కరోనా విలయం : ఒకే రోజు.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

by  |
కరోనా విలయం : ఒకే రోజు.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
X

దిశ, నారాయణపేట : కరోనా రక్కసి ఒకే కుటుంబంలో ముగ్గురిని బలితీసుకుంది. ఈ ఘటన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగల్ మడక గ్రామంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. భద్రయ్య స్వామి శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు కలరు. వీరి పేర్లు నాగయ్య స్వామి, శంభులింగం, శాంతలింగం, శివమ్మ. తండ్రి భద్రయ్య స్వామి ఆర్ఎంపీ వైద్యుడిగా ఎన్నో ఏళ్ల నుంచి సేవలందిస్తూనే కొడుకు, కూతురు పెళ్లిళ్లు చేశాడు. మొదటి కొడుకుకు నాగయ్య స్వామి తన కుటుంబంతో నారాయణపేటలో ఉంటుండగా, చిన్న కొడుకు శాంతలింగం మద్దూర్ మండల కేంద్రంలో నివాసముంటూ మెడికల్ షాపు నడుపుతున్నాడు. రెండవ కొడుకు శంభులింగం భార్య పిల్లలతో కలిసి మొగల్ మడక గ్రామంలోనే తల్లిదండ్రులతో ఉంటూ ఆర్ఎంపీగా గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తున్నాడు.

పక్షం రోజుల కిందట శంభులింగం(35) కరోనా బారిన పడి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం తండ్రి భద్రయ్య స్వామికి (60) కరోనా పాజిటివ్ వచ్చింది. ఈయన్ను కూడా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య శశికళ(54)కు భర్తను చూసేందుకు మహబూబ్ నగర్ ఆస్పత్రికి వెళ్లగా ఆమెకు కూడా కరోనా సోకింది. భార్యాభర్తలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తల్లి శశికళ శుక్రవారం తెల్లవారు జామున 2గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచింది. మరోవైపు నవోదయ లో చికిత్స పొందుతున్న కొడుకు శంభులింగం ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో పరిస్థితి విషమించి మృతిచెందాడు.

ఇదే రోజున మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తండ్రి భద్రయ్యస్వామి సైతం కన్నుమూయడంతో ఒకే రోజు, ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. కేవలం రెండు, మూడు గంటల వ్యవధిలో తల్లిదండ్రులు, కొడుకును కరోనా బలి తీసుకోవడంతో మొగల్ మడక గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామంలో అందరికీ ఆరోగ్య సేవలు అందించే ఆ కుటుంబంలో ఒకే రోజు తల్లి తండ్రి, కొడుకు మృతి చెందడాన్ని అటు బంధువులు, ఇటు గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, జిల్లా కేంద్రం నుంచి అంబులెన్సులో ముందుగా శశికళ, శంభులింగం మృతదేహాలను వైద్య సిబ్బంది మొగల్ మడ్క గ్రామానికి తీసుకువచ్చి సంప్రదాయ బద్ధంగా ఖననం చేశారు. తండ్రి భద్రయ్యస్వామి మృతదేహాన్ని సాయంత్రం అంబులెన్సులో తీసుకువచ్చి తల్లి కొడుకుల పక్కనే ఖననం చేశారు. ముగ్గురి మృతదేహాలను చూసేందుకు గ్రామస్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఖననం చేసే స్థలానికి వచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.


Next Story