నోటిఫికేషన్లపై నో క్లారిటీ.. కేసీఆర్ అలా.. కేటీఆర్, మంత్రులు ఇలా..!

by  |
KCR angry, KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలోనే 70 నుంచి 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. హుజురాబాద్ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మార్చేందుకే కొత్త డ్రామాలు అంటూ నిరుద్యోగ యువత ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్​మాటలు నమ్మేలా లేవని వారు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్​ప్రస్తావన తేవడం, ఆపై మరిచిపోవడం టీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2016 నుంచి ఒక్క నోటిఫికేషన్ అయిన విడుదల చేసిందా అని ప్రశ్నిస్తున్నారు.

అయితే, హుజురాబాద్​ఓటమి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా 70 నుంచి 80 వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రెస్​మీట్​పెట్టి చెప్పడంతో నిరాశలో ఉన్న యువతకు ఆశలు చిగురించాయి. దీంతో ఎంతోమంది నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాల నుంచి తిరిగి నగరం బాట పట్టారు. ఉద్యోగ నోటిఫికేషన్లపై కేసీఆర్​చెప్పిన మాటలు నమ్మేలా లేవని చెబుతూనే స్వయంగా కేసీఆరే చెప్పారు కదా.. తీరా నోటిఫికేషన్ వస్తే ప్రిపరేషన్‌కు సమయం ఉండదని ముందుగానే కోచింగ్​సెంటర్లకు వస్తున్నారు.

హుజూర్ నగర్​ఉప ఎన్నిక మొదలుకొని నిన్నటి హుజురాబాద్ బై పోల్​వరకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్లు భర్తీ అనే నినాదాన్ని అస్త్రంగా పెట్టుకొని ఎన్నికల్లో ప్రచారం చేపట్టింది. కానీ, ఒక్కటంటే ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులంటే కేసీఆర్‌కు మొదటి నుంచీ చిన్నచూపేనని యువత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల మాటలు విని అప్పులు తెచ్చుకొని మరీ హైదరాబాద్‌లో హాస్టళ్లలో ఉంటూ లైబ్రరీల్లో కుస్తీలు పడుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయే తప్ప సీఎం కేసీఆర్​మాత్రం కరుణించింది లేదని అంటున్నారు. రూమ్ రెంట్లు, హాస్టల్​అద్దెలు చెల్లించలేక, తల్లిదండ్రులకు భారం కాలేక చితికిపోతున్నట్లు చెబుతున్నారు. చదివిన చదువులకు సరైన ఉద్యోగాలు రాక, ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయక నిరాశతో ఇక ఉద్యోగం రాదేమోననే భయంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు.

రాష్ట్రంలో లక్ష 90 వేల ఉద్యోగ ఖాళీలున్నట్లు పీఆర్సీ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. కాగా ఉద్యోగాల భర్తీపై టీఆర్ఎస్​ఎమ్మెల్యేలు మాటలు దాటవేస్తూ నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఒక మాట, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తలోమాటా చెబుతూ రోజులు గడుపుతున్నారు తప్ప.. భర్తీపై స్పష్టత మాత్రం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష ఉద్యోగాలు ఒక్కసారే భర్తీ చేయాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలేదని, కాకపోతే ఎప్పుడు ఉద్యోగాలను భర్తీ చేస్తారో స్పష్టత ఇవ్వాలని వారు అడుగుతున్నామన్నారు.

ఇదిలా ఉండగా 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్పడాన్ని నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ జాబ్స్‌ను అందులో కలిపి ఎలా ప్రకటిస్తారని యువత ఆగ్రహాన్ని వెళ్లగక్కుతోంది. తెలంగాణ కోసం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాలు కోసమైతే రాష్ట్రం వచ్చి ఏడేళ్లవుతున్నా లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పులతడక అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇకకైనా సీఎం కేసీఆర్​వట్టి మాటలు పక్కనపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

కేసీఆర్‌ను ఇంకెన్నిసార్లు నమ్మాలె..

తెలంగాణలో నాలుగేండ్ల క్రితం కానిస్టేబుల్​పోస్టులకు నోటిఫికేషన్​వేశారు. ఒక గ్రూప్-1 అయితే 2012 తర్వాత ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. త్వరలో నోటిఫికేషన్లు అని చెప్పడం టీఆర్ఎస్‌కు ఫ్యాషన్​అయిపోయింది. ఎన్నికల సమయంలో చెప్పడం ఒక స్టంట్, కేవలం ఓట్ల కోసం మాత్రమే చెప్పి ఆపై నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు త్వరలో ఉద్యోగాలు అని ఎమ్మెల్యేలు, మంత్రులు చెబితే నమ్మినం. ఇప్పుడు కేసీఆర్​కూడా త్వరలో ఉద్యోగాలు అంటున్నాడు. ఇంకెన్నిసార్లు కేసీఆర్‌ను నమ్మి మోసపోవాలె. నోటిఫికేషన్ వేస్తే కచ్చితంగా నమ్ముతాం.
– బ్రహ్మారెడ్డి, నిరుద్యోగి

చదివించలేక అప్పులు పెరుగుతున్నాయి..

త్వరలో ఉద్యోగాలని చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల మాటలు విని హైదరాబాద్​నగరానికి వచ్చాం. అప్పు తెచ్చి మరీ హాస్టళ్లు, కోచింగ్​సెంటర్లలో ఫీజులు కట్టి శిక్షణ పొందుతున్నాం. అప్పులు పెరుగుతున్నాయి తప్పితే ఉద్యోగ నోటిఫికేషన్​మాత్రం ఇవ్వడంలేదు. కేసీఆర్​నోటిమాటలకే పరిమితం. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయమని అధికారులను ఆదేశిస్తున్నా కబుర్లు చెప్పడం తప్ప ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు. ఇప్పటికే నిరాశ చెందిన ఎందరో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు యువకులు చావకముందే నోటిఫికేషన్​విడుదల చేయాలి.
– రాజశేఖర్, వరంగల్

‌‌మాటలు తప్ప చేతలు లేవు..

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లపై సీఎం కేసీఆర్‌వి మాటలే తప్పా.. చేతల్లేవు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు లేవు, అభివృద్ధి కూడా లేదు. ఉద్యోగాల ప్రస్తావన వస్తే జోనల్​సిస్టం వల్ల ఆలస్యమవుతోందని చెప్పి కాలం వెళ్లదీస్తున్నారు. హుజురాబాద్​ఓటమి తర్వాత 70 నుంచి 80 వేల ఉద్యోగాలిస్తామన్నారు. దానిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అసలు భర్తీ చేస్తారా, చేయరా ప్రభుత్వం చెప్పాలి. నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్​మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు.
-బండి నరేశ్, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు


Next Story

Most Viewed