ఆసరా కోసం వెయిటింగ్.. టెన్షన్ పెడుతున్న ‘నయా’ పెన్షన్​

by  |
ఆసరా కోసం వెయిటింగ్.. టెన్షన్ పెడుతున్న ‘నయా’ పెన్షన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : “ మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఎల్లమ్మబండకు చెందిన 65 ఏండ్ల వృద్ధురాలు వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. 2019లోనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసింది. రశీదు కూడా ఇచ్చారు. కొత్త పింఛన్​వస్తుందా అంటూ ప్రతినెలా అధికారుల దగ్గరకు వెళ్లి అడిగి వస్తోంది. కొత్త పింఛన్లు రావడం లేదంటూ సదరు వృద్ధురాలును చూడగానే అధికారులు కొంత విసుక్కుంటూ చెప్పి పంపిస్తున్నారు. ( పింఛన్​ వస్తుందో రాదో అనే అనుమానంతో పేరు చెప్పడానికి ఒప్పుకోవడం లేదు)

“ ఇది మరో వితంతు మహిళ పరిస్థితి. గాజుల రామారం ప్రాంతానికి చెందిన ఓ వితంతు మహిళ 2017లోనే పింఛన్​ కోసం అప్లై పెట్టుకుంది. ముందుగా 2018లో వస్తుందని అధికారులు చెప్పారు. కానీ సాంకేతిక కారణాలతో అది రిలీజ్​ కాలేదు. ఆ తర్వాత ప్రతినెలా కార్యాలయానికి వెళ్లి తిరిగి తిరిగి వస్తోంది. పాపం భర్త చనిపోయి దాదాపు ఆరేండ్లు కావొస్తోంది. పింఛన్ వస్తుందేమోనని ఆశ పడితే రావడం లేదు.” (ఈ దరఖాస్తుదారురాలు కూడా పేరు బహిర్గతం చేసేందుకు ఇష్టపడటం లేదు.)

– ఇలా రాష్ట్రంలో లక్షల మంది అభాగ్యులు ఆసరా పింఛన్ల కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కానీ 2018 నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా విడుదల చేయలేదు. ఒకవేళ కలెక్టర్ల స్థాయిలో విడుదల చేస్తారనే అనుమానాలతో ప్రభుత్వం ఆసరా పింఛన్ల విడుదలపై ఆన్‌లైన్‌లోనే ఫ్రీజింగ్​విధించింది.

భారమవుతున్న బతుకుకు ఆసరా అందడం లేదు. బతికి ఉండగానే ఆసరా అందించాలంటూ ఓవైపు అసహాయులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు 80 వేల మంది చనిపోయిన పింఛన్​దారులకు ఆసరా ఆపేశారు. కనీసం వాటి స్థానంలోనైనా కొత్తవి మంజూరు చేయాలని ఏండ్ల తరబడి విన్నవించుకుంటున్నా ఒక్కటంటే ఒక్కటి కూడా మంజూరు చేయడం లేదు. 2018 నుంచి కొత్త పెన్షన్లపై ఫ్రీజింగ్​ విధించారు. అంటే కొత్త దరఖాస్తులను ఆన్‌లైన్ తీసుకోవడం లేదు. 2018కి ముందే రాష్ట్రంలో 6.62 లక్షల దరఖాస్తులు కొత్త పింఛన్ల కోసం వచ్చాయి. వీటిని పరిశీలించి అర్హులుగా తేల్చిన అధికారులు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్ ఇస్తే మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం అనుమతి రావడం లేదు. తాజాగా కొత్త రేషన్​ కార్డులకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. ఈ పింఛన్లపై తేల్చుతుందని ఆశించినా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

57 ఏండ్లకు కాదు… 65 ఏండ్లకూ బ్రేక్​

ప్రభుత్వం హామీని విస్మరించింది.. ఫలితంగా వృద్ధులకు ఆసరా కరువవుతుంది. గత ఎన్నికల ముందు 57 ఏళ్లు నిండిన వృద్ధులకు పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 8.42 లక్షల మంది 57 ఏండ్లు నిండిన వారు కొత్తగా పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాత నిబంధనల ప్రకారం 65 ఏండ్లు పైబడిన దరఖాస్తులు అప్పటికే 6.62 లక్షలు ఉన్నాయి. ఈ దరఖాస్తులన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో రెడీగా ఉన్నాయి. కానీ రెండున్నరేండ్లు గడుస్తున్నా కొత్త పింఛన్‌ జాడ లేదు. అయ్యా.. పింఛన్‌ అంటూ వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారే తప్పా.. ఏ ఒక్కరికి పింఛన్‌ ఆసరా లేకుండా పోయింది. రాష్ట్రంలో ఏప్రిల్​ లెక్కల ప్రకారం 38.42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, బీడీకార్మికులు, హెచ్ఐవీ, ఫైలేరియా బాధితులకు రూ. 2016, వికలాంగులు, కళాకారులకు మాత్రం రూ.3,016 చొప్పున పంపిణీ చేస్తున్నారు.

గతేడాది అర్హుల గుర్తింపు

టీఆర్‌ఎస్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో పింఛన్‌లపై పలు హామీలు ఇచ్చింది. ప్రధానంగా పింఛన్‌ పెంపుతో పాటు వృద్ధాప్య పింఛన్‌ వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని హామీ ఇచ్చారు. 57 ఏళ్లు నిండిన వృద్ధుల జాబితాను తయారు చేయాలని ప్రభుత్వం 2019లో అధికారులను ఆదేశించింది. దీంతో రెండు మూడు నెలలు ఆధార్‌ కార్డు, ఓటరు జాబితాలో ఉన్న వయస్సు ఆధారంగా అర్హులైన వృద్ధుల జాబితా తయారు చేశారు. కొత్త హామీ ప్రకారం 57 ఏండ్లు పైబడిన వారి జాబితాను పరిశీలించారు. అంతకుముందు 65 ఏండ్లు పైబడిన వారి జాబితాను సిద్ధం చేసి రెడీ పెట్టారు.

నిధులైతే పెట్టారు..!

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ఆసరా పింఛన్లకు భారీగా నిధులు కేటాయించింది. 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు వృద్ధాప్య పింఛన్ల వయస్సు తగ్గించడంతో పెరిగిన ఆసరా పింఛన్‌ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. 2019-20లో రూ.9,402 కోట్లు కేటాయించగా ఈ సారి రూ. 11,758 కోట్లు కేటాయించారు. దీంతో కొత్త ఆసరా పింఛన్‌ దరఖాస్తులు క్లియర్​చేస్తారని ఆశించారు.

మూడేండ్ల నుంచి అంతే

సర్కారు హామీ మూడేండ్ల నుంచి ఇప్పటిదాకా నెరవేరలేదు. గతంలో ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వెంటనే విచారణ జరిపి, ఆ మరుసటి నెలే పింఛన్‌ మంజూరు చేసేవారు. కానీ, 2018లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత నుంచి ఇప్పటిదాకా ఒక్క కొత్త పింఛన్‌ కూడా మంజూరు చేయలేదు. అన్ని కేటగిరీల వారు దరఖాస్తు చేసుకుంటున్నా పెండింగ్‌లోనే పెట్టారు. ప్రస్తుతం దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏండ్ల పైబడిన వారి దరఖాస్తులు 6.62 లక్షలు ఉండగా… 57 ఏండ్లకు కుదిస్తే మరో 8.42 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ఇవన్నీ అధికారుల పరిశీలన పూర్తి చేసి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం వృద్ధాప్య పింఛన్‌కు 65 ఏళ్లు, చేనేత, గీత, బీడీ కార్మికులకు 50ఏళ్లు, వితంతువులకు (18ఏళ్లు పైబడి భర్త చనిపోయి ఉంటే), ఒంటరి మహిళలకు 35 ఏళ్లుగా అర్హత వయసు ఉన్నది. వికలాంగులు, పైలేరియా, ఎయిడ్స్‌ బాధితులకు ఎటువంటి అర్హత వయసు లేదు. ఆసరా పెన్షన్‌తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఓటరు జాబితాలో ఉన్న వయస్సును నిర్ధారించుకునేందుకు ఆధార్‌ను చెక్​చేశారు. అలాగే ఏజ్​ ప్రూఫ్‌కు ఇతర ఆధారాలు కూడా తీసుకున్నారు.

80,200 మంది చనిపోయిన వారు

ఆసరా పెన్షన్‌దారుల్లో నెలనెలా నాలుగు వేల నుంచి ఐదు వేల మరణాలు రిపోర్టు అవుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఆత్మలకు పింఛన్లు ఇస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. రాష్ట్రంలో విచారణ చేశారు. ఈ విచారణలో 80,200 మంది చనిపోయినా వారి పింఛన్లు విడుదలైనట్లు గుర్తించారు. ఇలాంటి వారి ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.80 కోట్లకుపైగా ఉండొచ్చని అంచనా వేశారు. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఎక్కువగా ఇలాంటి కేసులు బయటపడ్డాయి. ఈ సొమ్ము రికవరీ కోసం ఇప్పటికే ఆయా బ్యాంకులు, పోస్టాఫీసులకు లేఖలు రాశారు. ప్రస్తుతం వారందరికీ పింఛన్లు నిలిపివేశారు.

కొత్తవి ఇవ్వండి

అయితే చనిపోయిన వారి స్థానంలోనైనా కొత్తవి మంజూరు చేయాలంటూ గతంలోనే కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. కానీ ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. ఒకవేళ కలెక్టర్లు మంజూరు చేస్తారేమోననే అనుమానాలు కొత్తవి ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో ఫ్రీజింగ్ విధించారు. దీంతో ఒక్క దరఖాస్తుకూ మోక్షం రావడం లేదు.

మాకు సమాచారం లేదు

మరోవైపు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కొత్త పింఛన్లపై సమాధానం దాటవేస్తున్నారు. ఏండ్ల నుంచి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పుతున్న అధికారులు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదంటున్నారు. కొత్త వాటి కోసం ఇప్పటికే పలుమార్లు నివేదికలు పంపించామని, కానీ కొత్తవి నమోదు చేయకుండా ఆన్‌లైన్‌లోనే ఫ్రీజింగ్ విధించారన్నారు. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారనే సమాచారంతో పింఛన్లకు అప్లై చేసుకున్న వారు కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, కానీ వారికి ఏం సమాధానం చెప్పలేకపోతున్నామంటున్నారు.



Next Story

Most Viewed