ఆర్మూర్ రైతుల అండతోనే ముఖ్యమంత్రినయ్యా : రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

by Disha Web Desk 15 |
ఆర్మూర్ రైతుల అండతోనే ముఖ్యమంత్రినయ్యా : రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్/ ఆర్మూర్ : ఆర్మూర్ రైతుల అండతో ఆనాడు వారి కోసం చేసిన ఉద్యమమే తనను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిందని, ఆ క్రెడిట్ అంతా ఆర్మూర్ రైతాంగానికి దక్కుతుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో రోడ్ షోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రైతు వ్యతిరేక నల్లచట్టాలను తెచ్చిన మోడీ మెడలు వంచిన ఘనత పంజాబ్, హర్యానా రైతులదైతే ఆ స్పూర్తి, ఆత్మగౌరవం తెలంగాణలో ఒక్క ఆర్మూర్ రైతాంగానికి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. 2014 ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తామంటే కవితను రైతులు పార్లమెంట్ కు పంపించారని

కానీ చక్కెర కర్మాగారం తెరువకపోగా కవితను బండకేసి కొట్టి గుండు అరవింద్ ను 2019లో ఎంపీని చేశారన్నారు. 2019 ఎన్నికల్లో ఆనాడు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాంమాదవ్ లు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అరవింద్ గెలిచేందుకు ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ రాసిచ్చి ఇక్కడి రైతులను మోసం చేశారన్నారు. తెలంగాణలో ఆర్మూర్ ప్రాంతం డెవలప్ అయిందంటే అది రైతాంగం వల్లనేనని అన్నారు. ఒకరిని ఎమ్మెల్యే చేస్తే ఆర్టీసీ కాంప్లెక్స్ లో మల్టీ ఫ్లెక్సీ కట్టుకున్నారని, మరొకరిని ఎమ్మెల్యేగా చేస్తే విదేశాల్లో పెట్టుడులు పెట్టి దందాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. జీవన్ రెడ్డి అంటే ఆర్మూర్ లో ఒక నకిలీ జీవన్ రెడ్డి ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 40 ఏళ్లుగా సుదీర్ఘ రాజకీయ చరిత్రతో మచ్చలేని రైతుగా, రాజకీయ నాయకుడిగా ఆదర్శంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుబంధు జరగదని

కేసీఆర్ సవాల్ విసిరారని సవాల్ విసరగానే సరిపోదని దానిని స్వీకరించే దమ్ము ఉండాలని అన్నారు. 69 లక్షల మంది రైతుల ఖాతాలో రైతుబంధు పడిందని, కేసీఆర్ కు నిజంగా సిగ్గు, శరం ఉంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కును నేలకు రాయాలని డిమాండ్ చేశారు. సిగ్గులేని కేసీఆర్ ముక్కును నేలకు రాసినా రాస్తాడని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ చేయడం కాంగ్రెస్ కు చేతకాదని సిద్దిపేట్ కు పట్టిన శనిశ్వర్ రావు (హరీష్ రావు) రుణమాఫీ జరిగితే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఆర్మూర్ రైతుల సాక్షిగా, సిద్దులగుట్ట సాక్షిగా ఆగస్టు 15లోపు రుణమాఫీ వేసి తీరుతానని, సిద్దిపేట్ కు పట్టిన శనిశ్వర్ రావు పీడను పోగొడతానని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున రైతుల ఖాతాలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతానని అన్నారు. 2014లో బీఆర్ఎస్ కు, 2019లో బీజేపీకి అవకాశం ఇచ్చారని ఈ సారి కాంగ్రెస్ కు ఇవ్వాలని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థిని గెలిపించారని,

150 రోజుల్లో మోడీ వద్ద నుంచి కనీసం మున్సిపల్ కార్యాలయానికి 15 కోట్లయినా ఇప్పించారా అని ప్రశ్నించారు. ఇక్కడున్న వారంతా 90 శాతం మంది హిందువులేనని, కళ్యాణం తర్వాతనే అక్షింతలు ఇస్తారనేది భద్రాదిలోనైనా, మరే గుడిలోనైనా ఏ గుడిలోనైనా అడిగితే చెబుతారన్నారు. మోడీ హిందూ సాంప్రదాయాలను, హిందువులను మోసం చేశారని ఎత్తిపొడిచారు. అయోధ్యలో రాముని ప్రతిష్టకు 15 రోజుల ముందే అక్షింతలు ఏ విధంగా పంపిణీ జరిగాయని ప్రశ్నించారు. తాను రామున్ని పూజించలేదా, హనుమంతున్ని కొలువలేదా అని ప్రశ్నించారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని, వాడే నిజమైన హిందువు అని అన్నారు. బీజేపీ వారు ఎన్నికల కోసం మతం పేరుతో, దేవుడి పేరుతో బిచ్చమెత్తుకుంటున్నారని అన్నారు. ఈ రోడ్ షోలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, తెలంగాణ సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ షోకు భారీగా జనం తరలివచ్చారు.

Next Story