ఖజానా అడుగంటినా కరెంటుకు నిధులు

by  |
ఖజానా అడుగంటినా కరెంటుకు నిధులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా దెబ్బకు ఖజానా అడుగంటినా విద్యుత్ శాఖ నిధుల కేటాయింపునకు మాత్రం ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సబ్సిడీ, కాళేశ్వరం లాంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల లిఫ్టులకయ్యే కరెంటు బిల్లులకు ఎప్పటికప్పుడు నిధులను రిలీజ్ చేస్తోంది. ఏప్రిల్‌లో ప్రభుత్వ ఖజానాకు రూ.9,000 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా లాక్‌డౌన్‌తో కనీసం రూ.1,000 కోట్లు కూడా రాలేదు. అప్పులతో నిధులు సమీకరిస్తూ సంక్షేమ పథకాలకు పరిమితంగా డబ్బులిస్తూ వివిధ కేటగిరీల ఉద్యోగులకు 10 నుంచి 70 శాతం వరకు కోత విధిస్తూ ఆర్థికవ్యవస్థను నెట్టుకొస్తోంది. ఇదే సమయంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్న ట్రాన్స్‌కో, రెండు డిస్కంలకు మాత్రం సబ్సిడీ నిధులను ఎప్పటికప్పుడు ఇస్తోంది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, ఇతర సబ్సిడీలకు, నిర్వహణ వ్యయానికి కలిపి విద్యుత్ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.10,400 కోట్లు కేటాయించింది.

ఏప్రిల్ కోసమే ఉచిత విద్యుత్‌, ఇరిగేషన్ ప్రాజెక్టుల లిఫ్టుల కరెంటు బిల్లు రూ.800 కోట్లు అయింది. వీటిని జాప్యం లేకుండా ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న మొదటి త్రైమాసికంలో సబ్సిడీ నిధుల విడుదలకుగాను రూ.1,200 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా ఇచ్చింది.

రబీ సీజన్ పీక్‌లో ఉన్నపుడు…

ఈ ఏడాది ఫిబ్రవరిలో రబీ సీజన్ పీక్‌లో ఉన్నపుడు 13,168 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ వాడకం నమోదైంది. ఉమ్మడి ఏపీ విద్యుత్ వాడకం రికార్డులను తిరగరాసింది. విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన సబ్సిడీలు సైతం ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.

తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి మేధావులు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా అప్పులు తెచ్చిమరీ కాళేశ్వరం లాంటి భారీ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేస్తోంది. వాటి బిల్లుల భారం చివరకు విద్యుత్ శాఖపై పడింది. వీటన్నింటికీ బిల్లుల వసూలు లేకపోవడం వల్ల ప్రభుత్వమే నేరుగా ఖజానా నుంచి చెల్లించాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ నిధులన్నీ వన్ సైడెడ్‌గా ఒకే రంగానికి వెళ్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మేధావులు, ప్రతిపక్షాల సూచనలను సర్కారు పట్టించుకోకపోవడం వల్లే ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వ వనరులు అన్నిరంగాలకు నిధులను సమంగా ఖర్చుపెట్టే అవకాశం లేకుండా పోయిందని విమర్శించడానికి అవకాశం దొరికింది.

tags: telangana government, corona lockdown, financial crisis, power subsidies

Next Story

Most Viewed