ఉద్యోగుల ఖాతాల్లో జమకాని జీపీఎఫ్

by  |
ఉద్యోగుల ఖాతాల్లో జమకాని జీపీఎఫ్
X

భవిష్యనిధి ఉద్యోగులకు ఓ భరోసా.. అత్యవసరాలు, ఆపద సమయంలో కొండంత అండగా నిలుస్తుంది. ఉద్యోగుల నెలనెలా జీతంలో కొంత సొమ్ము జీపీఎఫ్​ కట్ చేస్తుంటారు. జమైన సొమ్ములో అవసరాల కోసం 60శాతం విత్​డ్రా చేసుకునే అవకాశం కల్పించింది భవిష్యనిధి సంస్థ. మేడ్చల్ ​జిల్లాలో ఉపాధ్యాయుల జీపీఎఫ్​ ఖాతాలు గందరగోళంగా మారాయి. ఏళ్ల తరబడి డబ్బులు కట్ ​చేస్తున్నా జీపీఎఫ్​లో జమ కావడంలేదు. దీంతో అత్యవసర సమయాల్లో అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాల విభజన జరిగినా జీపీఎఫ్​ ఖాతాల విభజన జరగకపోవడం గమనార్హం..

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఉపాధ్యాయులు జీపీఎఫ్ ఖాతాల నుంచి అత్యవసరాల కోసం డబ్బులు డ్రా చేసుకుంటారు. ముఖ్యంగా గృహ నిర్మాణాలు, పిల్లల వివాహా లు, ఉన్నత చదువులు తదితర అవసరాల కోసం జీపీఎఫ్ ఖాతా నుంచి పాక్షిక ఉపసంహరణలు చేస్తుంటారు. అర్హులైన ఉపాధ్యాయులకు దరఖా స్తు చేసుకున్న వెంటనే జెడ్పీ అధికారులు పరిశీలించి, ఉపాధ్యాయుల ఖాతాల్లో జమైన నిధి నుంచి 60 శాతం మేరకు విత్ డ్రా చేసుకునే వీలు కల్పిస్తారు. కొందరి ఖాతాల్లో జీపీఎఫ్ సక్రమంగా జమ కావడంలేదని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.

జీపీఎఫ్ కష్టాలు..

మేడ్చల్ జిల్లా 15 రెవెన్యూ మండలాల్లో 503 ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలలలో దాదాపు 3వేలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పలు మండలాల్లోని ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సక్రమంగా అమలు కావడంలేదు. జిల్లాలోని కూకట్‌పల్లి మండలానికి చెందిన మెజార్టీ ఉపాధ్యాయులు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు ఓ ఉపాధ్యాయుడికి మూడేళ్లుగా జీపీఎఫ్ జమ కావడంలేదు. మరో ఉపాధ్యాయుడికి నాలుగేళ్లుగా జమ కావడంలేదు. ఒక ఉపాధ్యాయుడికి ఖాతా నుంచి ఎక్సెస్ పేమెంట్ అని ఆయనకు తెలియకుండానే రూ.21,048 తగ్గింపు చేశారు. ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా వ్యాప్తంగా జీపీఎఫ్ సక్రమంగా జమ కావడంలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లను ప్రస్తుతం సరిచేసినప్పటికీ ఆయా సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ కోల్పోతున్నారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ గందరగోళాన్ని జిల్లా పరిషత్ అధికారులు సరిచేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

అగమ్యగోచరం..

ఉపాధ్యాయుల భవిష్య నిధి వ్యవహారం మేడ్చల్ జిల్లాలో అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలో ఏళ్లతరబడి జీపీఎఫ్ పెండింగ్ లో ఉండడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉ పాధ్యాయుల జీపీఎఫ్ కు సంబంధించిన వ్యవహారాలను జిల్లా పరిషత్ పర్యవేక్షిస్తోంది. ప్రతి నెలా జీతాల్లో జీపీఎఫ్ కట్ చేస్తున్నా వారి ఖాతాల్లో జమ చేయడం లేదు. జీపీఎఫ్ గందరగోళ పరిస్థితిపై ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నాయి.

విభజనకు నోచుకోని ఖాతాలు..

సర్కారు పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లా లను ఏర్పాటు చేసింది. పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 32 జిల్లాలుగా విభజించింది. ఈ క్రమంలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మేడ్చల్ –మల్కాజిగిరి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కొత్త, పాత జిల్లాల ఉద్యోగుల విభజన, నిధులు, పాలన వ్యవహారాలు, ఇతర ఖాతాల విభజన జరిగింది. మేడ్చల్ జిల్లా పరిషత్ ఏర్పడి రెండేళ్లు కావొస్తోంది. అయితే, ఉపాధ్యాయుల జీపీఎఫ్ ఖాతాలను మాత్రం పాత జిల్లాల వారీ గానే ఇప్పటికీ కొనసాగిస్తుండడం గమనా ర్హం. నూతన జిల్లాల పాలక వర్గాలు ఏర్పడినప్పటికీ ఖాతాల విభజనను అధికార యంత్రాంగం ప ట్టించుకోకపోవడంతో ఉపాధ్యాయులు పరిస్థితి గందరగోళంగా తయారైంది. జీపీఎఫ్ సక్రమం గా జమ కాకపోవడంతో అత్యవసరాల కోసం టీచర్లు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం..

జీపీఎఫ్ ఖాతాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోంది. అత్యవసరాల కోసం జీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకునే వీలుంది. మేడ్చల్ జిల్లాలో జీపీఎఫ్ ఖాతాలను సక్రమం గా నిర్వహించక పోవడంతో ఉపాధ్యాయులు అవసరానికి డబ్బులు డ్రా చేయలేకపోతున్నారు. తక్షణమే జీపీఎఫ్ సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో ఉపాధ్యాయ లోకం ఆందోళనకు పూనుకుంటుంది. –వీ వెంకటేశ్వర్లు, ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు

శామీర్ పేట మండలంలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి తన కుమార్తె వివాహ ఖర్చుల కోసం కొంత డబ్బు అవసరమైంది. దీంతో ఆమె తన జీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లింది. ఆమె జీపీఎఫ్ ఖాతాలో నాలుగేళ్లుగా డబ్బులు జమ కాలేదని తెలిసింది. దీంతో ఏమి చేయాలో పాలుపోక తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకొని పెళ్లి ఖర్చుల కోసం వెచ్చించింది.

బాలానగర్ మండలంలో పనిచేస్తున్న ఓ టీచర్ పిల్లల చదువు కోసం జీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. ఖాతాలో డబ్బులు లేవు. తన జీతంలో నుంచి నెలనెలా జీపీఎఫ్ కట్ అవుతుంది. మరి ఆ సొమ్ము ఎక్కడికి వెళ్లిందని ఆరా తీయగా జీపీఎఫ్ లో సక్రమంగా జమ కావడంలేదని తెలిసింది.

Next Story

Most Viewed