నివేదిక వచ్చింది.. అరెస్టులు షురూ

by  |
నివేదిక వచ్చింది.. అరెస్టులు షురూ
X

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకర స్టైరీన్ విషవాయువు లీకై 14 మంది మృతి చెందగా, వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురై వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భూమి మీద పాకే జంతువులతో సహా మరణించడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. భోపాల్ గ్యాస్ ట్రాజెడీతో ఈ దుర్ఘటనను పోలుస్తూ వార్తా కథనాలు ప్రసారం అయ్యాయి.

ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం కాగా, న్యాయస్థానం, ఎన్జీటీ, రాష్ట్ర ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి, మానవహక్కుల కమిషన్ సుమోటోగా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ హైలెవెల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రమాద ఘటనపై 350 పేజీల నివేదిక సీఎంకి సమర్పించింది. ఈ నివేదికలో స్టైరీన్ రిజర్వ్ ట్యాంక్‌లో ఉష్ణోగ్రత పెరగడంతో హై ప్రెజర్ ఏర్పడి గ్యాస్ లీకైందని పేర్కొంది. ట్యాంక్ డిజైన్, కూలింగ్ సిస్టమ్ సరిగా లేవని, వీటి నిర్వహణపై సిబ్బందికి సమగ్ర అవగాహన కూడా లేదని తెలిపింది. అందువల్లే ప్రమాదం జరిగిందని, ప్రమాద తీవ్రత పెరిగిందని వెల్లడించింది.

2019 డిసెంబర్‌లో పైపింగ్‌ సిస్టమ్‌లో మార్పులు చేశారని, దీంతో మొత్తం ఈ పైప్ లైన్ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అయిందని వెల్లడించింది. గ్యాస్ నియంత్రణ వ్యవస్థలో కూడా లోపాలను గుర్తించామని, సేప్టీ బోర్డును ఏర్పాటు చేయాలని బోర్డుకు సూచించినట్టు తెలిపింది. ప్రమాదం చోటుచేసుకున్న తరువాత కూడా సైరన్ కూడా మోగలేదని వెల్లడించింది. దీంతో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్ కి జియాంగ్, సంస్థ డైరెక్టర్ డీఎస్ కిమ్, అదనపు డైరెక్టర్ మోహన్ రావు ఉన్నారు. వీరిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 304(2), 338, 285, 337, 284, 278ల కింది కేసులు నమోదు చేశారు.



Next Story

Most Viewed