బతుకులు మారుతాయనుకుంటే.. బాధలే మిగిలాయి!

by  |
బతుకులు మారుతాయనుకుంటే.. బాధలే మిగిలాయి!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బతుకులు మారుతాయని మురిసిన నర్సులకు బాధలే మిగిలాయి.. వ్యథలు తీరుస్తుందనుకున్న సర్కార్​ పుట్టెడు దు:ఖాన్నే మిగిల్చింది.. కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ సాకుతో రెగ్యులర్ అనే పదాన్నే మరిచిన ప్రభుత్వం నర్సులకు తీవ్ర అన్యాయం చేస్తోంది.. సర్కార్​ పెద్దల నిర్లక్ష్యంతో సేవ చేయాల్సిన చేతులు చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితి నెలకొంది.. స్వరాష్ర్టంలో ఫలాలు అందుతాయనుకున్నా, రిక్రూట్​మెంట్​ లేక తీవ్ర శోకమే మిగులుతోంది. మొత్తంగా సర్కార్​ నిర్లక్ష్యం నర్సింగ్​ వ్యవస్థకే శాపంగా మారింది.

ఆరున్నరేళ్లయినా ఒక్క నర్సు పోస్టు కూడా భర్తీ కాలేదు. పరీక్షలు జరిగి ఫలితాలు వెల్లడై మూడేళ్లవుతున్నా ఇప్పటికీ రిక్రూట్‌మెంట్ మొదలు కాలేదు. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తామన్న ప్రకటనలేగానీ ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. గడచిన ఆరున్నరేళ్లలో ఒక్క కొత్త నర్సింగ్ కళాశాలకు కూడా అనుమతి మంజూరు కాలేదు. మంత్రుల, సన్నిహితులకు చెందిన కాలేజీలకు హడావిడిగా అనుమతి ఇచ్చినా అన్ని అర్హతలూ ఉన్న కాలేజీల దరఖాస్తులు మాత్రం ఆఫీసు టేబుళ్లకే పరిమితమయ్యాయి. కరోనా కాలంలో నర్సుల ప్రాధాన్యత ఏంటో ప్రభుత్వానికి తెలిసొచ్చినా, వారి సేవలకు పొగడ్తలే తప్ప కడుపు నింపే మార్గం లేకుండాపోయింది.

అవసరాలిలా..

తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్‌ల సంఖ్య పెరిగినా, డాక్టర్లు, నర్సుల, పారామెడికల్ సిబ్బంది మాత్రం పెరగలేదు. నర్సుల కొరత పీడిస్తూనే ఉంది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పేరుతో అడపాదడపా రిక్రూట్ చేసుకుంటున్నా రెగ్యులర్ పోస్టింగుల విషయంలో అడుగు ముందుకు పడడంలేదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వాస్పత్రుల్లో జనరల్ వార్డుల్లో ప్రతీ ఏడు బెడ్‌లకు ఒక నర్సు, ఐసీయూ/ఎమర్జెన్సీ వార్డుల్లో ప్రతీ బెడ్‌కు ఒకరు ఉండాలి. ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడా సరిపోయేంత నర్సులు లేకున్నా వైద్యారోగ్య శాఖకు రిక్రూట్‌మెంట్‌పై శ్రద్ధ లేదు. రెగ్యులర్ విధానంలో 3,311 నర్సు పోస్టులను భర్తీ చేయడానికి 2017లో నోటిఫికేషన్ ఇచ్చినా, హైకోర్టు ఆదేశించినా రకరకాల కారణాలతో జాబితా కూర్పు, నియామక ప్రక్రియ సాగుతూనే ఉంది.

ప్రైవేటు ఆస్పత్రులు పెరిగినా నర్సింగ్ కాలేజీలు పెరగలేదు

ఏటా కొత్త మెడికల్ కళాశాలలు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యంలో పుట్టుకొస్తున్నాయి. గ్రాడ్యుయేషన్, పీజీ సీట్లు కూడా పెరుగుతున్నాయి. కోర్సు పూర్తిచేసుకుని సొంతంగా ప్రాక్టీసు పెట్టుకుంటున్నారు. ఇక క్లినిక్‌లు, ప్రైవేటు దవాఖానలు కూడా వెలుస్తూనే ఉన్నాయి. అవసరాలకు అనుగుణంగా నర్సింగ్ స్కూళ్లు, కళాశాలలు మాత్రం పెరగడం లేదు. దరఖాస్తు చేసుకున్నవారికి నిబంధనల ప్రకారం కొత్త నర్సింగ్ కళాశాలలకు అనుమతి ఇవ్వొచ్చంటూ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు సూచించింది. ఆ ప్రకారం తమిళనాడు, కేరళ, కర్నాటక, పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో కొత్తవి మంజూరయ్యాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు మూడు తప్ప ఏవీ అనుమతికి నోచుకోలేదు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిరిసిల్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక నర్సింగ్ కళాశాల ఏర్పడింది. ప్రైవేటు రంగంలో రెండు ఏర్పడ్డాయి. సుమారు ముప్పైకి పైగా ప్రైవేటు సంస్థలు నర్సింగ్ కళాశాలల కోసం దరఖాస్తు చేసుకోగా, కొన్నింటిలో హై పవర్డ్ కమిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాయి. అర్హతలూ ఉన్నట్లు కమిటీ నివేదికలు ప్రభుత్వానికి సమర్పించాయి. నిబంధనలు, సిఫారసుల ప్రకారం వాటికి వైద్యారోగ్య శాఖ అనుమతులు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటికీ మోక్షం లేదు. కారణాలేవీ చెప్పకుండానే అనుమతి మంజూరు చేయలేదు.

మరోవైపు వైద్యారోగ్య శాఖ నర్సుల కొరత ఉందంటూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేసుకుంటోంది. కరోనా సమయంలో నర్సుల కొరత తెలిసొచ్చినా నర్సింగ్ గ్రాడ్యుయేట్లను తీర్చిదిద్దాలన్న ముందుచూపు కొరవడింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆరు నర్సింగ్ స్కూళ్లు (జీఎన్ఎం కోర్సులు), ఆరు నర్సింగ్ కళాశాలలు (బీఎస్సీ నర్సింగ్) ఉన్నాయి. వీటి ద్వారా ఏటా సగటున 600 మంది కొత్తగా నర్సు కోర్సు పూర్తిచేసుకుని అర్హత సాధిస్తున్నారు. ఇక ప్రైవేటు రంగంలో సుమారు 70 నర్సింగ్ స్కూళ్లు, 140 వరకు నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు పది వేల మంది క్వాలిఫై అవుతున్నారు. ఇందులో సగటున 60 శాతం మంది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందినవారే.

సన్నిహితులకు క్షణాల్లో..

మంత్రులు, పార్టీకి సన్నిహితంగా ఉండే వ్యక్తులకు మాత్రం రోజుల వ్యవధిలోనే నర్సింగ్ కళాశాలలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం అన్ని దరఖాస్తుల విషయంలో అలాంటి చొరవను చూపడం లేదు. తనిఖీల్లో అన్ని అర్హతలు ఉన్నట్లు తేలినా అనుమతి ఇవ్వడంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. అటు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా నర్సింగ్ స్కూళ్లు, కాలేజీలు రాకపోవడం, ప్రైవేటు రంగంలో అనుమతులు ఇవ్వకపోవడంతో గాడిన పడాల్సిన ప్రజారోగ్య వ్యవస్థ మరింత సంక్షోభంలోకి కూరుకుపోతూనే ఉంది.

స్టైఫండ్ భారం లేకుండా సర్దుబాటు చేయొచ్చు..

పదమూడు జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లో 300కు పైగా ప్రైవేటు నర్సింగ్ స్కూళ్లు ఉంటే తెలంగాణలో పది జిల్లాల్లో (ఉమ్మడి) కేవలం 140 వరకు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వానికి ఫీజు రీయింబర్స్​మెంట్​, స్టైఫండ్ లాంటి ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే వాటిని యాజమాన్యం ద్వారా తామే భరించుకుంటామని కొన్ని ప్రైవేటు నర్సింగ్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరాయి. ఒక్కో విద్యార్థిపై సగటున ప్రభుత్వం ఏటా రూ. 32 వేల చొప్పున స్టైఫండ్ రూపంలో ఖర్చు చేస్తున్నట్లు అంచనా. దీన్ని ప్రభుత్వానికి భారంగా మారకుండా చూసుకుంటామంటూ ప్రైవేటు దరఖాస్తుదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఒక నర్సింగ్ కళాశాలలో 30 శాతం సీట్లు మాత్రమే ప్రభుత్వ కోటా కింద భర్తీ అవుతుంటాయి. మిగిలినవన్నీ యాజమాన్య కోటాయే కాబట్టి ప్రభుత్వానికి భారం లేకుండా చూసుకుంటామన్న హామీ వచ్చినా సర్కార్​ మాత్రం తేల్చకుండా నాన్చుతూనే ఉంది.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ లెక్కలే..

ఏటా వేలాది మంది నర్సింగ్ కోర్సు పూర్తిచేసినవారు పుట్టుకొస్తున్నా రాష్ట్రంలో రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కొన్ని సందర్భాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు, కొద్దిమంది దుబాయ్ లాంటి దేశాలకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కనీస జీతాలకు పని చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం చేరితే ఎప్పటికైనా రెగ్యులరైజ్ అవుతుందన్న నమ్మకంతో పనిచేస్తున్నా వారి ఆశలు అడియాశలుగానే మిగులుతున్నాయి. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ అయినవారికి నెలల తరబడి జీతాల్లేక రోడ్లమీద ధర్నాలు చేయడం సాధారణ విషయమైంది.

నర్సుల మీద పెరుగుతున్న పని ఒత్తిడి

బెడ్‌లు, పేషెంట్లు, జనాభాకు తగినంత సంఖ్యలో నర్సులు లేకపోవడంతో తీవ్రమైన కొరత ఏర్పడింది. అనేక రాష్ట్రాల్లో ఇది కొనసాగుతోంది. కరోనా సమయంలో నర్సులపైన పడిన పని ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉందో తెలిసింది. అయినా తెలంగాణ ప్రభుత్వం నర్సులను తయారుచేసే స్కూళ్లు, కళాశాలలకు అనుమతి ఇవ్వకపోగా రెగ్యులర్ పోస్టుల్లో నియమించుకోవడంపై కూడా మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు ప్రభుత్వం ఎన్నికల సమయంలో రకరకాల హామీలు ఇచ్చి ఆరోగ్య పథకాలను కొత్తగా అమల్లోకి తెస్తున్నాయి. ఇవి కూడా నర్సులకు భారంగా మారాయి. తగిన సంఖ్యలో నర్సులుంటే ఒత్తిడి సర్దుబాటయ్యేది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సమయంలో తెలంగాణకంటే ఎక్కువ వేతనంతో నర్సుల రిక్రూట్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే.

మార్చుకునే వీలు విషయమై..

మరోవైపు డిమాండ్ ఎక్కువగా ఉన్న చోటికి నర్సింగ్ స్కూలు లేదా కాలేజీ మొత్తాన్ని తరలించుకునే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఒకప్పుడు నర్సింగ్ స్కూలు లేదా కళాశాల పెట్టినప్పుడు ఉన్న డిమాండ్‌తో పోలిస్తే ఇప్పుడు మరో చోట ఎక్కువ అవసరం ఉందనుకుంటే పాత చోట నుంచి కొత్తచోటికి తరలించుకునే విధంగా కొన్ని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు భావిస్తున్నాయి. దీనిపై కూడా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించలేదని ప్రైవేటు యాజమాన్యాలు భావిస్తున్నాయి.

అంతటా అదే పరిస్థితి..

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పలు ప్రకటనలు చేసినా ఆచరణకు నోచుకోలేదు. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో సైతం రెగ్యులర్ పోస్టులకు బదులుగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు రిక్రూట్‌మెంట్‌లే నడుస్తున్నాయి. దేశంలో సుమారు ఇరవై లక్షల మంది నర్సుల కొరత ఉందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికతో పాటు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ సైతం నొక్కిచెప్పింది. అయినా ఈ దిశగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు శూన్యం. మాటలు చెప్పడం తప్ప సమస్యకు పరిష్కారం వెదకడంలో అన్ని ప్రభుత్వాలదీ ఒకటే విధానం. యూనివర్సిటీకు ఐఏఎస్ అధికారులు ఇన్​చార్జి వీసీలుగా ఉన్న తరహాలోనే ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలకు కూడా ఇన్​చార్జిల వ్యవస్థ తప్పడం లేదు.

Next Story