నిజామాబాద్‌లో నో టేకింగ్.. ఓన్లీ డ్రాపింగ్

by  |
నిజామాబాద్‌లో నో టేకింగ్.. ఓన్లీ డ్రాపింగ్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: గతంలో ప్రతి ప్రభుత్వ శాఖ కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టెలు ( కంప్లైంట్ బాక్సెస్) ఉండేవి. ప్రజలు నేరుగా అధికారులను కలువకున్నా తమ సమస్యలు, ఫిర్యాదులు, సలహాలను రాసి ఆ పెట్టెల్లో వేసేవారు. అందులోని ప్రతి అర్జినీ ఆఫీసర్లు పరిశీలించి వాటికి పరిష్కారం చూపేవారు. కానీ, ఈ వ్యవస్థ ఆన్‌లైన్ సేవలు వచ్చిన తర్వాత మరుగున పడుతూ వచ్చాయి. అయితే ఇప్పటికీ ఆ వ్యవస్థ అమలు చేసే ఏకైక శాఖ రెవెన్యూ యంత్రాంగమే. ఇటీవల కాలంలో అక్కడ కుడా అర్జీలు బుట్టదాఖలు అవుతున్నాయి. కానీ, కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు మళ్లీ రెవెన్యూ శాఖలో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రజావాణి రద్దు..

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ విభాగంలో పనిచేసే అటెండర్ ఇటీవల కరోనాతో చనిపోవడం కలకలం రేపింది. కామారెడ్డి జిల్లాలో ఆర్డీవో, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తో పాటు జిల్లాలో 10 మంది వరకు కొవిడ్ వైరస్ బారిన పడ్డారు. దాంతో జిల్లా పాలనా అధికారులు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి‌ని రద్దు చేశారు. ఇప్పుడు ఇందూరు, కామారెడ్డి జిల్లాల్లో కలెక్టరేట్, అను బంధ రెవెన్యూ డివిజనల్, తహసీల్దార్ కార్యాలయాల్లోకి వెళ్లడం సాధ్యం కాదు. అంతటా కొ విడ్-19 ఫిర్యాదు పెట్టెలు పెట్టారు. ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు డబ్బాల్లోనే వేయాలి. ఆఫీసర్లను కలవడం అసలు కుదరదు. సంబంధిత పనులు ఆన్‌లైన్‌లో చేయించుకోవచ్చు.

700ల పైచిలుకు కేసులు..

జిల్లా పాలనా వ్యవహారంలో 58 రకాల సేవల విభాగంలో రెవెన్యూ అధికార యంత్రాంగం టాప్ ప్లేస్‌లో ఉంటుంది. అలాంటి శాఖను కరోనా మహమ్మారి భయపెడుతుండటంతో దాని ప్రభావం ప్రజలపైనా పడుతున్నది. ఉమ్మడి ఇందూరు జిల్లాలో 725 పాజిటివ్ కేసులు, 20 వరకు మరణాలు సంభవించడంతో ఆఫీసర్లు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అసలే రెవెన్యూ యంత్రాంగంపై అవినీతి ఆరోపణలు, మచ్చలు ఉండనే ఉన్నాయి. ఇక ఇప్పుడు వైరస్ కారణంగా అర్జీలు, ఫిర్యాదులను పెట్టేలో వేస్తే వాటికి పరిష్కారం ఎప్పుడు లభిస్తుందోనని, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లకు మోక్షం ఎప్పుడో అని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed