ఇంకా ఎదురుచూడలేం.. చనిపోవడానికి అనుమతివ్వాలంటున్న పీఈటీ క్యాండిడేట్స్

by  |
ఇంకా ఎదురుచూడలేం.. చనిపోవడానికి అనుమతివ్వాలంటున్న పీఈటీ క్యాండిడేట్స్
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : పరీక్షలు రాసి నాలుగేళ్లు గడుస్తున్నా నియామకాలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ తమకు కారుణ్య మరణాలకు అనుమతినివ్వాలని గురుకుల పీఈటీ అభ్యర్థులు శనివారం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు వందలాది మంది ఎంపికైన గురుకుల పీఈటీ అభ్యర్థులు శనివారం హెచ్ఆర్సీని ఆశ్రయించారు. అనంతరం ప్లకార్డులు చేతపట్టుకుని టీఎస్‌పీఎస్సీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ 16/2017 ప్రకారం 616 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు . 2017 సెప్టెంబర్ 17, 18 తేదీలలో పరీక్షలు రాశామని, 2018 మే 10వ తేదీన టీఎస్ పీఎస్సీ ఫలితాలు విడుదల చేసిందని వారు చెప్పారు. మే 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్ధుల ఒరిజినల్ సర్టిఫికెట్ల ధృవీకరణ కోసం పిలిచారన్నారు. అయితే, ఈ సమయంలో ఇంటర్మీడియట్ అర్హతగా ప్రకటించాలని కొంత మంది హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకురావడంతో నియామకం నిలిచిపోయిందన్నారు .

2019 సంవత్సరం సెప్టెంబర్ 16న హైకోర్టు నుండి జడ్జిమెంట్ వచ్చినప్పటికీ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం రెండవ ధర్మాసనానికి అప్పీల్‌కు వెళ్ళిందని వారు వివరించారు. అయితే, ఈ యేడాది మార్చి 8వ తేదీన 9, 10 తరగతులకు, 6,7,8 తరగతులకు బోధించడానికి 616 పోస్టులను రెండు గ్రూపులుగా విడగొట్టి వెంటనే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసిందని వారు గుర్తుచేశారు. అయినా నేటికీ టీఎస్ పీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టలేదని వాపోయారు. దీంతో పరీక్షలు రాసిన తాము తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నామని, ఈ నేపథ్యంలో శుక్రవారం జనగాం జిల్లా‌కు చెందిన అభ్యర్థి శ్రీరామ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు తెలిపారు. ఈ విషయంలో హెచ్ఆర్సీ స్పందించి నిలిచిపోయిన పోస్టుల భర్తీ వెంటనే చేపట్టేలా టీఎస్‌పీఎస్సీని ఆదేశించాలని, అలా జరగని పక్షంలో తమకు కారుణ్య మరణాలకు అనుమతిని ఇవ్వాలని కోరారు.



Next Story

Most Viewed