ఫాస్టాగ్ సెక్యూరిటీ డిపాజిట్ నిబంధన తొలగింపు

by  |
ఫాస్టాగ్ సెక్యూరిటీ డిపాజిట్ నిబంధన తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ రహదారులపై టోల్ చెల్లించేందుకు ప్రభుత్వం ఫాస్టాగ్‌ను ఫిబ్రవరి 15 నుంచి తప్పనిసరి అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈ నిబంధన అమల్లోకి రావాల్సి ఉండగా, వాహనదారులను దృష్టిలో ఉంచుకుని దీన్ని ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. ఈ నెల 15 నుంచి ప్రతి వాహనదారుడు తప్పనిసరి ఫాస్టాగ్ విధానంలోనే టొల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఫాస్టాగ్ తీసుకోవాలనుకునే వారు ఛార్జీలతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా చెల్లించాల్సి ఉండేది. ఇది ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటోంది. ఒకసారి గనక ఫాస్టాగ్ తీసుకుంటే 5 ఏళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది. అయితే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) ఫాస్టాగ్ ఖాతాకు తప్పనిసరి సెక్యూరిటీ డిపాజిట్ నిబంధనను తొలగించాలని నిర్ణయించింది.

ఎన్‌హెచ్ఏఐ బుధవారం నాటి ప్రకటనలో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు, ఆలస్యం జరగ్గకుండా చూసేందుకు, ముఖ్యంగా ఫాస్టాగ్ విధానాన్ని మరింతమందికి చేరువ చేసేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. ‘పలు బ్యాంకులు డిపాజిట్ మొత్తానికి అదనంగా సెక్యూరిటీ అమౌంట్‌ను తప్పనిసరి చేస్తున్నాయి. దీనివల్ల ఎక్కువ మంది ఫాస్టాగ్ వినియోగదారులు టోల్‌ప్లాజాల వద్ద ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే, సెక్యూరిటీ డిపాజిట్ నిబంధనను తొలగిస్తే ఈ సమస్యలను అధిగమించవచ్చని’ ఎన్‌హెచ్ఏఐ తన ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం తర్వాత ఫాస్టాగ్ అకౌంట్‌లో ఎలాంటి బ్యాలెన్స్ లేకుండా టోల్‌ప్లాజా ద్వారా వెళ్లవచ్చు. ఒకవేళ అకౌంట్‌లో మైనస్ బ్యాలెన్స్ ఉంటే అనుమతి నిరాకరిస్తారు. కాగా, 2.54 కోట్లకుగా పైగా వినియోగదారులతో ఫాస్టాగ్ మొత్తం టోల్ కలెక్షన్‌లలో 80 శాతం వాటాను కలిగి ఉంది. ఇక, ఫాస్టాగ్ ద్వారా రోజువారీ టోల్ వసూళ్లూ రూ. 89 కోట్లను దాటాయి.

Next Story