రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం దావా.. ఈ సారి కేసు పెట్టింది ఎవరంటే?

by Dishafeatures2 |
రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం దావా.. ఈ సారి కేసు పెట్టింది ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్: మోడీ ఇంటి పేరు వ్యవహారంలో దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఎంపీ పదవిని కోల్పోయారు. తాజాగా రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు దాఖలైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా 2023 జనవరి 9న హర్యానాలోని అంబాలా ప్రాంతంలో పర్యటించిన రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 21వ శతాబ్దపు కౌరవులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కౌరవులు ఖాకీ నెక్కర్లు వేసుకుంటారని, చేతిలో లాటీ పట్టుకు తిరుగుతారని అన్నారు.

దేశానికి చెందిన ఇద్దరు ముగ్గురు బిలీయనీర్లు వాళ్ల తరఫున ఉన్నారని చెప్పారు. అయితే రాహుల్ ఈ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ మండిపడింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ కు చెందిన కమల్ బదౌరియా హరిద్వార్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 12న కోర్టుకు హాజరు కావాలని హరిద్వార్ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు పంపింది.

Next Story

Most Viewed