అవంతిక కిడ్నాప్ కథ సుఖాంతం

by  |
అవంతిక కిడ్నాప్ కథ సుఖాంతం
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ఎంజీబీఎస్ బస్టాండ్‌లో కిడ్నాప్‌నకు గురైన మూడేళ్ల బాలిక అవంతిక కథ సుఖాంతమైంది. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో బాలికను గుర్తించిన పోలీసులు.. తల్లిదండ్రుల ఒడికి చేర్చారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కర్నూలుకు జిల్లా నాగాళాపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు, జయలక్ష్మి దంపతులు హైదరాబాద్‌ కొండాపూర్‌లోని శిల్పవేలి సెంట్రల్ పార్క్ అపార్ట్‌మెంట్‌‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఇదేక్రమంలో శనివారం రాత్రి దీపావళి పండగరోజు కర్నూలు జిల్లాలోని తమ స్వగ్రామం వెళ్లేందుకు ఎంజీబీఎస్ బస్టాండ్‌కు వచ్చారు. అయితే బాలికను బస్టాండ్‌లోనే ఉంచి.. కర్ణాటకకు చెందిన బంధువులతో జయలక్ష్మీ మాట్లాడివచ్చేసరికి అవంతిక కనిపించకుండా పోయింది.

బస్టాండ్‌లో ఉన్నవారిని అడిగితే ఓ మహిళ తీసుకెళ్లిందని, ఇంతసేపు ఇక్కడే ఉన్నారని చెప్పడంతో చుట్టు పక్కల మొత్తం వెతికి అప్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా 24 గంటలు గడవక ముందే మహబూబ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో పాపను గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంగమోని శివుడు, పార్వతమ్మ దంపతులకు సంతానం లేకపోవడంతో ఒంటరిగా కనిపించిన అవంతికను తీసుకెళ్లారని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.



Next Story

Most Viewed