ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన ఎన్‌జీటీ.. కేఆర్ఎంబీకి కీలక ఆదేశాలు

by  |
ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన ఎన్‌జీటీ.. కేఆర్ఎంబీకి కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో చుక్కెదురైంది. కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిపుణుల బృందం నేరుగా వచ్చి చేపట్టే తనిఖీ ప్రక్రియకు ఆటంకాలు కల్పించవద్దని స్పష్టం చేసింది. తనిఖీలు చేపట్టాల్సిన అవసరం లేదని, డీపీఆర్ తయారీ కోసం అధ్యయనం మాత్రమే జరుగుతున్నదని ఏపీ ఇచ్చిన వివరణపై ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని స్వయంగా తనిఖీ చేసి ఆగస్టు 9వ తేదీకల్లా నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీకి స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండానే తనిఖీ చేయాలని, నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్జీటీ స్పష్టం చేసింది.

ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ప్రాజెక్టును నిర్మిస్తున్నదంటూ నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన ఎన్జీటీ పై క్లారిటీ ఇచ్చింది. గత విచారణ సందర్భంగా కేఆర్ఎంబీకి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసి ప్రాజెక్టును ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని నొక్కిచెప్పింది. ఈ విషయంపై బోర్డు ఒక అఫిడవిట్‌ను దాఖలుచేసి ఏపీ ప్రభుత్వం తమను క్షేత్రస్థాయి తనిఖీకి అనుమతించడంలేదని, నోడల్ అధికారిని నియమించలేదని, పదేపదే ఆటంకాలను కల్పిస్తున్నదని, కేంద్ర బలగాల అవసరం ఏర్పడిందని ఎన్జీటీకి మొరపెట్టుకున్నది. ఏపీ ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేకపోగా ఆంక్షలు ఎదురవుతున్నాయని పేర్కొన్నది.

దీనికి స్పందించిన ఏపీ ప్రభుత్వం, ప్రాజెక్టు సందర్శన కోసం నిపుణుల బృందం ఈ సమయంలో రావాల్సిన అవసరం లేదని, అక్కడ పనులేమీ జరగడం లేదని, కేవలం డీపీఆర్ తయారీ కోసం ప్రాజెక్టు విషయంలో అధ్యయనం మాత్రమే జరుగుతున్నదని వివరించింది. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ, కేంద్ర జల సంఘం అడిగిన అంశాలపై మాత్రమే అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నది. అన్ని వివరాలను అఫిడవిట్ రూపంలో అందిస్తామని పేర్కొన్నది.

తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎన్జీటీ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ నిపుణుల బృందం తనిఖీకి వెళ్లడానికిన అవసరమైన హెలికాప్టర్‌ను, ఇతర అవసరాలను తాము సమకూరుస్తామని ఎన్జీటీకి వివరించింది. ఇందుకు సొంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నది. ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీ నిపుణుల బృందం పర్యటించడానికి అనుమతి ఇవ్వడంలేదని, సహకరించడం లేదని స్వయంగా అఫిడవిట్‌ రూపంలోనే చెప్పినందున ఇకపైన ఎన్జీటీ బృందాన్ని పంపించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అన్ని వైపుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ బెంచ్, ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగానే ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆగస్టు 9వ తేదీలోగా నివేదిక సమర్పించాలని కేఆర్ఎంబీకి స్పష్టం చేసిన ఎన్జీటీ ఆ తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నది. విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది.


Next Story