కరోనా కాదు.. కల్లు కల్లోలం

by  |
కరోనా కాదు.. కల్లు కల్లోలం
X

కల్లు దొరక్క జనం పిచ్చి చేష్టలు

దిశ, నిజామాబాద్ :

కరోనా కల్లోలంతో.. ఓ వైపు ప్రపంచమంతా కకావికలవుతుంటే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కల్లు ప్రియులకు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ తరువాత జిల్లాలో కల్లు తయారీ కేంద్రాలు( కృత్రిమ కల్లు తయారీ డిపోలు) మూతపడ్డాయి. అప్పటి నుంచి జిల్లాలో కల్లు దొరక్కపోవడంతో.. ఆ కల్లుకు అలవాటు పడ్డవారు వింత చేష్టలతో వారి కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగిస్తున్నారు. వారికి సహజ సిద్ధమైన కల్లును తాగించినా.. స్థిమిత పడటం లేదు. తమకు రోజూ అలవాటైన కృత్రిమ కల్లు కోసమే పట్టు పడుతుండటం గమనార్హం.

సాధారణంగా రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కల్లుకు అలవాటు పడ్డవారికి ఏ ఇతర మద్యం తాగినా కిక్కు ఎక్కదు. పైగా ప్రతి రోజూ సమయానికల్లా ఆ కల్లు దొరక్కపోతే వారి పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట కల్లు డిపోలను తెరిపించాలని నిజామాబాద్ రూరల్ మండలంలోని కొన్ని గ్రామాల సర్పంచులపై కల్లు ప్రియులు దాడికి యత్నించారు. నిజామాబాద్ నగరంలోని ముదిరాజ్ వీధి, శివాజీ నగర్, అంబేద్కర్ కాలనీ, ఎల్లమ్మగుట్ట, దుబ్బా, కంఠేశ్వర్ ప్రాంతాల్లో పలువురికి ఫిట్స్ రావడం, వింత వింతగా ప్రవర్తించడం ఇప్పటికే షురూ అయింది. బోదన్, ఆర్మూర్, భీంగల్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి లాంటి పట్టాణాలతో పాటు మండల కేంద్రాల్లో పలువురు కల్లు బాధితుల విచిత్ర ప్రవర్తన కేసులు వెలుగు చూశాయి. దీంతో ఏం చేయాలో తెలియక, వారికి మత్తు కారక ట్యాబ్లెట్ల కోసం కుటుంబ సభ్యులు మెడికల్ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. మత్తు బాధితులకు సేవలందించే అడిక్షన్ సెంటర్లు, ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా విస్తృతి కారణంగా మూతపడటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. కరోనా విస్తృతి కట్టడికి గ్రామాలకు గ్రామాలే తీర్మానం చేయడంతో కల్లు బాధితులను ఎలా ఆపాలో తెలియని స్థితి నెలకొంది.

తెలంగాణ పల్లెల్లో కల్లుకు ప్రాముఖ్యత ఉంటుంది. కానీ పరిస్థితులకు అనుగుణంగా ఈత, తాటి చెట్ల పెంపకం లేదు. దీంతో ప్రజల అవసరాలకు సరిపడా కల్లు దొరకని పరిస్థితి. ఇదే సమయంలో కల్లు సొసైటీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో కృత్రిమ కల్లు తయారీ కేంద్రాలు వెలిశాయి. అక్కడ నిత్యం లక్షల సీసాల కల్తీ కల్లు తయారవుతుంటుంది. నీళ్లకు తోడుగా రసాయనాలు వాడి తయారుచేసే కృత్రిమ కల్లు తయారీ దందా కోట్ల రూపాయలకు చేరడంతో ఈ రంగంలోకి పెద్ద ఎత్తున మద్యం, ఇతర వ్యాపారులు చొరబడ్డారు. కూలీ నాలీ చేసుకునే పేద ప్రజలకు ఈ కల్తీ కల్లు అలవాటు కావడంతో..వారు ఇతర మత్తు పదార్థాల జోలికి వెళ్లడం లేదు. కానీ అదే సమయంలో వారి ఆరోగ్య పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది. ఏవైనా సందర్భాల్లో కల్లు కాంపౌండ్లు మూతపడితే, కల్లు ప్రియులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు.

ఉమ్మడి జిల్లాలో అధిక డిమాండ్..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాటి, ఈత కల్లు కంటే కృత్రిమ కల్లుకే డిమాండ్ ఎక్కువగా ఉంది.
దశాబ్దాల కాలం నుంచి జిల్లా వాసులకు ఈ కల్లును పథకం ప్రకారం అలవాటు చేశారు. తొలుత గ్రామాల నుంచి సేకరించిన సహజసిద్ధమైన కల్లుకు తోడుగా క్లోరోఫాం, డైజోఫాం, అల్ఫజోలంలతో కూడిన పరిమిత మిశ్రమంతో కల్లును అందించేవారు. క్రమంగా జనం ఈ కల్లుకు అలవాటుపడ్డారు. ప్రస్తుతం పల్లెల్లో చెట్ల నుంచి సరిపడా కల్లు రావడం లేదన్నది నిజం. కానీ ధనార్జనే ధ్యేయంగా కల్లు వ్యాపారులు.. పూర్తిగా రసాయనాలతో కూడిన కల్లును తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లుకు బాధితులు ఎక్కువయ్యారు. 2012లో నాటి జిల్లా కలెక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ కల్తీ కల్లు తయారీపై ఉక్కు పాదం మోపారు. సహజ సిద్ధమైన కల్లు మినహా కల్తీ కల్లు లేకుండా చేశారు. దీంతో కోట్లలో నష్టాలు చవిచూసిన వ్యాపారులు, కల్లు దొరక్క కల్లు ప్రియులు హాహాకారాలు చేశారు. అడిక్షన్ ఫ్రీ సెంటర్లు, సైక్రియాటిస్ట్ ల పంట పండింది. ఏకంగా జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ చికిత్సలు అందించారు. బాధితులు తేరుకునేందుకు దాదాపు ఏడాది కాలం పట్టింది. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మళ్ళీ ఈ కృత్రిమ కల్లు దుకాణాలు తెరుచుకున్నాయ.

కౌన్సెలింగ్, చికిత్సలు షురూ..

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిని అరికట్టే చర్యల్లో భాగంగా కల్లు కాంపౌండ్లు మూతబడ్డాయి. గురువారం నిజామాబాద్ రూరల్ మండలం గుండారంలో అక్రమంగా నిర్వహిస్తున్న కల్లు డిపోను అబ్కారీ శాఖ సీజ్ చేసింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో కల్లు విక్రయాలు ప్రారంభించగానే ఊరుకు ఊరే తరలిరావడంతో సామాజిక దూరం పాటించని కల్లు ప్రియులపై పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. నిజామాబాద్ అధికార యంత్రాంగానికి కల్తీ కల్లు( కృత్రిమ కల్లు ) బాధితుల వ్యవహార శైలి తెలియడంతో కల్లు బాధితులకు ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధంగా ఉన్న నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి నాల్గవ అంతస్తులోని ప్రత్యేక వార్డులో అసోసియేట్ ప్రొఫెసరుతో పాటు ఎస్ఆర్ లను ఏర్పాటు చేసి వారికి కౌన్సెలింగ్, చికిత్సలు కొనసాగిస్తున్నారు.

Next Story

Most Viewed