వారి కల నెరవేర్చిన కవలలు.. ఏం చేశారంటే?

by  |
వారి కల నెరవేర్చిన కవలలు.. ఏం చేశారంటే?
X

దిశ, ఫీచర్స్ : పాలస్తీనాలోని ఆక్రమిత ‘వెస్ట్ బ్యాంక్‌’లో విమానాశ్రయం లేదు. ఇక్కడి పౌరులు విమాన ప్రయాణం చేయాలంటే పక్కనున్న జోర్డాన్‌కు వెళ్లాల్సిందే. అయితే ఖమీస్ ఆల్ సైరాఫీ తన సోదరునితో కలిసి వెస్ట్‌బ్యాంక్ ప్రాంత ప్రజలకు విమానం ఎక్కే చాన్స్ కల్పిస్తున్నారు. అయితే ఇందులో విహరించే వీలు లేదు కానీ కడుపునిండా భోజనం మాత్రం చేయొచ్చు. ఏంటీ అర్థం కాలేదా? విషయం ఏమిటంటే, కవల సోదరులు ఓ పాత బోయింగ్ 707 విమానాన్ని కొనుగోలు చేసి, నబ్లస్ నగరం వెలుపల దాన్ని కేఫ్ అండ్ రెస్టారెంట్‌గా మార్చారు.

99 శాతం పాలస్తీనియన్లు ఎప్పుడూ విమానాన్ని ఉపయోగించలేదు. ఆ దేశ రాయబారులు, దౌత్యవేత్తలు, మంత్రులు, మేయర్లతో పాటు కొద్దిమంది ధనవంతులు మాత్రమే అందులో ప్రయాణం చేస్తుంటారు. ఎంతోమంది పాలస్తీనా పౌరులకు దూరంగా విమానాన్ని చేరువ చేసేందుకు సైరాఫీ సోదరులు ప్రయత్నించి ఇటీవలే ‘పాలస్తీనా-జోర్డాన్ ఎయిర్‌లైన్ రెస్టారెంట్ అండ్ కాఫీ షాప్ అల్-సైరాఫీ’ని ప్రారంభించారు. ఐదు షెకెల్స్ (సుమారు $ 1.50) చెల్లిస్తే విమానం లోపల సెల్ఫీలతో పాటు ఫ్యామిలీ ఫొటోలు కూడా తీసుకునే అవకాశం కల్పించారు.

1961 – 1993 మధ్యలో ఉపయోగించిన బోయింగ్ 707 విమానం రిటైర్డ్ కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. అయితే ఆ విమానాన్ని ముగ్గురు ఇజ్రాయెల్ వ్యాపార భాగస్వాములు కొనుగోలు చేసి, దాన్ని రెస్టారెంట్‌గా మార్చాలని కలలు కన్నారు. అయితే స్థానిక అధికారులతో విభేదాలు రావడంతో చర్చల దశలోనే ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఆ విషయం తెలుసుకున్న కవల సోదరులు ఎలాగైనా తాము ‘విమాన రెస్టారెంట్’ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ ముగ్గురు యజమానుల ఆచూకీ కోసం ఎంతో ప్రయత్నించగా, 1999లో అందులో ఒకరి జాడ తెలిసింది. అతడితో చర్చలు జరిపి ఆ విమానాన్ని లక్ష డాలర్లకు కొనుగోలు చేయడానికి అంగీకరించారు.

లైసెన్స్‌లు, అనుమతులతో పాటు, దాన్ని వెస్ట్‌బ్యాంక్‌కు షిప్పింగ్ చేయడానికి అదనంగా మరో 50వేల డాలర్లు ఖర్చు చేశారు. ఈ క్రమంలోనే అప్పటి నబ్లస్ మేయర్ గసన్ షాకా విమాన పునరుద్ధరణకు, ఇతర పనులకు త్వరగానే ఆమోదం తెలిపాడు. ఇక తాము రెస్టారెంట్ ప్రారంభించే ప్రదేశంలో అమ్యూస్‌మెంట్ పార్క్, స్విమ్మింగ్ పూల్, కన్సర్ట్ వెన్యూలను కూడా నిర్మించారు. అయితే అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో 2000 చివరిలో రెండో పాలస్తీనా తిరుగుబాటు ప్రారంభమైన కావడంతో తమ ప్రాజెక్ట్ నిలిపివేశారు. ఇజ్రాయెల్ సైన్యం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని స్విమ్మింగ్ పూల్, పార్క్, కన్సర్ట్ వెన్యూ అన్నింటినీ ధ్వంసం చేశారు. దశాబ్దం తర్వాత విమానాన్ని పునర్నిర్మించి ప్రజల కోసం ప్రారంభించారు.

కేఫ్ ఇప్పటికే ఓపెన్ కాగా వచ్చే నెలలో రెస్టారెంట్ తెరవాలని సోదరులు భావిస్తున్నారు. విమానంలోని కస్టమర్లకు ఆహారాన్ని అందించడానికి విమానం కింది ప్రదేశాన్ని వంటగదిలా మార్చాలని యోచిస్తున్నారు. పార్క్, ఈతకొలను రెండేళ్లలో తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.



Next Story

Most Viewed