మేం.. ఎవరో తెలుసా? మా అన్నకు ఫోన్ చేయాలా?

by  |
మేం.. ఎవరో తెలుసా? మా అన్నకు ఫోన్ చేయాలా?
X

దిశ, న్యూస్ బ్యూరో: వీఐపీలు, పైరవీకారులు ఎక్కడ ఉన్నా వాళ్ల తీరే వేరు. అదెక్కడైనా సరే.. ఎవరేం అనుకుంటారన్న ఆలోచన లేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామన్న స్పృహ కూడా లేదు. ఎలాంటి సేవలందిస్తున్నారో అంచనా ఉండదు. మేం.. ఎవరో తెలుసా? మా అన్నకు ఫోన్ చేయాలా? మా సార్‌కు ఫోన్ చేసి చెప్పాలా? ఇప్పుడు వేడి నీళ్లు కావాలి. ఏసీ పని చేయడం లేదు. అప్పుడే వెళ్లిపోవాలా? ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటాం.. అంటూ కొందరు వీఐపీలు కరోనాలోనూ రుబాబు ప్రదర్శిస్తున్నారు. కొవిడ్-19లో యుద్ధం చేస్తోన్న వైద్య, ఆరోగ్య సిబ్బంది పట్ల వారి ప్రవర్తన దురుసుగా ఉంటోంది. హైదరాబాద్‌లోని ప్రకృతి చికిత్సాలయం (నేచర్ క్యూర్ ఆసుపత్రి) దుస్థితి ఇది. మూడు నెలలుగా కరోనా వైరస్‌తో పోరాడుతోన్న వైద్యులు, సిబ్బంది ఈ వీఐపీలతో నరకయాతన అనుభవిస్తున్నారు. గతంలోనే క్వారంటైన్ కోసమే వచ్చేవాళ్లు. ఇప్పుడేమో కరోనా పాజిటివ్ సోకిన వారికి ఐసోలేషన్ భాగ్యాన్ని కూడా కల్పిస్తోందీ నేచర్ క్యూర్ ఆసుపత్రి. ఐతే ఈ ఆసుపత్రి వాతావరణంతోనే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అక్కడున్న ఆహ్లాదకర వాతావరణమే చికిత్స. అందుకే సంపన్నులు, పలుకుబడి ఉన్నోళ్లు, రాజకీయ నాయకులంతా ఇక్కడే చికిత్స పొందేందుకు పోటీ పడుతున్నారు. అయితే వాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపడేందుకు ఆతృత ఫర్వాలేదు. కానీ అక్కడ బెడ్ పొందాలంటే కాస్త పైరవీ తప్పదు మరీ.. ఈ క్రమంలో పెద్దోళ్ల నుంచి, పెద్ద ఆఫీసుల నుంచి ఫోన్లు చేయించుకొని వచ్చిన రోగుల వ్యవహార శైలితో అక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది పడే ఇబ్బంది అంతాఇంతా కాదు. వేళ గానీ వేళ గొంతెమ్మ కోరికలతో సమస్యను సృష్టిస్తున్నారు.

స్పెషల్ ట్రీట్‌మెంట్ కోసం ఆరాటం

డ్యూటీలో ఉన్న డాక్టర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. హోటళ్లలో మాదిరిగా వారికి కావాల్సినవి సాధించుకోవడానికి ఆర్డర్లు వేస్తున్నారని ఓ డాక్టర్ ‘దిశ’కు వివరించారు. కొద్దిపాటి లక్షణాలతో చేరే ఈ వీఐపీ సిఫారసు కలిగిన రోగులు డిశ్చార్జి చేసినా వెళ్లమంటూ మంకుపట్టు పడుతున్నారు. సరైన టైమ్‌కు బలవర్ధకమైన తిండి లభిస్తోంది. పైగా ఇంటికి వెళ్తే హోం ఐసోలేషన్ ప్రక్రియతో కుటుంబ సభ్యులకు కూడా సమస్యే. అందుకే డిశ్చార్జి అయ్యేందుకు ససేమిరా అంటూ ఎక్కువ రోజులే ఉంటున్నారని చెప్పారు. పైగా ఏదైనా వాళ్లు కోరుకున్నది కాస్త ఆలస్యమైతే వెంటనే వారి సిఫారసులను గుర్తు చేస్తున్నారు. ఎక్కువగా రాజకీయ నాయకుల రికమండేషన్లతోనే వస్తున్నారు. దాంతో ఆసుపత్రి పెద్దలు కూడా వాళ్ల వైపు మాట్లాడక తప్పడం లేదు. వాళ్లకు కేటాయించిన బెడ్ల దగ్గర కాకుండా దోస్తులు, పరిచయస్థుల చెంతనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. వాళ్లకు ట్రీట్‌మెంట్ సమయంలో వెతుక్కోవాల్సి వస్తోందంటున్నారు. ఆఖరికి పారిశుధ్య కార్మికుల పట్ల కూడా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు.

సిబ్బంది సమస్యలనేకం

– కేవలం 12-15 మంది పారిశుధ్య కార్మికులే ఉన్నారు. కానీ 250 నుంచి 300 బెడ్లను శుభ్రం చేయాల్సి వస్తోంది. ఐసొలేషన్ బెడ్ల దగ్గర క్లీనింగ్ ఎంత కష్టమో అంచనా వేయొచ్చు.
– జూనియర్ డాక్టర్లకు ఎలాంటి వసతి లేదు. కనీసం రవాణా సదుపాయం కల్పించడం లేదు.
– ఖాళీగా ఉన్న బాయ్స్ హాస్టల్ లోనే మహిళా డాక్టర్లకు వసతి కల్పించారు. అక్కడేమో నీళ్ల వసతి కూడా సరిగ్గా లేదు.
– పారిశుధ్య కార్మికులకు కరోనా రక్షణ చర్యలను సక్రమంగా చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు.
– పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్ లను కాలేజీలోనే నిల్వ చేస్తున్నారు.
– కొవిడ్-19 గైడ్‌లైన్స్ ప్రకారం రాత్రి వేళల్లో మహిళా డాక్టర్లకు డ్యూటీ వేయొద్దు. కానీ ఇక్కడేమో తప్పడం లేదు.
– బయోమెట్రిక్ యంత్రం(హాజరు కోసం) కూడా అందరికీ ఒక్కటే. ఈ క్రమంలో కరోనా రక్షణ చర్యలేం లేవని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– ప్రకృతి చికిత్సాలయం వైద్యులతో పాటు యునానీ, డీఎంహెచ్ఓ ల నుంచి 30 మంది వరకు డాక్టర్లు వచ్చారు. దాంతో వీళ్లకే భౌతికదూరం సాధ్యం కావడం లేదంటున్నారు. అందరికీ నేచర్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స అవసరమంటారు. కానీ తమ సమస్యలు పరిష్కరించేందుకు మాత్రం కృషి చేయడం లేదని ఆసుపత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed