అడిగినంతా ఇవ్వాల్సిందే… లేకపోతే…!

by  |
అడిగినంతా ఇవ్వాల్సిందే… లేకపోతే…!
X

దిశ, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‍ కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అత్యవసర సమయాల్లో బయటకు వచ్చిన వాహనదారులపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. తనిఖీల పేరుతో సీజ్ చేసిన కొన్ని వాహనాలను ప్రైవేట్ పార్కింగ్ స్థలాల్లో పెట్టారు. ఈ మేరకు వందలాదిగా ఆటోలు సైతం సీజ్ చేశారు. పోలీసుల అనుమతి తీసుకొని వాహనాలు కోసం అక్కడికి వెళితే పార్కింగ్ ఫీజు చెల్లించాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు చెల్లించకపోతే వాహనాలు ఇవ్వడంలేదని, పార్కింగ్ లలోనే ఉంటే పాడై పోతున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఆటోలు నడవక కుటుంబాలను పోషించటమే కష్టంగా మారిన పరిస్థితుల్లో ఇక పార్కింగ్ చార్జీలు ఎలా చెల్లిస్తామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వసూలు దందా..?

లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కొందరు అత్యవసర సమయాల్లో.. మరికొందరు కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో నిబంధనలు అతిక్రమించారంటూ పోలీసులు ఆటోలు, బైక్ లు సీజ్‍ చేస్తున్నారు. కరోనా కట్టడిలో భాగంగా వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలో గడిచిన నెల రోజుల్లోనే 1193 వాహనాలను పోలీసులు సీజ్‍ చేశారు. రోడ్డెక్కిన ఆటోలనే కాదూ బైక్ లను సైతం సీజ్ చేస్తున్నారు. కొన్ని వాహనాలు స్టేషన్ లో పెట్టిన పోలీసులు మరి కొన్ని వాహనాలు, ఆటోలు ప్రైవేట్ పార్కింగ్ స్థలాల్లో ఉంచారు. అత్యవసర సమయాల్లో బయటకు వచ్చామని ఆధారాలు చూపటంతో కొన్ని వాహనాలను వదిలేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వాహనాలకు మాత్రం జరిమానాలు విధించారు. పోలీసుల అనుమతి తీసుకుని వాహనాలు తెచ్చుకునేందుకు వెళితే పార్కింగ్ నిర్వాహకులు బైక్‍, ఆటో వంటి వాహనాలకు ప్రతి ఆరు గంటలకు రూ.10 చొప్పున రోజుకు రూ. 40 ఫీజు చెల్లించాలని చెబుతున్నారు. ఏదో ఒక్కరోజు అంటే ఏమోకానీ నెలల తరబడి వేలాది రూపాయలు కట్టాలంటే తలకు మించిన భారం అవుతోందని బాధితులు వాపోతున్నారు. ఇక కారు అయితే రూ. 50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఒక్కో వాహనానికి ఒక్కో రకంగా పార్కింగ్‍ ఫీజులు వసూలు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారని వాహనదారులు వాపోతున్నారు. పోలీస్ అధికారుల కనుసన్నల్లోనే ఈ దందా నడుస్తోన్నదని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు.

Tags: Warangal, Parking, Vehicles, Police, Parking Fees, Lockdown



Next Story

Most Viewed