ఈఎస్ఐ బోధనాసుపత్రిలో కరోనా వార్డులు వద్దు

by  |
ఈఎస్ఐ బోధనాసుపత్రిలో కరోనా వార్డులు వద్దు
X

దిశ, న్యూస్‌బ్యూరో: సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రిలో కరోనా వార్డులను ఏర్పాటు చేయాలనుకునే ప్రయత్నాన్ని విరమించుకోవాలని ప్రభుత్వానికి నర్సుల సంఘం విజ్ఞప్తి చేసింది. నగరంలో కరోనా పేషెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో పేషెంట్ల కోసం కొన్ని వార్డులను కరోనా కోసమే ప్రత్యేకం చేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే దీనివల్ల వైరస్ ఇన్‌ఫెక్షన్ మామూలు వార్డులకు కూడా సోకే ప్రమాదం ఉందని సంఘం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆలోచనకు బదులుగా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని కరోనా కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దవచ్చునని సూచించారు.

ఈఎస్ఐ బోధనాసుపత్రికి ప్రతీరోజు సుమారు రెండు వేల మంది ఔట్ పేషెంట్లు వస్తూ ఉంటారని, ఇన్‌పేషెంట్ బెడ్‌లన్నీ ఎప్పుడూ పూర్తిస్థాయిలో నిండిపోయే ఉంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో కరోనా పేషెంట్ల కోసం కొన్ని వార్డులను పెట్టినట్లయితే వైరస్ ఇన్‌ఫెక్షన్ ఇతర వార్డుల్లోని పేషెంట్లకు కూడా అంటుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో తక్కువ సంఖ్యలో పేషెంట్లు ఉంటారు కాబట్టి దాన్ని కేవలం కరోనా కోసమే వినియోగించడం ద్వారా అక్కడి పేషెంట్లను మరో చోటికి తరలించడం కష్టమేమీ కాదని సూచించారు.



Next Story

Most Viewed