హరితహారం నిధుల గోల్‌మాల్.. రికార్డుల సర్దుబాటులో యంత్రాంగం..?

by  |
haritha-haram-2
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : నిధుల గోల్‌మాల్ వ్యవ‌హారంలో రికార్డుల‌ను అధికారులు స‌ర్దుబాటు చేసేందుకు యత్నిస్తున్నట్లు విశ్వస‌నీయ సమాచారం. మ‌హ‌బూబాబాద్ రేంజ్ ప‌రిధిలోని హ‌రిత‌హారం కార్యక్రమ అమ‌లుకు ప్రభుత్వం నుంచి విడుద‌లైన నిధుల్లో ఎఫ్ఆర్వో త‌న వాటాగా 15 శాతం మొత్తాన్ని క‌ట్ చేసుకుని మిగ‌తా మొత్తాన్ని ఆయా సెక్షన్ అధికారుల ఖాతాల్లోకి జ‌మ చేశారు. దీనికి సంబంధించి ప్రాథ‌మిక ఆధారంతో సహా ‘దిశ’ క‌థ‌నాన్ని ఇటీవ‌ల ప్రచురించింది. ఈ విషయం అట‌వీశాఖ‌లో తీవ్ర చ‌ర్చనీయాంశ‌మైంది. అక్రమాల‌కు పాల్పడిన అధికారినిపై చ‌ర్యలు తీసుకోవాల్సిన అధికారులు విచార‌ణ చేయ‌కుండా మీన‌మేషాలు లెక్కిస్తున్నట్లు జ‌రుగుతున్న పరిణామాల ద్వారా స్పష్టమ‌వుతోంది. ముందుగా రికార్డుల‌ను స‌ర్దుబాటు చేసుకునే ప్రయ‌త్నం జ‌రుగుతున్నట్లు విశ్వస‌నీయంగా తెలిసింది.15శాతం ఎందుకు ఆపాల్సి వ‌చ్చింద‌నే అబద్ధపు స‌మాధానాన్ని క‌నుగొనేందుకు య‌త్నిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు సెక్షన్ అధికారుల‌తో పాటు మ‌హ‌బూబాబాద్ ఫారెస్ట్ కార్యాల‌య సిబ్బందితో ఎఫ్ఆర్వో రాజీ కుదుర్చుకునే చ‌ర్యలు ప్రారంభించిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు అధికారులను స‌ముదాయించేందుకు జూనియ‌ర్ ఫారెస్ట్ అసోసియేష‌న్ నేత‌లు రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది.

అవినీతి అధికారికి అండ‌దండ‌లు..?

సాధార‌ణంగా అవినీతి ఆరోప‌ణ‌లు రాగానే ఏ శాఖ‌లోనైనా క‌నీస విచార‌ణను ప్రారంభిస్తారు. అయితే, ఎఫ్ఆర్వో చేసిన నిధుల గోల్ మాల్‌పై ప్రాథ‌మిక ఎవిడెన్స్ మీడియాలో ప్రచురిత‌మైనా ఎందుకనో ఉన్నతాధికారులు ఇప్పటివ‌ర‌కు క‌ద‌ల‌క‌పోవ‌డంపై ప‌లు అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఫారెస్టు అధికారిణిని కాపాడే ప్రయ‌త్నం జ‌రుగుతున్నట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అట‌వీశాఖ‌లో జ‌రుగుతున్న అవినీతి, అక్రమాల‌ను అధికారులు విచార‌ణ జ‌రిపి బ‌య‌ట పెట్టాల‌ని వివిధ సంఘాలు, రాజ‌కీయ పార్టీల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. బుధ‌వారం గూడూరులో సీపీఐ కార్యద‌ర్శి విజ‌య్‌సార‌థి సైతం ఇదేవిధంగా స్పందించారు.

విచార‌ణ జ‌ర‌పుతాం : పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్‌

ఇదిలా ఉండ‌గా విజిలెన్స్ పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్‌ను దిశ‌ వివ‌ర‌ణ కోర‌గా.. దిశ‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని ప‌రిశీలించిన‌ట్లు తెలిపారు. ఖ‌చ్చితంగా విచార‌ణ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. శాఖ‌ప‌రంగా, మిగ‌తా ఉద్యోగుల‌ను విచారిస్తామ‌ని చెప్పారు. విచార‌ణ పూర్తి కావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.


Next Story