అక్కడ చెరువు జాడే లేదు.. కబ్జా కోరల్లో కనుమరుగు

by  |
అక్కడ చెరువు జాడే లేదు.. కబ్జా కోరల్లో కనుమరుగు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఒకప్పుడు గోలుసు కట్టు చెరువులతో పంట పోలాలు పచ్చగా కనిపించేవి. నేడు రియల్ వ్యాపారులు, కబ్జారాయుళ్లతో చెరువులు కనుమరుగై నీరు నిలిచే పరిస్థితి లేకుండా చేశారంటూ స్థానికులు మండి పడుతున్నారు. కబ్జాలకు పాల్పడ్డ వారిపై ఇరిగేషన్ అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలి. అలాంటి పనులపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత స్వార్థం కోసం అలవాటు పడి ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జిల్లా పరిధిలో చిన్నా పెద్ద కలిపి మొత్తం 2033 చెరువులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. ఎగువ వరదనీటి కాలువలు, శిఖం భూములు చాలా వరకు కబ్జాకు గురికావడంతో నీరు వెళ్లే మార్గం లేక దిగువనున్న పంట పోలాలు, నివాసాలు మునిగిపోతున్నాయి. తాజాగా కడ్తాల్ మండలం దేవునిపడకల్ గ్రామంలోని మమత్ఖాన్ చెరువుకు గండిపడింది. వరదకు ఇసుక మేటలు వేయడంతో దిగువన ఉన్న 25 ఎకరాల వరిపోలం దెబ్బతింది. రూ.10లక్షల విలువ చేసే చేపలను మత్స్యకారులు నష్టపోవాల్సి వచ్చింది.

ఇదీ జిల్లాలోని చెరువుల పరిస్థితి..

రంగారెడ్డి జిల్లాలోని అనేక చెరువులు కబ్జాలకు గురైతున్న ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మండలంలోని రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారుల సమన్వయ లోపంతోనే రియల్ వ్యాపారులు ఇష్టానుసారంగా వెంచర్లు చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు చేతివాటలకు అలవాటు పడి నో అబ్జెక్షన్ (ఎన్వోసీ) సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు. సరూర్ నగర్ మండలం మీర్పేట్ పరిధిలోని 71 ఎకరాల్లో ఉండాల్సిన పెద్ద చెరువు 65 ఎకరాలకే పరిమితం చేశారు. మిగిలిన చెరువు విస్తీర్ణం ఏమైపోయిందనే విషయాన్ని దాచిపెట్టి ఇరిగేషన్ అధికారులు ఉన్న విస్తీర్ణంతోనే ఎఫ్టీఎల్ పరిధిని ఏర్పాటు చేసి కట్టలు నిర్మిస్తున్నారు.

పెద్దచెరువు కింద 67 ఎకరాల్లో విస్తరించి ఉండాల్సిన మంత్రాల చెరువు 57 ఎకరాలే ఉంది. ఈ చెరువు కింద 33 ఎకరాల్లో ఉండాల్సిన సందేచందన చెరువు 26 ఎకరాలే మిగిలి ఉండటం విశేషం. బాలాపూర్లోని ఎర్రకుంట చెరువులో ఇప్పటికే 32 ఎకరాలకుపైగా అన్యాక్రాంతమైంది. గుర్రం చెరువు, కుల్లోనికుంట చెరువులు పూర్తిగా కబ్జాకు గురైనట్లు స్ధానికులు వివరిస్తున్నారు. వెంకటాపూర్లోని కుంటమోని కుంట, బురాన్ఖాన్ చెరువు, తాళ్ల చెరువుల పక్కన పెద్ద పెద్ద వెంచర్లు చేసి భూకబ్జాలు చేశారు. కబ్జాలకు గురైన చెరువులను పట్టించుకునే నాథుడే కరువైయ్యారు. ఈ విధంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం, అమన్గల్లు, షాద్నగర్, కేశంపేట్, రాజేంద్రనగర్, గండిపేట్, చేవెళ్ల, శంకర్పల్లి మండలాల పరిధిలోని చెరువులన్ని అన్యాక్రాంతమై, కబ్జాలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు కబ్జాల బాగోతం బహిర్గతమైతుంది. చెరువు విస్తీర్ణం తగ్గిపోవడంతో నీటి నిల్వ తగ్గి పరిసరాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లు, వెంచర్ల లో నీళ్లు నిలిచిపోయాయి.

చెరువుల వివరాలు ఇలా..

విస్తీర్ణంలోని చెరువులు సంఖ్య ఆయకట్టు(ఎకరాల్లో)
100 ఎకరాలకు పైగా ఉన్నవి 139 27,937
100 ఎకరాల లోపు ఉన్నవి 1,894 40,967

రాజేంద్రనగర్ నియోజక వర్గంలోని గగనపహాడ్ సమీపంలోని అప్పాచెరువు తెగి రహదారి పైకి ప్రవహిస్తున్న నీరు. ఎగువ దిగువన ఉన్న వరద కాలువలు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. చెరువులోకి చేరిన నీరు బయటికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఇటీవల కర్నూలు జాతీయ రహదారిపై పొంగి ప్రవహించింది. గత ఏడాది ఇదే చెరువు కట్ట తెగి వరదలకు 8 మంది చనిపోయారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి.



Next Story

Most Viewed