చంద్రబాబు దారిలో KCR.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?

by Disha Web Desk 2 |
చంద్రబాబు దారిలో KCR.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ విభేదాలు ఉన్నాయి. అలాంటి కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు బాటలో ప్రయాణించేందుకు సిద్ధం అయ్యారు. గతంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం ఇప్పుడు కేసీఆర్ దేశవ్యాప్తంగా అమలు చేయాలని పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్డీయేకు గుడ్ బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్‌‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్ సీఎం నితీష్ కుమార్‌తో సీఎం కేసీఆర్ భేటీ జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీని ఎలాగైనా ప్రాంతీయ పార్టీల ఐక్యతతో నిలువరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న నాయకులను వ్యక్తిగతంగా కలుస్తూ వారి మద్దతును కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో గత బుధవారం బిహార్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్ అక్కడ సంచలన అభిప్రాయాలు వ్యక్తపరడచం చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబు బాటలో కేసీఆర్:

బిహార్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ జాతీయ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కేసీఆర్ ఫైర్ అయ్యారు. విపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసం ఇలాంటి చర్యల వల్ల ఈడీ, సీబీఐల ప్రతిష్ట మంట కలుస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ తరహా దాడులు ఆగాలంటే విచారణకు వీలుగా సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్‌ను అన్ని రాష్ట్రాలు నిరాకరించాలని పిలుపునివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్‌లోని సెక్షన్ - 6ను అనుసరించి రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన సాధారణ అంగీకరాన్ని వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్లు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయ సహా తొమ్మిది రాష్ట్రాలు తమ పరిధిలోని కేసులను సీబీఐ విచారించేందుకు సాధారణ సమ్మతిని ఇప్పటికే ఉపసంహరించుకున్నాయి. గతంలో చంద్రబాబు ఏపీలో ఇదే తరహా నిర్ణయం తీసుకోవడం తీవ్ర వివాదాస్పదం అయింది. తాజాగా ఇదే దారిలో సీఎం కేసీఆర్ వెళ్లాలని నిర్ణయించుకోవడమే కాకుండా మిగతా రాష్ట్రాలు తన దారిలోనే రావాలని పిలుపునివ్వడం చర్చకు దారితీస్తోంది.

కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?

నిజానికి కేసీఆర్ అభిప్రాయం వెనుక రకరకాల రాజకీయ విశ్లేషణలు వినిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని ఇటీవల ప్రతిపక్షాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. త్వరలో కేసీఆర్ అవినీతి చిట్టా అంతా బయటకు తీస్తామని బీజేపీ నేతలు చెప్పడం ముఖ్యమంత్రికి జైలు ఖాయం అని బహిరంగంగా కామెంట్లు చేయడం రాష్ట్ర రాజకీయాన్ని హీటెక్కిస్తోంది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేయడం, ఈ కేసుకు తెలంగాణతో సంబంధాలు ఉన్నాయని లీకులు రావడం సంచలనం రేపుతోంది. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలపై తరచూ ఈడీ చేస్తున్న దాడులు, చీకోటి వ్యవహారం ఇలా ప్రతి కేసులో టీఆర్ఎస్ నేతలకు ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ కేంద్ర దర్యాప్తు సంస్థలను నిలువరించే ప్రయత్నం ఏ మేరకు ఫలితాని ఇస్తుందనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఎదైనా ఉంటే దర్యాప్తును ఎదుర్కోవాలి కాని ఇలా అడ్డుకోవడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు విషయంలో ఇదే జరిగిందని, అలాంటి నిర్ణయమే కేసీఆర్ గనుక తీసుకుంటే ఆయనకు ఇదే పరిస్థితి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతున్న తరుణంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విషయంలో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠగా మారింది.

Also Read : 2024 విపక్షాల ప్రధాని అభ్యర్థిపై కేసీఆర్ క్లారిటీ


Next Story