చైనా మూలాలు కలిగిన ముఠా అరెస్టు

by  |
చైనా మూలాలు కలిగిన ముఠా అరెస్టు
X

దిశ, క్రైమ్ బ్యూరో : యాప్ లోన్ కేసులో సింగపూర్‌లోని ఓ కంపెనీ సహాయంతో 11 యాప్‌లను రూపొందించిన చైనా మూలాలు కలిగిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు కంపెనీలతో మొదలెట్టి, దేశ వ్యాప్తంగా 4 కాల్ సెటర్లను నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం 6 గురు ముఠా సభ్యుల్లో సైబరాబాద్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టైన నలుగురిలో ఒకరు చైనా దేశానికి సంబందించిన వారున్నారు. చైనాకు చెందిన ప్రధాన నిందితుడు జిక్సియా జాంగ్ సింగపూర్‌లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీ రోహిణీ ప్రియదర్శిని, ఏసీపీ బాలకృష్ణారెడ్డితో కలిసి శుక్రవారం సీపీ సజ్జనార్ వివరాలను వెల్లడించారు.

ఈ సందర్బంగా సజ్జనార్ మాట్లాడుతూ…సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ చైనా దేశస్తుడు జిక్సియా జాంగ్ ఢిల్లీకి చెందిన ఉమాపతి అలియాస్ అజయ్‌తో కలిసి ఢిల్లీ కేంద్రంగా డిజీపీర్గో టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ తర్వాత స్కై లైన్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండు కంపెనీలను ఏర్పాటు చేశారు. సింగపూర్ కేంద్రంగా పనిచేసే క్సియా కంపెనీ సహాయంతో 11 ఇన్‌స్టాంట్ లోన్ యాప్ లను తయారు చేయించి, గుర్గావ్ కేంద్రంగా టాప్ ఫన్ టెక్నాలజీస్, ఫస్మేట్ టెక్నాలజీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ కేంద్రంగా కుబెవో టెక్నాలజీ, బెస్ట్ షైన్ టెక్నాలజీ పేర్లతో మొత్తం 4 కాల్ సెంటర్ కార్యాలయాలను ప్రారంభించారు. 20 ఏండ్ల నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఇన్‌స్టాంట్ రుణాలను ప్రోత్సహించడం, రుణాలను వసూలు చేయడం లాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

ఈ నాలుగు కేంద్రాలుగా సుమారు లక్షలాధి మంది రుణ గ్రహీతలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి ద్వారా రుణం పొందిన ఓ బాధితునికి, వీళ్లకు సంబంధించిన లోన్ యాప్ నిర్వాకుల నుంచి పదే పదే ఫోన్లు రావడంతో బాధితుడు దాదాపు 28 యాప్ లనుంచి సుమారు రూ.1.20 లక్షలు రుణం తీసుకుని, రూ.2 లక్షల వరకూ తిరిగి చెల్లించినట్టు సీపీ తెలిపారు. అయితే, చెల్లించాల్సిన బకాయి ఇంకా ఉందంటూ యాప్ లోన్ కాల్ సెంటర్ నుంచి వేధింపులు ఎదురు కావడంతో ఓ బాధితుడు డిసెంబరు 17న సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి చైనాకు చెందిన ముఠాను గుర్తించినట్టు తెలిపారు. ఈ ముఠాలో ఇద్దరు చైనీయులు, ఒకరు ఢిల్లీకి చెందిన వారు, ఇద్దరు రాజస్థాన్ కు చెందిన వారు ఉండగా, మరొకరు కడపకు చెందిన వారున్నారు. పరారీలో ఉన్న ఇద్దరిలో ప్రధాన నిందితుడు జిక్సియా జాంగ్ సింగపూర్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

116 యాప్‌లు తొలగించాలని గూగుల్‌కు లేఖ
చైనాకు చెందిన ముఠా ఏఏఏ క్యాష్, లోన్ కార్డ్, లోన్ గ్రామ్, క్యాష్ బస్, మంకీ క్యాష్, క్యాష్ ట్రెయిన్, మనీ క్యాష్, హ్యాపీ క్యాష్, సూపర్ క్యాష్, మింట్ క్యాష్, రిపే క్యాష్ తదితర 11 యాప్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీటిలో ఏ ఒక్క యాప్ కూడా ఎన్‌ఎఫ్‌బీసీలో నమోదు కాలేదన్నారు. అంతే కాకుండా, ఆన్‌లైన్ ఇన్ స్టాంట్ రుణాలను అందించే యాప్ లు దాదాపు 700-800 గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. కానీ, సమగ్రమైన సమాచారంతో ఇప్పటి వరకూ 116 యాప్ లను గుర్తించామన్నారు. వీటిని ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్ సంస్థకు లేఖ రాసినట్టు సీపీ సజ్జనార్ తెలిపారు. అంతే కాకుండా, యాప్ లోన్ వ్యవహారంపై మొదటి నుంచి గూగుల్, ఆర్‌బీఐ అధికారులతో సంప్రదింపులు జరిపి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా నలుగురిని అరెస్టు చేయడంతో పాటు 2 ల్యాప్ టాప్ లు, 4 సెల్ ఫోన్లు, ఒక బ్యాంకు అకౌంట్ ద్వారా రూ.2 కోట్లను సీజ్ చేసినట్టు వివరించారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ తరహా కేసులు నమోదు అవుతున్నందున మూడు కమిషనరేట్ అధికారులతో కలిసి సమన్వయంగా పనిచేయనన్నట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా రుణాల పేరుతో అమాయక ప్రజలను వేధించే వారిపై ప్రజలు సైబరాబాద్ పోలీసులను కానీ, డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు. బాధితుల ఫిర్యాదుతో కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

350 అకౌంట్‌లు- రూ.87 కోట్లు ఫ్రీజ్
హైదరాబాద్ సీసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాప్ లోన్ కేసు దర్యాప్తులో భాగంగా 350 అకౌంట్ లను గుర్తించి, సుమారు రూ.87 కోట్లను ఫ్రీజ్ చేసినట్టు జాయింట్ సీపీ అవినాష్ మహాంతి తెలిపారు. ఈ సందర్భంగా మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకూ లోన్ యాప్ బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులలో 27 కేసులు నమోదు చేశామన్నారు. లియూఫంగ్, పిన్ ప్రింట్, హాట్ ఫుల్, నాబ్ లూమ్ కంపెనీల ద్వారా దాదాపు 42 యాప్ లను గుర్తించామన్నారు. వీటిలో జగిత్యాల రూరల్ పీఎస్ పరిధిలో, రాజేంద్రనగర్, సిద్దిపేట పీఎస్ పరిధిలో ఆత్మహత్యల కేసులలో వేధింపులకు గురి చేసిన యాప్ లను గుర్తించామన్నారు. ఇప్పటి వరకూ 7 కాల్ సెంటర్ల నుంచి 14 మందిని అరెస్టు చేసినట్టు జాయింట్ సీపీ అవినాష్ మహాంతి తెలిపారు.



Next Story

Most Viewed