మావోయిస్టు యాక్షన్ టీంలపై నిఘా

by  |
మావోయిస్టు యాక్షన్ టీంలపై నిఘా
X

దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మావోయిస్టు యాక్షన్ టీంలు ప్రవేశించాయన్న అనుమానంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణహిత నదీ తీరం వెంబడి నక్సలైట్ల అలజడి ఉందన్న కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు నిఘా పెంచాలని నిర్ణయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి, చత్తీస్గడ్ రాష్ట్రంలోని నారాయణపూర్, దంతేవాడ, బస్తర్ ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులు ఈ ప్రాంతంలోకి ఇప్పటికే చొరబడ్డారన్న సమాచారం పోలీసులకు అందినట్లు తెలుస్తోంది.

ఉనికి చాటుకునేందుకే..!

గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. ఇక్కడ విపరీతమైన పోలీసుల దాడులు పెరిగిన నేపథ్యంలో మావోయిస్టులు ప్రాణహిత నదికి అవతలి వైపు వెళ్లి సేఫ్ జోన్‌లో ఉంటున్నారన్న సమాచారం కూడా పోలీసులకు ఉంది. తిరిగి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమ కార్యకలాపాలకు సంబంధించి ఉనికిని చాటుకోవాలన్న వ్యూహంతో ఈ ప్రాంతంలోకి వస్తున్నారని పోలీసులకు ఉప్పందింది. సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌తో పాటు సింగరేణి ప్రాంతంలోకి వచ్చి ఏ క్షణంలోనైనా అలజడి సృష్టించొచ్చే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆసిఫాబాద్ చేరుకున్నారు. అక్కడ ఉమ్మడి జిల్లాల ఎస్పీలతో ఇతర పోలీసు అధికారులతో సమావేశమై మావోయిస్టుల కదలికలపై సమీక్షించారు. అయితే, ఉమ్మడి జిల్లాలో నక్సల్స్ అలజడి మళ్లీ మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పోలీసు యంత్రాంగం‌లో తీవ్ర కలకలం రేపుతుంది.

Tags: Maoist Action Team, Adilabad dist, police high alert

Next Story

Most Viewed