేమను మేము జోడో యాత్ర ద్వారా యువతలో కలసి జాతీయ పతాకంపై నింపామని చెప్పారు. యాత్ర ద్వారా ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్నానని, వారికి మరింత చేరువయ్యే అవకాశం దొరికిందని చెప్పారు. తనకు కశ్మీర్ ఇల్లు వలె కనిపించిందని అన్నారు. మరోవైపు అదానీ వ్యవహరంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని మరోసారి ఉద్ఘాటించారు.

పార్లమెంటులో అదానీపై ఎలాంటి ప్రశ్నలు వేయలేకపోయినప్పటికీ, నిజాలు బయటకు వచ్చే వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. బీజేపీ అదానీకి ఎందుకు కాపలా ఉంటుందని ప్రశ్నించారు. మరోవైపు ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ప్రతిపక్షాల నుంచి చాలా ఆశిస్తున్నారని ఐక్యం పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీతో పోరాడే ధైర్యం మీకు ఉందని తెలుసు, దేశం కోసం ఆ ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed