‘సోషల్’ మోడీనే!

by  |
‘సోషల్’ మోడీనే!
X

దిశ, వెబ్‌డెస్క్: తనకంటూ ఒక ‘సోషల్’ సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అర్థంతరంగా దాన్ని వీడేందుకు యోచిస్తున్నట్టు చేసిన ప్రకటన సంచలనమైంది. ఒక్క ట్వీట్, ఒక్క పోస్టు వదిలితే.. క్షణాల్లో కోట్లాది మందికి చేరే వ్యవస్థను మోడీ నిర్మించుకున్నారు. తమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధాన స్రవంతి మీడియా కంటే సోషల్ మీడియానే సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అటువంటిది సోషల్ మీడియా అన్ని వేదికలకు స్వస్తి పలకాలనుకుంటున్నారని ఆయన.. ఫాలోవర్ల గుండెల్లో బాంబు పేల్చారు. దీంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అభిమానులు, ద్వేషాన్ని వదలండి.. ఖాతాను కంటిన్యూ చేయండని ప్రత్యర్థుల అభ్యర్థనలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ట్విట్టర్‌లోనైతే ట్రెండింగ్ కూడా అయింది. ఎట్టకేలకు మంగళవారం నాటి మోడీ ట్వీట్‌తో ఉపశమనం లభించింది.

ఈ ఆదివారం అన్ని సోషల్ మీడియా ఖాతాలకు స్వస్తి పలకాలని యోచిస్తున్నారని సోమవారం ప్రధాని మోడీ పోస్టు చేశారు. అది మొదలు ఇవ్వాళ్టి (మంగళవారం మధ్యాహ్నం) వరకు భారీగా అభ్యర్థనలు వచ్చాయి. కాగా, ఈ రోజు ప్రధాని పెట్టిన మరో పోస్టు వారందరికీ ఉపశమనాన్ని ఇచ్చింది. వచ్చే ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ మహిళలకు డెడికేట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచే మహిళల నిజజీవితాల కథలను పోస్టు చేసేందుకు తన అన్ని సోషల్ మీడియా ఖాతాల్లోకి వారికి ఆదివారం ఒక్కరోజు అనుమతిస్తున్నారని మంగళవారం ట్వీట్ చేశారు. షీ ఇన్‌స్పైర్ అజ్ అనే ట్యాగ్‌తో తమ నిజజీవితపు వీరోచిత గాథలను పోస్టు చేస్తే మరెందరికో స్ఫూర్తినిచ్చినట్టవుతుందని వివరించారు. అంటే కేవలం ఒక్క ఆదివారం తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలకు అంకితం చేస్తుండటంతో వాటికి తాను దూరంగా ఉండబోతున్నారన్న తన అభిప్రాయాన్ని ప్రధాని మోడీ చాలా ట్విస్టింగ్‌గా చెప్పారని నెటిజన్లు పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఎంతో మంది ఊపిరిపీల్చుకున్నట్టు పోస్టులు పెట్టారు. ఇంకొందరు ఫన్నీ మీమ్స్‌నూ పోస్టు చేశారు.

సామాజిక మాధ్యమాల ద్వారా మోడీ తన క్రేజ్‌కు ఢోకా లేకుండా కాపాడుకున్నారు. పెంచుకున్నారు కూడా. టెక్నాలజీని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో మోడీ దిట్ట. సోషల్ మీడియాలో ఆయనకు గణనీయంగా ఫాలోవర్లున్నారు. ట్విట్టర్‌లో 5.33 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.52కోట్లు, యూట్యూబ్‌లో 45.1లక్షలు, ఫేస్‌బుక్‌లో 4.47కోట్ల మంది ప్రధాని మోడీని అనుసరిస్తున్నారు. రెండోసారి అఖండ మెజార్టీతో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన ప్రధాని.. మీడియా సమావేశాలకు దూరంగానే ఉన్నారు. ఆ వెలితిని సోషల్ మీడియాతో ఓ మేరకు భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా నుంచి వైదొలుగుతారన్న ట్వీట్‌.. రాజకీయ నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలందిరిలోనూ కలకలం రేపింది.



Next Story

Most Viewed