మళ్లీ పెరిగిన చమురు ధరలు!

by  |
మళ్లీ పెరిగిన చమురు ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఇటీవల వరుసగా గరిష్ఠాలకు చేరిన తర్వాత శుక్రవారం అంతర్జాతీయ పరిణామాలతో మళ్లీ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. దీంతో గడిచిన 20 రోజుల్లోనే మూడవసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శుక్రవారం పెట్రోల్ లీటర్ ధర 25 పైసలు పెరిగి రూ. 85.45కి చేరుకోగా, డీజిల్ ధరలు సైతం 25 పైసలు పెంపుతో లీటర్ రూ. 75.63కి చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ ఏకంగా 48 శాతం పెరగడం గమనార్హం.

అదేవిధంగా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఎక్సైజ్ డ్యూటీ వసూళ్లూ వార్షిక ప్రాతిపదికన రూ. 1,32,899 కోట్ల నుంచి 2020లో రూ. 1,96,342 కోట్లకు పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే..దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 85.45కి పెరిగింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర. అలాగే, డీజిల్ లీటర్ ధర రూ. 75.63కి చేరుకుంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 92.04 ఉండగా, డీజిల్ లీటర్ రూ. 82.40గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ. 88.07, డీజిల్ లీటర్ ధర రూ. 80.90గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ. 86.87, డీజిల్ లీటర్ ధర రూ. 73.23 కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.89 ఉండగా, డీజిల్ ధర రూ. 82.53గా ఉంది. కొవిడ్-19 వల్ల చమురు ఉత్పత్తిని ఒపెక్ దేశాలతో పాటు ఇతర దేశాలు తగ్గించిన కారణంగానే దేశీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.



Next Story

Most Viewed