Lockdown: లాక్‌డౌన్‌లోనూ ట్రాఫిక్ కష్టాలు.. పోలీసులు చేతులెత్తేశారా..?

by  |
People
X

దిశ, తెలంగాణ బ్యూరో : “ఎద్దుకు పగ్గం ఇడిసినట్టే” జరుగుతోంది రాష్ట్రంలో. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్​ విధించినా ప్రకటనకే పరిమితమైంది. రోడ్లపై ఎక్కడ చూసినా జనమే. లాక్​డౌన్​ సడలింపు సమయంలో మాత్రమే కాకుండా… ఆంక్షల సమయంలోనూ రోడ్డెక్కుతున్నారు. పోలీస్​ శాఖ విచ్చలవిడిగా జారీ చేసిన పాసులు, ఆన్‌లైన్​ఫుడ్​డెలివరీ, కూరగాయల వాహనాలు, ప్రైవేట్​ పరిశ్రమల్లో పని చేసే వారికి… ఇలా ఆంక్షల నుంచి సడలింపు ఇవ్వడంతో రాష్ట్రంలోని రోడ్లు ఖాళీగా ఉండటం లేదు. సాధారణంగా ఉండే విధంగానే ట్రాఫిక్ ఉంటోంది. లాక్‌డౌన్​సమయంలో కూడా అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయేంతలా వాహనాల రద్దీ ఉంటోంది. ఇక ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు సమయంలో ఇంకేం చెప్పనక్కరలేదు. ఆ సమయంలో రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కూడా రక్షణ కరువవుతోంది. దీంతో ఏం చేయలేక చేతులెత్తేస్తున్నారు.

స్టేట్‌లో అన్​లాక్..?​

lockdown rules

రాష్ట్రంలో లాక్‌డౌన్​ఎత్తివేసినట్లే కనిపిస్తోంది. అన్ని దారుల్లో జనం యథావిధిగానే వెళ్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్​నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. లాక్‌డౌన్​ సడలింపు సమయం ఉదయం 10 గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, ఆ తర్వాత సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు ఎక్కడ చూసినా జనం గుంపులు గుంపులుగానే కనిపిస్తున్నారు. యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వల్ల పెద్ద ఉపయోగం లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి.

గత ఏడాది కరోనా ప్రారంభంలో లాక్‌డౌన్‌ విధించిన సందర్భంలో జిల్లాలో ఎక్కడా రోడ్లపైన మనుషులు పెద్దగా కనపించలేదు. జనమంతా ఇండ్లకే పరిమితమయ్యారు. పోలీసులు ఈ మేరకు భారీ ఎత్తున కట్టడి చేశారు. ఎక్కడా జనం రోడ్లపైకి రాకుండా అడ్డుకున్నారు. కానీ ఇప్పడైతే ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎక్కువగా జనాలు గుంపులు గుంపులుగానే కనిపిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని వ్యాపారస్తులు కరోనా నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కేస్తున్నారు. ముందు నుంచి దుకాణాలను మూసివేసి… పక్కన, వెనకవైపు నుంచి అమ్మకాలు సాగిస్తున్నారు. పోలీసు వాహనాలు వచ్చినప్పుడే దుకాణాల దగ్గర లేకుండా వెళ్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనం తాకిడి ఎక్కువగా ఉంది.

చేతులెత్తేస్తున్న పోలీసులు

లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సిన పోలీసులు… ఈసారి పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. లాక్‌డౌన్ అంటే ఒక విధమైన భయాన్ని చూపించిన పోలీసులు… ఇప్పుడు మాత్రం ఎందుకో నిర్లక్ష్యంగా చూస్తున్నారు. రోడ్లపై చెక్​పోస్టులు పెట్టినా… పక్కన కుర్చీలకే పరిమితమవుతున్నారు. కనీసం వాహనాలను ఆపడం లేదు. ఉదయం 10 గంటల తర్వాత కొన్ని దుకాణాలు, మాంసం విక్రయాలు కూడా కొనసాగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లోని వీధుల్లో రద్దీ తగ్గడం లేదు.

గతంలో షాపులపై పోలీసులు కేసులు పెట్టేవారు. వారి వద్ద నుంచి అపరాధ రుసుం వసూలు చేశారు. ఇవన్నీ ఇప్పుడు అమలు కావడం లేదు. కనీసం పోలీసులు ప్రధాన రహదారుల వెంట కూడా తిరుగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై చెక్​పోస్టులు పెట్టి ఉదయం వేళల్లో కొంత మేరకు తనిఖీలు చేస్తున్నారు. వాహనాలను సీజ్​ చేసినట్లు చెప్పుతున్నారు. కానీ చాలా మంది స్వచ్ఛంద సంస్థలు, అత్యవసర విధులు అంటూ పాస్​లు తీసుకుని వెళ్తున్నారు.

రక్షణ ఏదీ..?

వాస్తవానికి పోలీసులకు రక్షణ చర్యలు కనిపించడం లేదు. కనీసం నాణ్యమైన మాస్కులు కూడా ఇవ్వడం లేదు. చెక్​పోస్టుల దగ్గర శానిటైజర్​కూడా అందుబాటులో ఉంచడం లేదు. ఫేస్​షీల్డ్‌లు అసలే ఇవ్వడం లేదు. దీంతో వాహనదారుల దగ్గరకు వెళ్లి పాసులు చూపించమనే ధైర్యం చేయలేకపోతున్నారు. కొంతమంది దూరంగా ఉంటూ పాస్‌లు, ఐడీ కార్డులను చూస్తున్నారు. కాగితాలను ముట్టుకోవాలంటే వణుకుతున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా మంది పోలీసులకు వైరస్​ అంటుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో చెక్​పోస్టుల దగ్గర తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు.

జనం నిర్లక్ష్యం

ఇక జనం కూడా కరోనా లాక్‌డౌన్‌ను పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టింపులేకుండానే వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ ఉన్నా లెక్కచేయకుండా రోడ్లపైకి వస్తున్నారు. లాక్‌డౌన్ ప్రారంభమై పదకొండు రోజులు గడుస్తున్న జనం తీరు మాత్రం ఇంకా మారలేదు. వైరస్ వ్యాప్తి తమను ఏం చేయలేదంటూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఈ నెలంతా ఇంట్లో ఉండమని అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లు ఎంత మొత్తుకున్నా జనం తీరు మారటం లేదు. కారణాలేమైనా ఎప్పటిలాగే రోడ్లపై గుంపులు గుంపలుగా తిరుగుతున్నారు.

లాక్‌డౌన్ పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్న వారిని ప్రశ్నిస్తే అత్యవసర పనులు, విధులు, హాస్పిటల్స్ చెకప్ అంటూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. కొంతమంది లాక్‌డౌన్‌ను హాలిడే వెకేషన్‌గా మారుస్తున్నారు. సెలవులు ఇచ్చింది ఇంట్లో ఉండి తమను తాము రక్షించుకోమని చెబుతుంటే మాకేం పట్టింది అంటూ ఒక చోటు నుంచి మరో ప్రదేశానికి వెళ్తూ పార్టీలు చేసుకుంటున్నారు. రోజు రోజుకూ పరిస్థితి తీవ్రతపై ప్రభుత్వం ఆందోళన చెందుతున్నా జనం మాత్రం మాకేం సంబంధం లేదంటూ ఏదో ఒక సాకుతో తిరుగుతున్నారు.


Next Story