కరోనా టెస్టుల కోసం ఎర్రటి ఎండలో ప్రజల అవస్థలు

by  |
corona tests
X

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ పట్టణంలో కరోనా మహమ్మారి వీర విహారం చేస్తోంది. పరీక్షా కేంద్రాల ఎదుట కరోనా అనుమానిత లక్షణాలతో క్యూలో నిల్చున్న జనమే ఇందుకు నిదర్శనం. కరోనా టెస్టుల కోసం వందలాదిమంది ఎర్రటి ఎండలో నిలబడుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కూడా వైద్య ఆరోగ్య శాఖ కల్పిచకపోవడం గమనార్హం. పరీక్షలకు వస్తున్న వారిలో వృద్ధులు, మహిళలు అధికంగా ఉంటున్నారు. దీంతో ఎండలో చాలాసేపు నిల్చుండటంతో ఎండదెబ్బకు స్పృహ తప్పి పడిపోతున్నారు. ఈ క్రమంలో చెప్పులను క్యూలో పెట్టి చెట్ల నీడలో నిలబడుతున్నారు. కరోనా నుంచి తప్పిచుకోవడానికి పరీక్షలకు వస్తే.. అధికారుల నిర్లక్ష్యంతో తమ ప్రాణం మీదకు వచ్చేట్లు ఉందని జనాలు మండిపడుతున్నారు.

అయితే.. ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతున్న పరీక్షా కేంద్రాలను కేవలం 4 గంటల పాటే కొనసాగించి కేంద్రాన్ని మూసివేస్తున్నారు. దీంతో ఎండకు క్యూలో చాలాసేపు నిల్చున్నా.. టైమ్ అయిపోయాక వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో ఉదయం 6గంటల నుంచే పరీక్షలకు జనాలు క్యూ కడుతున్నారు. అయినా అధికారులు మాత్రం తీరిగ్గా 10 గంటల తర్వాతే పరీక్షలు మొదలు పెట్టి మూడు నాలుగు గంటల్లో ముగించేస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాల సమయం గడువు పెంచాలని వేడుకుంటున్నారు.

Next Story

Most Viewed