మేఘాలయ ఎన్నికలు: బీజేపీ మేనిఫెస్టో ఇదే..!

by Dishafeatures2 |
మేఘాలయ ఎన్నికలు: బీజేపీ మేనిఫెస్టో ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ నెల 27న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఎంపవర్డ్ మేఘాలయ (eMpowered Meghalaya) అనే పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 'M' అంటే మోడీ ఫర్ మేఘాలయ అని నడ్డా స్పష్టం చేశారు. తన మేనిఫెస్టోలో బీజేపీ మేఘాలయ ప్రజలకు అనే వరాలు గుప్పించింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 7వ పే కమిషన్ అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మహిళల అభివృద్ధి కోసం 'క ఫన్ నోంగ్లైట్' స్కీమ్ ను ప్రవేశపెట్టి అనేక కార్యక్రమాలు చేపడాతామని చెప్పారు.

బాలిక పుడితే ఆమె పేరు మీద రూ.50 వేల బాండ్ చెల్లిస్తామని, అలాగే బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. అదే విధంగా ఒంటరి మహిళలు, వితంతువులకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందిస్తామని నడ్డా తెలిపారు. ఉజ్వల పథకం కింద ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. కిసాన్ సమ్మాన్ కింద ఏడాదికి ప్రతి రైతుకు 8 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందజేస్తామన్న నడ్డా.. వృద్ధుల పెన్షన్ ను డబుల్ చేస్తామని హామీ ఇచ్చారు. అవినీతి రహిత పాలనే తమ ధ్యేయమని, రాష్ట్రంలో అవినీతి నిర్మూలన కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు ఈశాన్య రాష్ట్రాలు పేరు పొందాయని, కానీ దురదృష్టవశాత్తు అక్కడ జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని నడ్డా చెప్పారు. మేఘాలయ రాష్ట్రంలో ప్రకృతి వనరులకు కొదువలేదని, తాము అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అంతిమంగా మేఘాలయను 'శాంతియుత, అభివృద్ధి చెందిన, సంపన్న' రాష్ట్రంగా మార్చడమే బీజేపీ లక్ష్యమని నడ్డా స్పష్టం చేశారు. కాగా.. మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా.. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.



Next Story

Most Viewed