అక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాలను ఆపలేరు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

by Dishafeatures2 |
అక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాలను ఆపలేరు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా, తుర్కయంజాల్‌ పరిధిలోని మన్నెగూడెంలో ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సీపీఐ నాయకుల మీద సెక్షన్‌ 447, 427,153/ఎ, 353, 34 ఐపీసీ సెక్షన్ల క్రింద అక్రమ కేసులు పెట్టి, జైళ్ళకు పంపించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. భూ కబ్జాకోర్లకు ప్రభుత్వ భూమిని అధికారులు అక్రమంగా అప్పజెపుతుంటే దాన్ని అడ్డుకొని, పేదవారికి పంచే ప్రయత్నం సీపీఐ నాయకులు చేశారని, అలాంటి నాయకుల పై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.

అక్రమ కేసుల ద్వారా భూ పోరాటాలను అణచివేయలేరని, పేదలకు ఇంటి స్థలాలు వచ్చే వరకు సీపీఐ పోరాడుతూనే ఉంటుందని, ఎన్ని నిర్భంధాలు విధించిన పోరాటాలకు వెనకడుగు వేసేదే లేదన్నారు. నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అడగడం నేరమా అని ప్రశ్నించారు. జిల్లాలలో ప్రభుత్వ భూములలో భూ కబ్జాదారులు కబ్జాలకు పాల్పడుతుంటే అధికారులు, ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతున్నదని, పేదవాడు 60 గజాల ఇంటి స్థలం కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే తక్షణమే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని వివరించారు. అరెస్టు చేసిన సీపీఐ నాయకులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కూనంనేని డిమాండ్‌ చేశారు.

Next Story

Most Viewed