ఆరు నెలల్లో అనుమతులు తప్పనిసరి.. కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశంలో కీలక నిర్ణయం

by  |
Godavari
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై నిర్మించే ప్రాజెక్టులన్నింటికీ ఆరు నెలల్లో అనుమతులు తీసుకోవాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సూచించాయి. వచ్చేనెల 14న గెజిట్​ నోటిఫికేషన్​ అమలవుతుందని, దీనికి రెండు రాష్ట్రాలూ సహకరించాలని కోరారు. హైదరాబాద్​ జలసౌధలో కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే 10 రోజుల్లోగా ఉద్యోగులు, సిబ్బంది వివరాలను అందించాలని, ఇరు రాష్ట్రాలను కేఆర్‌ఎంబీ సబ్ కమిటీ కోరింది. ఆపరేషన్స్, మేయింటెనెన్స్‌కు సంబంధించిన వివరాలివాలని కమిటీ సూచించింది. సీఐఎస్ఎఫ్ భద్రత అంశాన్ని చివరగా చర్చిద్దామని సబ్ కమిటీ చెప్పింది. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్‌ను బోర్డు పరిధిలోకి వద్దని ఏపీ వితండవాదం చేసింది. బనకచర్లను బోర్డు పరిధి నుంచి తొలగించాలని పట్టుబట్టింది. కానీ బోర్డు పరిధిలోనే ఉంచాలని తెలంగాణ సూచించింది. దీనిపై కేంద్ర జల్​శక్తి మంత్రిత్వ శాఖకు నివేదిస్తామని, ఆ తర్వాతే ఈ అంశాలపై పరిశీలిస్తామని కన్వీనర్ పిళ్ళై చెప్పారు.

ఈ నేపథ్యంలో వచ్చే గురువారం మరోసారి బోర్డు మీటింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది. ముందుగా ఆర్.కె.పిళై కన్వీనర్ గా జలసౌధలో కేఆర్ఎంబీ భేటీ జరిగింది. గెజిట్ అమలు కార్యచరణ ఖరారుపై సమావేశంలో చర్చించారు. కేఆర్ఎంబీ సభ్యులు, ఏపీ తెలంగాణ అంతర్రాష్ట్ర వ్యవహారాల సభ్యులు, రెండు రాష్ట్రాల జెన్ కో అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాకుండా రూ.కోటికి పైగా విలువ ఉన్న కాంట్రాక్టుల వివరాలు సమర్పించాలని కోరింది. ఇరు రాష్ట్రాల అధికారులు అభిప్రాయాలు విన్న కన్వీనర్ ఆర్.కె.పి స్పందించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని వెల్లడించారు. అనంతరం సాయంత్రం జీఆర్​ఎంబీ సమావేశమైంది. ప్రాజెక్టుల నిర్వహణకు వారం, పది రోజుల్లో సిబ్బంది వివరాలను ఇవ్వాలని ఇరు రాష్ట్రాల అధికారులను గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఉప సంఘం కోరింది. అనుమతుల్లేని ప్రాజెక్టులకు ఆర్నేళ్లలోగా అనుమతులు తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 14లోగా గెజిట్ నోటిఫికేషన్ అమలుకు సహకరించాలని తెలుగు రాష్ట్రాలను కోరింది.

తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలు

కాగా ఈ సమావేశాల్లో గెజిట్ నోటిఫికేషన్ లోని అంశాలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతం పరిధిలో ప్రతి ప్రాజెక్టు, కాల్వలను నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తేవటంపై ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 2 నెలల్లో ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు డిపాజిట్‌ చేయడం సాధ్యంకాదని సూచించారు. 15 రోజులకోసారి అప్పటి అవసరం ఎంతో చెప్తే దానికి తగ్గట్లుగా విడుదల చేస్తామని తెలిపాయి. కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు బోర్డు పూర్తి అజమాయిషీలో రెండో షెడ్యూలులో ఉంటే సరిపోతుందని, ప్రకాశం బ్యారేజి, పోతిరెడ్డిపాడు కింద ఉన్న కాల్వలు, ప్రాజెక్టులు అవసరం లేదంటూ మరోసారి ఏపీ సమావేశంలో వివరించింది. ఈ సమావేశంలో కేఆర్‌ఎంబీకి సీడబ్ల్యూసీ తరుపున సీఈ టీకే శివరాజన్, అనుపమ్‌ ప్రసాద్, జీఆర్‌ఎంబీకి ఎంకే సిన్హా, జీకే అగర్వాల్​ పాల్గొన్నారు.

Next Story