హెల్మెట్ లేదని 8 నెలల ‘గర్భిణి’ని.. ఎండలో మహిళా పోలీస్..

by  |
హెల్మెట్ లేదని 8 నెలల ‘గర్భిణి’ని.. ఎండలో మహిళా పోలీస్..
X

దిశ, వెబ్ డెస్క్ : ఆమె ఓ మహిళా అధికారి.. కానీ, ఆమె.. ఓ గర్భణితో వ్యవహరించిన తీరు అందరినీ ఆగ్రహానికి గురిచేసింది. ఓ మహిళా పోలీస్ 8నెలల గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను మూడు కిలోమీటర్లు నడిపించింది. వివరాల ప్రకారం.. ఒడిశాలోని మయూర్‌బంజ్‌ జిల్లాలోని సరాత్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న రీనా భక్షలా.. తాను చేసిన తప్పు కారణంగా సస్పెండ్ అయ్యారు.

వాహనాల తనిఖీలో భాగంగా పోలీసు అధికారి రీనా.. బిక్రమ్ బరౌలి అనే వ్యక్తిని, ఎనిమిది నెలల గర్భంతో ఉన్న తన భార్యతో కలిసి బైక్‌పై వెళుతుండగా ఆపింది. అనంతరం హెల్మెట్ లేని కారణంగా వారికి ఫైన్ విధించింది. జరిమానాను ఆన్‌లైన్‌లో కడతానని బరౌలి చెప్పినా వినకుండా అతనిని, ఎనిమిది నెలల గర్భంతో ఉన్న అతని భార్యను బలవంతంగా మూడు కిలోమీటర్లు సరాత్ పోలీస్ స్టేషన్ వరకూ నడిపించింది. (ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే.. భర్త హెల్మెట్ ధరించారు, వెనకాలే కూర్చున్న భార్య హెల్మెట్ ధరించలేదు).

ఎండలో మూడు కిలోమీటర్ల పాటు నడవడం వల్ల గర్భిణిగా ఉన్న బరౌలి భార్య అస్వస్థతకు గురైంది. సాటి మహిళ అయి ఉండి కూడా గర్భిణిని 3 కిలోమీటర్ల దూరం నడిపించిన రీనాపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన బరౌలి తన భార్యతో కలిసి సదరు మహిళా పోలీసుపై సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశాడు.

హెల్మెట్ లేదని జరిమానా వేయడం తప్పు కాదని, తన భార్య గర్భిణి అని తెలిసి కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చి జరిమానా కట్టాలని బలవంతం చేయడం సరికాదని బరౌలి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో రీనా చేసిన తప్పు కారణంగా మయూర్‌బంజ్ ఎస్పీ స్మిత్ పర్మర్ రీనాను సస్పెండ్ చేశారు. రీనా వ్యవహార శైలిపై గతంలో కూడా ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.


Next Story