రేవంత్ పర్యటనకు నో పర్మిషన్!

by  |
రేవంత్ పర్యటనకు నో పర్మిషన్!
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో రైతుల పక్షాన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి తలపెట్టనున్న పర్యటనకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది.కాంగ్రెస్ నేతల పర్యటనకు పర్మిషన్ ఇచ్చేది లేదని నిర్మల్ పోలీసులు తేల్చిచెప్పారు.అంతేకాకుండా ముందస్తు నోటీసులు కూడా జారీచేశారు.జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. రెండు నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాలేదని, అక్రమాలకు అడ్డాగా మారిందన్నారు.ఇందులో అధికారులతో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రమేయం ఉందంటూ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆరోపించారు.ఈ క్రమంలోనే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, అవినీతికి తావులేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బదులిచ్చారు. తాజాగా కాంగ్రెస్ మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని జిల్లాకు తీసుకువచ్చి ధాన్యం కొనుగోలు అక్రమాలపై ఆందోళన చేపడుతామని మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు.కాగా, బుధవారం ఆయన పర్యటన ఖరారైంది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటనకు అనుమతి లేదని నిర్మల్ జిల్లా పోలీసులు స్పష్టంచేశారు.దానికి సంబంధించి మంగళవారం సాయంత్రం పట్టణ సీఐ జాన్ దివాకర్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి లేదని..అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.దీనికి ప్రతిస్పందనగా రేవంత్ రెడ్డి పర్యటన జరిపి తీరుతామని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్ని పర్యటనలు చేసినా పట్టించుకోని పోలీసులు రేవంత్ రెడ్డి పర్యటనను ఎలా అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు.

Next Story

Most Viewed