చేతులు లేవు.. కానీ డ్రైవింగ్ లైసెన్స్!

by  |
చేతులు లేవు.. కానీ డ్రైవింగ్ లైసెన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్ : చేతులు లేకున్నా గొప్ప విజయాలు సాధించినవారు ఉన్నారు. కాళ్ల సాయంతో అన్ని పనులు చేసుకుంటూ జీవితాన్ని సాధారణంగా గడుపుతున్నవారు కూడా ఉన్నారు. కేరళలోని తోడుపురకు చెందిన జిల్‌మోల్ థామస్‌కు కూడా చేతులు లేవు. అయినా జుట్టు దువ్వుకోవడం, తినడం, టీ తాగడం లాంటి పనులను స్వయంగా తనే చేసుకుంటుంది. అంతేకాకుండా పెయింటింగ్ కూడా వేస్తుంది. జిల్‌మోల్ ఏడో తరగతిలో ఉన్నప్పుడు తరగతిలో అందరి కంటే ముందుగా కంప్యూటర్ ఆపరేట్ చేయడం కూడా నేర్చుకుంది. ఇప్పుడు తన పెయింటింగ్ ఇష్టాన్ని, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మిళితం చేసి కొచ్చిలోని ఒక పెయింటింగ్ కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్‌గా కూడా పని చేస్తోంది. అయితే చేతులు లేకున్నా ఆమె ఇన్ని సాధించినప్పటికీ ఆమెకు సంతృప్తి లేదు. గుర్తింపు కోసం ఎన్నడూ తాపత్రయ పడలేదు. కానీ ఆమెకు ఒక కల ఉంది. కారును తనంతట తాను సొంతంగా డ్రైవ్ చేయాలనేది ఆమె కల. అవును.. చేతులు లేవు.. కానీ కారు డ్రైవ్ చేస్తానంటుంది. కారుకు కొన్ని మాడిఫికేషన్‌లు చేసి, కష్టపడి డ్రైవింగ్ కూడా నేర్చుకుంది. మరి కల నెరవేరినట్లేనా?

లేదు. హస్తసాముద్రికాన్ని నమ్మి జీవితాలను సాగించే ఈ దేశంలో, చేతులు లేని వారికి భవిష్యత్తు లేదని కించపరిచే ఈ జనాల మధ్య సొంతంగా డ్రైవింగ్ చేయాలన్న జిల్‌మోల్ కలకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. మన రోడ్ల మీద డ్రైవ్ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. మామూలు వ్యక్తులకే.. డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే బ్రోకర్ సాయం తీసుకుని, అంతో ఇంతో ముట్టజెప్పితే గానీ రాని పరిస్థితి. అలాంటిది చేతులు లేకుండా కారును మాడిఫై చేసి డ్రైవ్ చేస్తున్న జిల్‌మోల్‌కు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారా? 2014లో లెర్నర్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకుంది, వంద కారణాలు చెప్పి హేళనగా మాట్లాడి పంపించారు. తర్వాత నాలుగేళ్లకు 2018లో స్కూల్ వేడుకలో మాట్లాడుతూ సొంతంగా డ్రైవింగ్ చేయడం తన కల అని, కానీ డ్రైవింగ్ లైసెన్స్ రాలేదని జిల్‌మోల్ చెప్పింది. ఆ వేడుకకు హాజరైన అడ్వకేట్ షైన్ వర్గీస్, జిల్‌మోల్‌కు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.

వర్గీస్‌తో పాటు జి హరిహరన్, సంజీవ్ అనే మరో ఇద్దరు అడ్వకేట్‌ల సాయంతో తన లెర్నర్ పర్మిట్‌కు అనుమతిస్తూ దరఖాస్తును అంగీకరించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేసింది. వాహనానికి కొన్ని మార్పులు చేసి, లైసెన్స్ ఇవ్వవొచ్చని కోర్టు తెలిపింది. అందుకు తగినట్లుగా తన కారును జిల్‌మోల్ మార్పించుకుని దరఖాస్తు చేసుకుంది. కానీ ఈసారి మరో వంక పెట్టారు. ఇలా మార్పులు చేసిన వాహనానికి రిజిస్ట్రేషన్ చెల్లదని, రిజిస్ట్రేషన్ లేని వాహనాలను డ్రైవ్ చేయవద్దని మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ మెలిక పెట్టింది. ఇలాంటి వాహనాలను రిజిస్టర్ చేయడం గురించి వాహన చట్టం లేదని, మరీ అంతగా కార్లలో తిరగాలనిపిస్తే డ్రైవర్‌ను పెట్టుకోవాలని హేళన చేశారు. కానీ జిల్‌మోల్ తగ్గలేదు. ఈసారి మాడిఫై చేసిన తన కారు రిజిస్ట్రేషన్ గురించి హైకోర్టును ఆశ్రయించింది. వాహనం పరిస్థితిని పరిశీలించి, డ్రైవ్ చేయడానికి అనువుగా ఉంటే మూడు వారాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జస్టిస్ వి రాజా విజయరాఘవన్ నవంబర్ 1న స్టేట్‌మెంట్ జారీ చేశారు. ఇప్పుడు జిల్‌మోల్ వాహనం రిజిస్ట్రేషన్ పూర్తయింది. త్వరలో లైసెన్స్ కూడా సంపాదించుకుని తనంతట తానుగా కారును డ్రైవ్ చేయబోతోంది. సంకల్పం ఉంటే విధిరాత మార్చుకోవచ్చని మరోసారి రుజువైంది.

Next Story

Most Viewed