పెద్దసారు మాటిచ్చారు.. టీఆర్ఎస్ ​లీడర్లకు కొత్త టెన్షన్

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ​లీడర్లకు కొత్త టెన్షన్​పట్టుకుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్​హాలియాలో పేల్చిన బాంబ్‎తో ఉమ్మడి నల్గొండ జిల్లాల నేతల్లో మరింత భయం పట్టుకుంది. ఈసారి ఎవరికి మొండి చేయి చూపిస్తారనే చర్చ సాగుతోంది. నాగార్జున సాగర్​అసెంబ్లీ టికెట్​కోసం పోటీ పడిన ఎంసీ కోటిరెడ్డికి సీఎం కేసీఆర్ హాలియా సభా వేదికగా హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి వస్తుందని ప్రకటించారు. అయితే ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మండలి ఛైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డితో పాటుగా మండలి డిప్యూటీ చైర్మన్​నేతి విద్యాసాగర్​ ఉన్నారు. వీరిద్దరూ అసెంబ్లీ కోటాలోనే ఎన్నికయ్యారు.

సీనియర్‌కు హ్యాండా..?

రాష్ట్రంలో ఈ ఏడాది జూన్‌లో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తోంది. అసెంబ్లీ కోటాలోని ఎమ్మెల్సీలు ఆకుల లలిత, ఫరీదుద్దీన్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. అయితే పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్సీలు మళ్లీ పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్సీగా చేసి చైర్మన్‎గా కొనసాగించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కానీ, గుత్తా మాత్రం తనను కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎంకు మొర పెట్టుకున్నట్లు టాక్. ఇక నేతి విద్యాసాగర్ రావు మండలి ఏర్పాటు (2007) నుంచి వరుసగా 14 ఏండ్లు నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈసారి ఆయనకు చాన్స్ తక్కువే అని టీఆర్ఎస్ నేతల్లో ప్రచారం జరుగుతోంది. అయినా నేతి మాత్రం కొంత ధీమాతో ఉన్నారు. సీఎం కేసీఆర్​ తనకు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఎంసీ కోటిరెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సాగర్​ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడి టికెట్​కోసం ఆయన సీఎంపై ఒత్తిడి తెచ్చారు. అయితే, గతంలోనే అక్కడ రెడ్డివర్గం టీఆర్‎​ఎస్‎​కు వ్యతిరేకంగా ఉందని, నోముల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోటిరెడ్డితో పాటు పలువురిని అణగదొక్కాడనే టాక్​ఉంది. దీంతో ఈ వర్గం నోములపై చాలా అసత్య ప్రచారాలు చేసిందని కూడా గులాబీ బాస్‎​కు ఫిర్యాదులున్నాయి.

నోముల మృతితో ఇక్కడ పోటీ చేసేందుకు ఇదే సరైన సమయనే కోణంలో కోటిరెడ్డి టికెట్​కోసం ప్రయత్నించారు. పలు కారణాలతో నోముల తనయుడు భగత్‎​కే అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెడ్డివర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా చెప్పుకునే ఎంసీ కోటిరెడ్డి ఒక దశలో బీజేపీ వైపు వెళ్లేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో ఆయన్ను స్వయంగా పిలుపించుకున్న సీఎం కేసీఆర్​ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామంటూ హామీ ఇచ్చారంటున్నారు. అనుకున్నట్లుగానే హాలియా సభలో ప్రకటన చేశారు. కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇప్పుడున్న ఇద్దరిలో ఎవరికి చెక్​పెడుతారనేది చర్చగా మారింది. సీనియర్​నేతగా ఉన్న గుత్తా సుఖేందర్​రెడ్డిని తప్పించి ఖాళీగా కూర్చుండబెట్టడం కరెక్ట్​కాదనే భావన పార్టీ వర్గాల్లో ఉంది. అందుకే గుత్తాకు తిరిగి అవకాశం వస్తుందంటున్నారు. ఈసారి నేతి విద్యాసాగర్​పదవికే ఎసరు వస్తుందనే ప్రచారం గులాబీ శ్రేణుల్లో సాగుతోంది.



Next Story

Most Viewed