సింగాపురం వారసుల ఎంట్రీకి రంగం సిద్ధం

by  |
సింగాపురం వారసుల ఎంట్రీకి రంగం సిద్ధం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో బలమైన ముద్ర వేసుకున్న ఆ కుటుంబ వారసులు రంగంలోకి దిగబోతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో పట్టున్న ఆ ఇద్దరి మనవళ్లు ఇప్పుడు పాలిటిక్స్‌లో తమ ప్రాభవాన్ని చాటుకునే ప్రయత్నాల్లో మునిగి పోయారు. జిల్లాలోని హుజురాబాద్ సమీపంలోని సింగాపురం గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. భారత ప్రధానిగా పని చేసిన పీవీ నరసింహరావు సమీప బంధువు వొడితెల రాజేశ్వరరావు ఉరఫ్ సింగాపురం రాజేశ్వరరావు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. పీవీ ప్రాముఖ్యత తగ్గిపోయిన తర్వాత వొడితెల రాజేశ్వరరావు కూడా తెర మరుగయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముందు పరోక్ష సహకారం అందించారు. అయితే ఆ కుటుబం నుండి కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీఆర్ఎస్ తరఫున గెలిచి ఓ సారి మంత్రిగా కూడా పని చేశారు. రాజేశ్వరరావు కొడుకు కిషన్ రావు హుజురాబాద్ వైస్ ఎంపీపీగా పని చేసినా క్రియాశీలక రాజకీయాల్లో పట్టు సాధించలేకపోయారు. దీంతో అప్పటి నుండి కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబమే రాజకీయాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం కెప్టెన్ రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా ఆయన కొడుకు సతీష్ బాబు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

వారసుల ఎంట్రీ..

ఓ వైపు కెప్టెన్ తనయుడు సతీష్ బాబు తనయుడు ఇంద్రనీల్ బాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న సంకేతాలు ఇచ్చేశారు. యూత్‌తో మమేకం కావడం, స్పోర్ట్స్ వంటి ప్రోగ్రామ్స్ చేపట్టారు. అంతేకాకుండా ఇంద్రనీల్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు. మరో వైపు వొడితెల రాజేశ్వరరావు మనవడు ప్రణయ్ బాబు కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైదాపూర్ జడ్పీటీసీగా పోటీ చేసేందుకు ప్రణయ్ ప్రయత్నించారు. టీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. అప్పటి నుండి అటు హుస్నాబాద్, ఇటు హుజురాబాద్ ప్రాంతంలో చాలామందితో టచ్ లో ఉంటున్నారు. గత నెల నుంచి తరుచూ హుజురాబాద్ సమీపంలోని సింగాపురం వస్తున్న ప్రణయ్ బాబు తమ కుటుంబంతో అనుభందం ఉన్న వారిని వ్యక్తిగతంగా కలుస్తున్నారు. గతంలో కెప్టెన్ ఎన్నికల సమయంలో ప్రణయ్ బాబు తండ్రి శ్రీనివాస్ రావు రెండు మండలాలకు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. అటు తండ్రి ఇటు తాత పరిచయాలను ఆసరాగా చేసుకుని ప్రణయ్ ముందుకు సాగుతున్నారు.

బీజేపీతో టచ్‌లో..

క్షేత్ర స్థాయిలో పునాదులు నిర్మించుకుంటూనే మరో వైపు బీజేపీ వాయకులతో ప్రణయ్ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి గడ్కరీని ఇప్పటికే ప్రణయ్ కలిసినట్లు సమాచారం. బీజేపీ జాతీయ స్థాయి నాయకులతో ఉన్న సంబంధాలతో ఎమ్మెల్యే టికెట్ సాధించాలని భావిస్తున్నారు ప్రణయ్. హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ఎక్కడి నుండైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ప్రణయ్ మాత్రం ఫలనా పార్టీలో చేరుతున్నట్లు చెప్పడం లేదు. కానీ ఆయన చర్యలు మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

ఒకే ఇంట ఇద్దరు..

సింగాపురంకు చెందిన వొడితెల కుటుంబం నుంచి ఒకేసారి ఇద్దరు వారసులు పొలిటికల్ ఎంట్రీకి రంగు సిద్ధం చేసుకుంటుండం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ ఒకే స్థానం నుంచి బరిలో నిలుస్తారా లేక వేర్వేరు చోట్ల నుంచి పోటీ చేస్తారా అన్న అంశం హుజురాబాద్‌లో హాట్ టాపిక్ గా మారింది.

Next Story

Most Viewed