ఆన్‌లైన్ విద్య సాధ్యమేనా !

by  |
ఆన్‌లైన్ విద్య సాధ్యమేనా !
X

దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో ఈ విద్యా సంవత్సరం ఎలా ఉండబోతుందనే విషయంలో విద్యార్థులు అందోళన చెందుతున్నారు. తాజాగా ఇతర రాష్ట్రాల మాదిరిగానే సీఎం కేసీఆర్ సైతం 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అటు 10వ తరగతి పరీక్షలు కూడా హైకోర్టు జోక్యంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోడీతో వీడియోకాన్ఫరెన్స్‌లో పలు రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్ పొడిగించాలని కోరారు. మన దగ్గర కూడా ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం ప్రకటన చేశారు. ఆ తర్వాత కూడా దశలవారీగానే లాక్‌డౌన్ ఎత్తి వేస్తామని స్పష్టం చేయడంతో జిల్లావ్యాప్తంగా డిగ్రీ, పీజీ విద్యార్థుల పరిస్థితులపై నీలినీడలు అలుముకున్నాయి.

చాలా వరకు డిగ్రీ, పీజీ కాలేజీల్లో 50శాతం కూడా సిలబస్ పూర్తి కాకపోవడంతో జూన్ వరకు ఎలా పూర్తి చేయాలనే విషయంలో అధ్యాపకులు తర్జన భర్జన పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 88డిగ్రీ కాలేజీల్లో 34వేల మంది విద్యార్థులు, 11 పీజీ కాలేజీల్లో 1200మంది, 4ఫార్మసీ కళాశాలల్లో 750 మంది, 28 బీఈడి కళాశాలలో 8,600 మంది, రెండు ఎంఈడి కాలేజీల్లో 400 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి విద్యను ఎలా అందించాలి, సిలబస్‌ను ఎలా పూర్తి చేయాలనే దిశగా అధ్యాపకులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ద్వారా బోధన చేపట్టాలని యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ కూడా వీడియో కాన్పరెన్స్‌లో పేర్కొనడంతో అధ్యాపకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న నేపథ్యంలో వారికి ఆన్‌లైన్ పద్ధతిలో బోధన ప్లాన్ చేస్తున్నారు. వాట్సాప్‌ల ద్వారా స్టడీ మెటీరియల్‌ను పంపించి సందేహాలను నివృత్తి చేసేలా సిద్ధం అవుతున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్లు లేని వారు, ఇంటర్‌నెట్ సౌకర్యం తక్కువగా ఉన్న గ్రామాల్లో విద్యార్థుల పరిస్థితి ఏమిటి అనే దిశగా కూడా అధ్యాపకులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పలు ఓపెన్ యూనివర్సిటీలు ఆన్‌లైన్ పద్ధతిలో బోధనను సాగిస్తుండడంతో వారు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ విషయంలో పాలమూరు యూనివర్సిటీ నుండి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు కూడా తగు అదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితిలో విద్యాభ్యాసంపై లాక్‌డౌన్ ప్రభావం పడకుండా జాగ్రతలు తీసుకుని వాట్సాప్, ఆన్‌లైన్ ద్వారా విద్యను బోధించాలని సూచించారు. మొత్తం మీద యూనివర్సిటీ అధికారులు తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు సత్పలితాలు ఇస్తాయనేది పక్కకు పెడితే, లాక్‌డౌన్‌తో విద్యార్థులకు మాత్రం తిప్పలు తప్పేలా లేవు.

Tags: Corona Effect, Lockdown, Degree, PG students, Palamooru University, Online Education, Mahabubnagar



Next Story

Most Viewed