కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న లూటీని దేశం చూస్తోంది: Bandi Sanjay Kumar

by Disha Web Desk 2 |
కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న లూటీని దేశం చూస్తోంది: Bandi Sanjay Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ పాలనలోని డబుల్ ఇంజిన్ సర్కార్ బీఆర్ఎస్ కారును తుక్కు తుక్కు(స్క్రాప్)గా చేస్తుందని, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను ఎలా లూటీ చేసి దోచుకుంటుందో మొత్తం దేశమంతా చూస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ప్రజలను దోచుకోవడం ద్వారా కల్వకుంట్ల కుటుంబ ఆదాయం ఎలా పెరిగిందనేది కూడా ప్రజలు చూస్తున్నారు, అందుకే ట్విట్టర్ టిల్లు కుటుంబం వణికిపోతోందని బండి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పైకి శతృవులుగా నటిస్తూ ఢిల్లీలో మాత్రం దోస్తీ చేస్తున్నారని సంజయ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఇన్నిరోజులు విస్మరించిన సర్కార్.. కేవలం ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వంలో విలీనం చేసిందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదని, రైతులు, యువత, 317 జీవో ద్వారా టీచర్లు ఇబ్బందులు పడినా ఏనాడూ ఈ సర్కార్ పట్టించకున్న పాపాన పోలేదన్నారు.

ధనిక రాష్ట్రమని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఎందుకివ్వలేకపోతున్నారని బండి ప్రశ్నించారు. మిషన్ భగీరథ నిధులు దుర్వినియోగం చేశారని, అలాగే మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం కేటాయించిన నిధులను సైతం దొంగిలించారని ఆయన ఆరోపణలు చేశారు. పేదలకు మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం కోసం డబ్బులు ఎలా వసూలు చేశారని బండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులకు కేటాయించిన నిధులను సైతం దారిమళ్లించిన సర్కార్.. కేసీఆర్ ది అని విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఎందుకు సహకరించడంలేదో సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై ఇంకెన్ని అబద్ధాలు చెబుతారని బండి సంజయ్ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story