హుజూరా‘వార్’లో అంతా ఆన్‌లైనే.. చేతులు మారుతున్న కోట్ల కరెన్సీ

by  |
హుజూరా‘వార్’లో అంతా ఆన్‌లైనే.. చేతులు మారుతున్న కోట్ల కరెన్సీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాలుగు రోజుల క్రితం వరకు ఒకవైపే ఉన్న బెట్టింగ్.. ఇప్పుడు రెండు ప్రధాన పార్టీల మధ్యకు చేరింది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల గెలుపుపై మొన్నటిదాకా రూ. 100, రూ. 200 కోట్ల వరకూ సాగిన పందెం దందా రూ. 1,000 కోట్లకు ఎగబాకిందని తెలుస్తున్నది. ఈటల రాజేందరే గెలుస్తాడు అని ఎక్కువ బెట్టింగ్​పెడుతున్నట్టు సమాచారం. రూపాయికి.. వెయ్యి రూపాయలు అనే స్థాయిలో బెట్టింగ్స్ నడుస్తున్నాయి. దీంతో, ఇక్కడ వెయ్యి నుంచి మొదలైన బెట్టింగ్.. కోట్లకు చేరుతోంది.

అభ్యర్థుల మెజార్టీ, పార్టీల వారీగా వచ్చే ఓట్లపై సైతం బెట్టింగ్​కాస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గెలుపు, టీఆర్ఎస్​గెలుపుతోపాటు మెజార్టీ ఎంత.? అనే అంచనాపైనా కూడా బెట్టింగ్స్ కాస్తున్నారు. ఈటల రాజేందర్‌కు 20 వేల మెజార్టీపై రూ.100కు పదింతలు అనే స్థాయిలో ఉంటే.. గెల్లు శ్రీనివాస్​ గెలుస్తాడని, కనీసం వెయ్యి నుంచి ఐదు వేల ఓట్ల మెజార్టీ వస్తుందని రూ. 1000కి నాలుగింతలు అని బెట్టింగ్ పెడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు చీల్చుతారనే కోణంలో కూడా పందెం వేసుకుంటున్నారు.

బద్వేల్​బరి వదిలి.. హుజూరా‘వార్’కు..

తెలంగాణ రాజకీయాల్లోనే అత్యంత ఖరీదైనదిగా హుజూరాబాద్ ఉప ఎన్నిక మారింది. దీనికి తోడు ఇప్పుడు బెట్టింగ్ రగడ మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌ల వేళ రాజ‌కీయం ఉత్కంఠ‌గా మారింది. ఏపీలోని బద్వేల్‌లోనూ బై ఎలక్షన్ జరుగుతున్నది. అక్కడ పోటీ కేవలం వైసీపీ, బీజేపీ మధ్యనే ఉండటం, బరిలో టీడీపీ, జనసేన లేకపోవడం గమనార్హం. దీంతో వైసీపీ కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండటంతో బెట్టింగ్​బంగార్రాజుల దృష్టి అటువైపు పడలేదు.

నువ్వా నేనా.. అన్న రీతిలో సాగుతున్న హుజూరాబాద్‌లోనే థ్రిల్​ఉంటుందనుకొని, నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చని భావించినట్టు తెలుస్తున్నది. బెట్టింగ్ అంటే ముందుండే ఏపీ నేతలు, వ్యాపారులతోపాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారు బెట్టింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారని సమాచారం. ఆంధ్రా నాయకులు ఇక్కడ తెలిసిన వారికి ఫోన్‌ చేసి ఏ పార్టీ గెలుస్తుంది.. ఎంత మెజార్టీ వస్తుంది? అనే వివరాలను ప్రతీరోజూ తీసుకుంటున్నారు. ఇటీవల ఆంధ్రాకు చెందిన కొంతమంది నేతలు, వ్యాపారవేత్తలు, పందెంరాయుళ్లు ప్రత్యేకంగా వాహనాల్లో హుజూరాబాద్‌కు వచ్చి ప్రచార శైలిని అంచనా వేసి, పలు సర్వే నివేదికలను తీసుకొని వెళ్లారు.

ఆన్‌లైన్‌లో పేమెంట్స్.. హోటళ్లలో మకాం

హుజూరాబాద్‌ ఎన్నికలకు సంబంధించిన బెట్టింగ్‌ నిర్వహించే బూకీలు ఆన్‌లైన్‌లోనే దందా నడుపుతున్నారు. కొంతమంది బూకీలు అటు కరీంనగర్, ఇటు వరంగల్‌లోని పలు హోటళ్లలో మకాం వేశారు. రూపాయికి రూ.10, కొన్ని చోట్ల రూపాయికి రూ.1000 ఇలా కోట్లాది రూపాయలు బెట్టింగ్‌ సాగుతున్నది. ఇటీవల వరంగల్ జిల్లాలో పోలీసులు ఓ హోటల్‌లో ఆకస్మిక తనిఖీలు సైతం చేపట్టారు. బెట్టింగ్​ పేమెంట్స్​కూడా మొత్తం ఆన్‌లైన్ ద్వారానే లావాదేవీలు చేస్తున్నట్టు తెలిసింది.

అధికారులకు పాకిన బెట్టింగ్​ ఫీవర్..​

హుజూరాబాద్​ఉప ఎన్నికపై ఐఏఎస్‌లు, ఉన్నతస్థాయి అధికారవర్గాల్లోనూ ప్రధానంగా చర్చ నడుస్తున్నది. ఇటీవల ఓ టీవీ చర్చలో టీఆర్ఎస్​ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. ఈటలకు డిపాజిట్ కూడా రాదని, గెలిచే ప్రసక్తే లేదని, ఒకవేళ గెలిస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్కే భవన్‌లోనే ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ, మరో ఇద్దరు ఉన్నతాధికారులు బెట్టింగ్‌కు దిగినట్టు చర్చ నడుస్తున్నది.

ఈటల మంత్రిగా పనిచేసిన ఓ శాఖలోని మరో ఇద్దరు సీనియర్​ అధికారులు కూడా పందెం వేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఐపీఎస్ అధికారుల్లోనూ ఇదే చర్చ సాగుతున్నదని, ఇంటెలిజెన్స్ వర్గాలకు ఫోన్​ చేసి పరిస్థితులపై ఆరా తీస్తున్నారని తెలిసింది. పోలీస్ శాఖలోనే ఈ బెట్టింగ్‌ల జోరు సాగుతున్నదని సమాచారం. ఏది ఏమైనా హుజూరాబాద్​ఉప ఎన్నిక బెట్టింగ్ దందాలో ఎవరి పంట పండిస్తుందో.. ఎవరిని నష్టాల పాలు చేస్తుందో నవంబర్ ​ఒకటో తేదీన తేలనుంది.


Next Story

Most Viewed