కేసీఆర్ టార్గెట్‌గా గద్దర్ సంచలన నిర్ణయం..

by Nagaya |
కేసీఆర్ టార్గెట్‌గా గద్దర్ సంచలన నిర్ణయం..
X

దిశ బ్యూరో, సంగారెడ్డి : ప్రజా యుద్ధనౌక గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. తాను పుట్టి పెరిగిన తూప్రాన్‌లో రాజకీయంగా తన శేషజీవితాన్ని గడపాలనుకుంటున్నారు. ఈ మేరకు త్వరలోనే అల్వాల్ వెంకటాపూర్ నుంచి తన మకాంను తూప్రాన్ మార్చుకుంటున్నారు. తన సోదరుడు నరసింగరావు ఇంట్లో ఉండి రాజకీయ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు తనకు సెక్యూరిటీ కల్పించాలని గద్దర్ తూప్రాన్ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై పోటీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన మీడియాకు వెల్లడించడం గమనార్హం. గద్దర్ నిర్ణయం రాజకీయం వర్గాల్లో సంచలనం సృష్టిస్తుండగా గజ్వేల్ సెగ్మెంట్ లో హాట్ టాపిక్ గా మారింది.

2+2 సెక్యూరిటీ కల్పించండి...

తాను కోరవడంతో గతంలోనే ప్రభుత్వం తనకు రివాల్వార్‌కు అనుమతి ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన తూప్రాన్ ఉండటానికి 2+2 సెక్యూరిటీ కల్పించాలని మంగళవారం తూప్రాన్ సీఐ శ్రీధర్‌కు విన్నవించుకున్నారు. ఈ మేరకు రాతపూర్వకంగా కూడా దరఖాస్తు ఇచ్చారు. ఆ తరువాత కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను ఇక తూప్రాన్‌కు మకాం మార్చుతున్నానని, సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధం అవుతున్నట్లు స్వయంగా వెల్లడించారు.

10 వేల మందితో భారీ బహిరంగసభ...

త్వరలోనే తూప్రాన్ పట్టణంలో 10 వేల మందితో భారీ బహిరంగసభ నిర్వహించడానికి గద్దర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కవులు, కళాకారులు, మేధావులు ఇతర వర్గాలతో కలిసి వరంగల్‌లో భారీ సభ నిర్వహించాలకున్నారు. అదే సభను ఇప్పుడు 10 వేల మందితో తూప్రాన్‌లో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సభ ద్వారా గద్దర్ రాజకీయ ప్రస్థానం మొదలుకానున్నదని సన్నిహితుల వద్ద పేర్కొన్నారు. ఇక తన శేషజీవితాన్ని మొత్తం రాజకీయంగా గజ్వేల్‌లోనే గడపాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

సెగ్మెంట్ గజ్వేల్.. జిల్లా మెదక్...

సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని తూప్రాన్ మెదక్ జిల్లా పరిధిలో చేరింది. జిల్లాల ఏర్పాటు తరువాత తూప్రాన్ మండలం మెదక్ జిల్లాలో కలవగా నియోజకవర్గ పరిధి మాత్రం గజ్వేల్‌లో ఉన్నది. గద్దర్ రాజకీయంగా తన కార్యకలాపాలు మొదలు పెడితే ఆ ప్రభావం మెదక్, సిద్దిపేట రెండు జిల్లాలపై పడనున్నది. స్థానికంగానే ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధాలను ప్రజా క్షేత్రంలోనే ఎండగడతానని గద్దర్ చెబుతున్నారు. అయితే ఆయన రాజకీయ కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉండనున్నాయని, ఏ మేరకు ప్రభావం చూపించనున్నానేది వేచి చూడాల్సి ఉన్నది. గద్దరు రాజకీయ అరంగేట్రం మాత్రం దేశ వ్యాప్తంగా చర్చానీయాంశం అయ్యే అవకాశాలున్నాయి.

గజ్వేల్‌తో సన్నిహిత సంబందాలు...

గజ్వేల్ నియోజకవర్గంతో గద్దర్‌కు సన్నిహిత సంబందాలున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో తూప్రాన్, గజ్వేల్, వర్గల్, ములుగు, మర్కుక్, జగదేవ్ పూర్, కొండపాక, మనోహరాబాద్ మండలాలున్నాయి. వీటిలో తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు మెదక్ జిల్లా పరిధిలో ఉన్నాయి. తూప్రాన్‌లో పుట్టిపెరిగిన గద్దర్ ఆ తరువాత సికింద్రాబాద్ అల్వాల్ పరిధిలోని వెంకటాపూర్‌లో నివాసముంటున్న విషయం తెలిసిందే. వివిధ కార్యక్రమాలకు ఇక్కడకు వస్తుంటారు. తన సోదరుడు నరసింగరావు ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నారు. గద్దరు ఇప్పుడు ఆయన ఇంటిలోనే ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి దళిత సంఘాలు, ఇతర కుల సంఘాల ప్రతినిధులు గద్దరును కలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకు గద్దరు వస్తుంటారు. ప్రజా ఉద్యమాలు మొదలుకుని ఇప్పటి వరకు ఆయన స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటారు. ఆయన ఎక్కడ ఉన్నా గజ్వేల్ ప్రాంతం వారితో సన్నిహిత సంబందాలు అలాగే కొనసాగించారు.

Next Story