త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ : మోడీ

by  |
త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ : మోడీ
X

న్యూఢిల్లీ : ప్రపంచలోనే అతిపెద్ద కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశంలో ప్రారంభించనున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. కొవిడ్-19 మహమ్మరి నియంత్రణ కోసం ఒకటి కాదు రెండు స్వదేశీ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం ద్వారా నూతన సంవత్సరం గొప్ప విజయాన్ని తీసుకువచ్చిందన్నారు. భారతదేశ శాస్త్రవేత్తలు, నిపుణులపట్ల ప్రతి ఒక్క భారతీయుడు రుణపడి ఉండాలని సూచించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రిసెర్చ్ ఆధ్వర్యంలో నేషనల్ ఫిజికల్ ల్యాబోరేటరీ 75వ వసంతోత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. అతి త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌-19 వ్యాక్సినేషన్ భారత్ ప్రారంభించబోతున్నదని, ఇందుకు శాస్త్రవేత్తలు అందించిన సేవల పట్ల దేశం ఎంతో గర్విస్తున్నదన్నారు.

మహమ్మారి విజృంభన కాలంలో శాస్త్రవేత్తలు ఎనలేని త్యాగాలు చేశారని, ఈ కారణంగా శాస్త్రీయ సంస్థల పట్ల దేశానికి కొత్త గౌరవం ఏర్పడిందని పేర్కొన్నారు. గతంలో దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువుల నాణ్యతా ప్రమాణాలను లెక్కించడానికి విదేశీ ప్రమాణాలపై భారత్ ఆధారపడేది. ఆ పరిస్థితి మారింది. దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువుల నాణ్యతా బలాన్ని భారత ప్రమాణాలు నిర్దేశిస్తున్నాయని, ఇవి ప్రపంచస్థాయి ప్రమాణాలకు తీసిపోవు. ప్రపంచ మార్కెట్‌ను భారత ఉత్పత్తులతో నింపడం లక్ష్యం కాదు. భారత ఉత్పత్తులను కొనుగోలు చేసిన ప్రతి ఒక్క వినియోగదారుడి హృదయం గెలుచుకోవడమే ధ్యేయం. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ నమ్మకంతో భారత్ ముందుకు సాగుతున్నదని, ఈ తరుణంలో ఉత్పత్తి పెంపుతోపాటు నాణ్యత కూడా ఎంతో ముఖ్యం అనే విషయాన్ని మర్చిపోకూడదు.



Next Story

Most Viewed