రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు.. బాధితులకు పోలీసుల కీలక సూచన

by  |
రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు.. బాధితులకు పోలీసుల కీలక సూచన
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఈజీగా డబ్బులు సంపాదించేందుకు అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు.. ఆన్‌లైన్ వేదికగా అమాయక జనాలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఎత్తులకు చిక్కిన వారి ఖాతాల్లో డబ్బులు ఖాళీ అవుతున్నాయి. ఆన్‌లైన్‌లో సరికొత్త పద్ధతిలో వల వేస్తూ నమ్మినోళ్లను నిండా ముంచుతున్నారు. ఇలాంటి వారితో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వచ్చినప్పుడు స్పందించి.. వివరాలు చెబితే ఖాతాల్లోని నిల్వలు ఖాళీ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఇలాంటి వాటికి తక్షణ ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ, హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.

కొన్ని ఉదాహరణలు..

ఒక సైబర్ నేరగాడు తేదీ. 20/9/20న భీమినికి చెందిన ఒకరి పేరుతో ఫేక్ బుక్ ఖాతా తీసి.. అనంతరం అతడి స్నేహితులని యాడ్ చేశారు. నా భార్య ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉందని.. వెంటనే డబ్బులు కావాలని స్నేహితులకు మెసేజ్ పంపారు. ఒకరు రూ.2వేలు, మరొకరు రూ.వెయ్యి ఫోన్ పే చేసి.. తన ఫ్రెండ్‌కు ఫోన్ చేశారు. ఆ మెసేజ్ తాను పంపలేదని తెలపటంతో వారు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామని గ్రహించారు.

ఒక సైబర్ నేరగాడు తేదీ.13.6.21న బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఒకరికి మీ బ్యాంక్ కేవైసీ అప్డేట్‌ చేయాలని.. లేదంటే బ్లాక్ అవుతుందని ఒక లింకును యూఆర్ఎల్ రూపంలో మెసేజ్ పంపారు. అది నిజమని నమ్మి క్లిక్ చేస్తే.. రూ.14,900/- లు విడతల వారీగా బ్యాంక్ ఖాతా నుంచి కట్ అయ్యాయి. మరొకరి కంప్యూటర్‌కు సైబర్ నేరగాడు ఒక లింక్ పంపగా.. దానిని క్లిక్ చేయగానే దానిలోని జీ-మెయిల్, యూట్యూబ్ ఛానల్ లాగ్ ఇన్ ఐడి, పాస్ వర్డ్స్ తెలుసుకొని అన్నింటినీ మార్చి వేశాడు.

మంచిర్యాలకు చెందిన ఒకరు తన SBI యోనో అప్లికేషన్ పాస్ వర్డ్ మర్చిపోగా.. తెలుసుకునేందుకు ఎస్బీఐ కస్టమర్ కేర్ నెంబరు కోసం గూగుల్లో సర్చ్ చేశారు. ఒక నంబర్ రాగా వారికి ఫోన్ చేస్తే.. ఎనీ డెస్కు యాప్ డౌన్లోడు చేసుకోవాలని చెప్పారు. డౌన్లోడు చేస్తే.. రూ.9వేలు కట్ అయ్యాయి. దొంగ కస్టమర్ కేర్ నెంబరుకి ఫోను చేసి మోసపోయానని గుర్తించారు. మరొకరికి పార్ట్ టైం జాబుందని మెసేజ్ రావటంతో.. క్లిక్ చేశారు. రిజిస్టర్ చేశాక ప్రోడక్టులను ఆర్డర్ చేయాలని.. కమీషన్ వస్తుందనటంతో రూ.42వేల పంపి మోసపోయాడు.

మందమర్రికి చెందిన ఒకరు సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ ఓఎల్ఎక్స్ యాప్‌లో కొనుక్కోవాలని వెతకగా.. ఒకటి నచ్చి దాని ఓనరుకు ఫోన్ చేశారు. అతడు ఆర్మీ ఉద్యోగం చేస్తాననడంతో.. అది నమ్మి బాధితుడు రూ.2,100 పంపిస్తే బైకు ట్రాన్స్‌పోర్టులో వేస్తానని నమ్మించాడు. ఆ తర్వాత జీఎస్టీ కింద రూ.8,200 హాఫ్ పేమెంట్ కింద రూ.16,000 పంపగా.. ఇంకా కావాలని ఒత్తిడి చేయటంతో తాను మోసపోయానని గ్రహించాడు.

“హలో.. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఏటీఎం కార్డు కాలపరిమితి ముగిసింది. ఆధార్ అనుసంధానం చేయాలి.. మీ ఖాతా సంఖ్య చెప్పండి” అని ఒకరు. “నేను ఆర్మీ అధికారిని డబ్బులు అత్యవసరం ఉండడంతో తన కారు, బైకు తక్కువ ధరకే అమ్ముతున్నా.. ఆధార్ నంబర్, అడ్రస్ చెబితే చాలు నేరుగా మీ ఇంటికే పంపుతామంటూ మరొకరు పోస్టులు పెట్టి.. ఫోన్లు చేసి డబ్బులు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది.

కొన్ని రోజులుగా ఇలాంటి వారి వలలో పడి మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఫిర్యాదులకు కేంద్ర హోం శాఖ టోల్ ఫ్రీ నంబర్ 155260తో పాటు దానికి అనుసంధానంగా రాష్ట్ర పోలీసు విభాగం డయల్ 100, 112 నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు తక్షణమే ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందని, అనుమానాస్పద లింకులు మెసేజ్లను కూడా ఓపెన్ చేయొద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజల అప్రమత్తతే సైబర్ నేరగాళ్ల నుండి రక్షణ అని రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.

అప్రమత్తతోనే రక్షణ..

డెబిట్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ పిన్, పాస్‌వర్డ్‌లను, కార్డుల సీవీవీ నెంబర్లను ఏ బ్యాంక్ అధికారి అడగరు అన్న విషయం వినియోగదారులు గమనించాలి. బ్యాంకు అధికారులమని వచ్చే ఫోన్ కాల్క్స్‌క సమాధానం ఇవ్వకపోవడం మంచిది. ఫేస్‌బుక్, ఇన్స్‌స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా పలు యాప్లతో అందమైన అమ్మాయిలు, మహిళల ఫొటోలతో ఖాతాలు తెరిచి ఫ్రెండ్ రిక్వెస్టులు, ఫొటోలు పంపుతారు. వలలో చిక్కే దాకా అనుకువగా ప్రవర్తించి, చిక్కిన తర్వాత బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతారు.

ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపరిచితుల నుంచి వచ్చే ఆఫర్లు, లాటరీలు, డిస్కౌంట్లను నమ్మవద్దు. ఎవరూ ఊరికే మనకు బహుమతులివ్వరు. డబ్బులు పంపరు. ఒక్క క్లిక్‌తో లోన్ ఇస్తామని నమ్మిస్తూ పలు యాప్స్ ద్వారా లోన్లు ఇస్తారు. లోన్ మొత్తానికి 50రెట్లు అధికంగా వసూలు చేయడమే కాదు. మొత్తం తీర్చినా ఇంకా కట్టాల్సి ఉందని వేధిస్తారు. ఇలా వేధింపులు భరించలేక బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.



Next Story

Most Viewed