దెబ్బ మీద దెబ్బ.. తీన్మార్ మల్లన్నపై మరో కేసు.. ఎక్కడంటే!

by  |
దెబ్బ మీద దెబ్బ.. తీన్మార్ మల్లన్నపై మరో కేసు.. ఎక్కడంటే!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తీన్మార్ మల్లన్నపై మరో కేసు నమోదైంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్‌స్టేషన్‌లో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను ఏ5గా పేర్కొంటూ కేసు నమోదు చేసినట్టు బోధన్ ఏసీపీ రామారావు విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. శనివారం ఎడపల్లి పీఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన కల్లు ముస్తేదార్ జయవర్ధన్ గౌడ్‌ను రూ. 20 లక్షలు చెల్లించాలని బెదిరించినందుకు క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్టు బోధన్ ఏసీపీ రామారావు తెలిపారు.

బాధితుని ఫిర్యాదు మేరకు ఎడపల్లి మండలం జానకంపేట్‌కు చెందిన తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు ఉప్పు సంతోష్‌ను ఏ1గా, ఏ2గా రాధా కిషన్, ఏ3గా రాజా గౌడ్, సాయగౌడ్ ఏ4, చింతపండు నవీన్ కుమార్‌ను ఏ 5గా పేర్కొంటూ కేసులు నమోదు చేశామన్నారు. కల్లు ముస్తేదారు జయవర్ధన్ గౌడ్‌ను జూన్ నెల నుండి డబ్బుల కోసం అదే గ్రామానికి చెందిన కొందరు బెదిరిస్తున్నారని వివరించారు. వారి బెదిరింపులకు భయపడి జయవర్ధన్ గౌడ్ ఆగస్టు నెలలో రూ. 5 లక్షలు చెల్లించారని, తీన్మార్ మల్లన్న పాదయాత్ర ఉందని మిగతా 15 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో వేధింపులు తాళలేక గురువారం ఫిర్యాదు చేశారన్నారు. దీంతో తాము ఈ ఘటనకు బాధ్యులైన మల్లన్నతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. అనంతరం ఉప్పు సంతోష్‌ను అరెస్టు చేయగా, మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. తీన్మార్ మల్లన్నపై పిటీ వారెంట్ జారీ చేసే యోచనలో ఉన్నామన్నారు. ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడినా, బ్లాక్ మెయిల్ చేసినా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీపీ రామారావు సూచించారు. ఈ సమావేశంలో బోధన్ రూరల్ సీఐ రవీంద్ర నాయక్, ఎస్సై ఎల్లా గౌడ్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed