డెవలప్‌మెంట్ పేరుతో చెరువుల కబ్జా..

by  |
డెవలప్‌మెంట్ పేరుతో చెరువుల కబ్జా..
X

దిశ, వరంగల్ సిటీ: కాకతీయుల పాలనా వైభవానికి, వ్యవసాయ ప్రాధాన్యతకు ప్రతి రూపాలు చెరువులు. అలాంటి చెరువులు ప్రస్తుతం అస్థిత్వాన్ని కోల్పోతూ.. కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా 1,040కి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. జిల్లా కేంద్రం, జీడబ్ల్యూఎంసీ పరిధిలోనే 267కు పైగా చెరువులు, కుంటలు ఉండగా.. జనాభా పెరుగుదలతో నివాస స్థలాల కొరత ఏర్పడుతోంది. దీంతో ఆ భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వీరికి అధికారుల సపోర్ట్ కూడా ఉందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

ఎఫ్టీఎల్ ఊసే లేదు..

చెరువుల సరిహద్దులు, ఫుల్ ట్యాంకు లెవల్ (ఎఫ్టీఎల్) గుర్తించి హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో కబ్జాదారులకు మార్గం సుగమం అవుతోంది. అలాగే 30 ఫీట్ల బఫర్ జోన్లను ఏ చెరువు పరిధిలో ఉండకపోవడంతో వాటి మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. నగరంలోని కొన్ని చెరువుల పరిధిలో అధికారులు ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేసినప్పటికీ కొందరు వాటిని తొలగించి మరీ దర్జాగా కబ్జాకు తెగబడుతున్నారు. అంతేకాకుండా అధికారులు చెరువు కట్టలను పోసిన ప్రతిసారి ఆ కట్టలను ఆనుకుని ఉన్న చెరువు శిఖం భూముల్లో కబ్జాదారులు రాళ్లు పాతుతూ.. అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు. చెరువుల ఫీడర్ ఛానల్లను సైతం కబ్జా చేస్తుండడంతో చెరువుల్లోకి నీరు చేరడం కష్టసాధ్యంగా మారుతోంది.

బంధం చెరువు భూ ‘రాబంధుల’ పాలు..

కాజీపేటలోని బంధం చెరువు భూ రాబంధుల పాలైంది. బంధం చెరువు సర్వే నంబర్ 32లో 57.13 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే చెరువు సరిహద్దులను గుర్తించకపోవడం, ఎఫ్టీఎల్ ఏర్పాటు చేయకపోవడంతో కబ్జాదారులు ఆక్రమణలకు తెరలేపారు. నకిలీ పాసు పుస్తకాలతో చెరువు స్థలాలను ఆక్రమించినట్లు సమాచారం. అంతేకాకుండా పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో పంపకాలు జరపగా.. అందులోనూ అవినీతి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనర్హులకు సైతం ఇళ్ల స్థలాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. అయితే నకిలీ పాసు పుస్తకాలతో చెరువు స్థలాలను కబ్జా చేసిన కేసులో నాటి ఎమ్మార్వో నాగయ్యపై కేసు నమోదు కావడంతో పాటు జైలు పాలయ్యారు. బంధం చెరువు విస్తీర్ణంలో దాదాపు 25 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. చెరువు శిఖం, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నారని ఎవరైనా వ్యక్తులు అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, బల్దియా అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు. ఎన్‌ఓసీ కూడా మంజూరు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కబ్జాదారుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తూ వారికి కొమ్ముకాస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఆధునీకరణతో ఆనవాళ్లు మాయం..

నగరం నడిబొడ్డున ఉన్న భద్రకాళీ చెరువు, సంతోషిమాత, ఎన్టీఆర్ నగర్, సాయి నగర్, పోతన నగర్, కాపువాడల నుంచి కబ్జాలకు గురవుతుండగా నేడు బండ్ ఏర్పాటు పనులతో ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే అవకాశాలు గల్లంతయ్యాయి. మామూలుగా అయితే చెరువు చుట్టూ ఉన్న చివరలను కలుపుతూ కర కట్టలను నిర్మిస్తారు. అయితే భద్రకాళీ బండ్ విషయంలో అధికారులు ఆ విధంగా వ్యవహరించలేదు. చెరువు సరిహద్దులు, ఎఫ్టీఎల్ హద్దుల్లో బండ్ నిర్మించకుండా చెరువు భూమిని చాలావరకు వదిలి నిర్మిస్తున్నారు. ఇక హన్మకొండలోని సిద్ధేశ్వరగుండం సైతం ఆధునీకరణ కారణంగా కుంచించుకుపోయింది. నగరంలోని వినాయక విగ్రహాలు, బతుకమ్మలను ఈ గుండంలోనే నిమజ్జనం చేస్తారు. అయితే నేడు అక్కడ నిర్మాణాలే తప్ప నీరు లేదు.

పేరుకే కమిటీ ..

2018 ఏప్రిల్ 9న వరంగల్ పట్టణ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం దాదాపు 20 మందితో కమిటీని వేశారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్, సభ్యులుగా కుడా వైస్ చైర్మన్, నగర పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులతో పాటు పర్యావరణ, చెరువుల సంరక్షణకు పాటు పడుతున్న సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ కమిటీ ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే సమావేశమయ్యింది. అది కూడా రెండేళ్ల కింద ఉన్న జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గౌతమ్ నేతృత్వంలో జరిగింది. ఆయన బదిలీ అయిన నాటి నుంచి నేటి వరకు ఈ కమిటీ సమావేశమైన సందర్భమే లేదు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లే..

బల్దియా పరిధిలోని 14, 15 డివిజన్లలో చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న వారితో ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కవుతున్నారు.
-పెరుమాళ్ల లక్ష్మణ్, తెలంగాణ భూములు, చెరువులు, పర్యావరణ పరిరక్షణ మండలి అధ్యక్షుడు

సోమిడి చెరువు భూమిలో ప్లాట్లు..

కాజీపేటలోని సోమిడి చెరువును కబ్జా చేసి 10 ఎకరాల మేర ప్లాట్లు చేశారు. భద్రకాళి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. కరీమాబాద్ లోని శాకరాసికుంట మాయమైపోయింది. నగరంలోని పలు చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. చెరువుల పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలి.
-పుల్లూరు సుధాకర్, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు

Next Story