కరోనా క్రమశిక్షణ కొందరికే!

by  |
కరోనా క్రమశిక్షణ కొందరికే!
X

దిశ, హైదరాబాద్:
ప్రపంచవ్యాప్తంగా కరోనా జపమే నడుస్తోంది. పేరుగాంచిన దేశాలు సైతం అల్లకల్లోలం అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌ల పిలుపు మేరకు ఆదివారం నిర్వహించిన జనతాకర్ఫ్యూతో మన ప్రజలకు కరోనా తీవ్రత పెద్దగా అర్థమైనట్టు లేదు. జనతా కర్ఫ్యూకు కొనసాగింపుగా మరో వారం రోజలు హోం క్వారంటైన్ కావాలని చెప్పినా ప్రజలు పెద్దగా విన్పించుకున్నట్టు లేదు. ఫలితంగా సాధారణ పరిస్థితుల మాదిరిగానే సోమవారం కూడా గుంపులు గుంపులుగా గుమిగూడడం, వాహనాలు రోడ్లపైకి పెద్ద సంఖ్యలోనే వచ్చాయి. ప్రభుత్వం నిత్యావసర వస్తువుల సరుకులకు మాత్రమే రావాలని చెప్పినా ప్రజలు మాత్రం ఇతర పనుల కోసం కూడా అధిక సంఖ్యలో వచ్చారు.

అప్రమత్తతకు ఆమడదూరంలో..

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం మీటరు మేర సామాజిక దూరాన్ని పాటించాలని, గంటకోసారి చేతులు సబ్బుతో కడుక్కోవాలని, శానిటైజర్ రాసుకోవాలని, మాస్కులు లేదా జేబు రుమాలు అడ్డుగా ధరించాలని, దగ్గినప్పుడు- తుమ్మినప్పుడు చేతిని అడ్డుగా ఉంచాలననే జాగ్రత్తలను ప్రభుత్వం, అధికారులు, వైద్యులు చెబుతూనే ఉన్నారు. అయినా, నిత్యావసర వస్తువుల సరుకుల నిమిత్తం కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ దగ్గర, మెడికల్ దుకాణాలు, పెట్రోల్ బంకు వద్ద ప్రజలు పదుల సంఖ్యలో గుమిగూడుతున్నారు. ఈ సమయంలో కొందరు నోటికి మాస్కు ధరించాలనే కనీస జాగ్రత్తలను కూడా పాటించడం లేదు. ఈ సంస్థల నిర్వాకులు సైతం కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించడం లేదు. రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో చాలావరకూ డబుల్, త్రిబుల్ రైడింగ్ చేస్తున్నారు. ఆటోలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దూర ప్రయాణాలు చేసేవారు ఇంకా కొందరు రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రైళ్ళు, బస్సులు లేనందున తుఫాన్ లాంటి వాహనం ఏదైనా దొరక్క పోదా.. అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

కొందరే క్రమశిక్షణగా..

కరోనా ప్రభావంతో కొందరు మాత్రమే జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రభుత్వం స్వీయ నిర్బంధం మరో రోజులు పొడిగించినా… ఉదయం 5 గంటల నుంచి పాలు, కూరగాయల మార్కెట్లు, కిరాణ దుకాణాలు, పెట్రోల్ బంకులు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. రోడ్లపైకి వచ్చేవారిలో సగానికిపైగా ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారు. కొందరు మాత్రమే ప్రభుత్వం చెప్పినట్టుగా బైక్‌పై ఒక్కరు మాత్రమే వెళ్ళడం, నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడిన చోట మాస్కులు ధరించడం, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే సమయంలో క్రమశిక్షణతో క్యూ పద్ధతిని పాటిస్తున్నారు. అయితే, అత్యధికంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారంటూ ప్రజలు కనీసం జాగ్రత్తలు పాటించడం లేదంటూ మీడియా ప్రచారం చేయడంతో పోలీసులు అప్రమత్తమై రోడ్లపైకి వచ్చారు. అనంతరం ఎక్కడికక్కడ టూ వీలర్లు, ఫోర్ వీలర్లను పోలీసులు ఎక్కడికక్కడ చెక్ చేయడం ప్రారంభించారు.

Tags: Coronavirus, hyderabad city, police checking, coronavirus in hyderabad, janata curfew

Next Story

Most Viewed